Telangana: మసకబారుతున్న ఐదో శక్తి పీఠం ప్రతిష్ఠ.. అర్చకులు, ఆఫీసర్లపై ఆరోపణల దూమారం.
జోగులాంబ ఆలయం... దేశంలోనే ఐదో శక్తిపీఠం. ఇంతటి ప్రసిద్ధ క్షేత్రంలో ఆలయ పాలన అస్తవస్త్యంగా మారింది. అర్చకులు, ఆఫీసర్లపై ఆరోపణలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఆలయంలో అన్ని తానై చక్రం తిప్పుతూ ఓ పూజారి ఎకంగా ఎమ్మెల్యే వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే... అందినకాడికి దోచుకుంటున్నాడని ఈవోపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చి కొంగుబంగారంగా నిలుస్తున్న అలంపూర్ క్షేత్రాన్ని అర్చకులు, అధికారులు ఆగం చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.

దేశంలోనే ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ ఆలయ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని భక్తులు మండిపడుతున్నారు. ఆలయ ప్రధాన పూజరి, ఈవోపై వరుస ఫిర్యాదులు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ప్రధాన అర్చకుడు ఆలయాన్ని వదిలి ఎమ్మెల్యే వ్యక్తిగత అంశాల్లో జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇక భక్తుల కానుకలు, తప్పుడు బిల్లులు, భూముల అన్యాక్రాంతం చేస్తున్నారంటూ ఆలయ ఈవోపై అవినీతి ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
వివాదాస్పదంగా ప్రధాన అర్చకుడి వ్యవహారశైలి:
జోగులాంబ ఆలంయలో ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ వ్యవహారశైలి తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వైపు ఆలయంలో అన్నీ తానై చక్రం తిప్పుతూనే బయట విషయాల్లో జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. అర్చకులకు ఆలయంలో నిత్యం జరిగే పూజల వరకే వారి పాత్ర పరిమితం. కానీ జోగులాంబ ఆలయంలో మాత్రం అంతా అర్చకుడు ఆనంద్ శర్మ కనుసన్నల్లోనే జరగాలి. లేకపోతే అంతే సంగతులు. ఆలయంలోని మిగతా ఆర్చకులను, ఆలయ సిబ్బంది, ఈవో ఇలా అందరినీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం ఆయన నైజమట. వాస్తవానికి తండ్రి మరణంతో జోగులాంబ ఆలయంలో పూజారి ఉద్యోగం పొందాడు ఆనంద్ శర్మ. ఆలయానికి వచ్చే వీఐపీ భక్తులను తన మాటలతో, పూజలతో మచ్చిక చేసుకుంటాడు. వీఐపీలకు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి… తిరిగి బయటకు వెళ్ళే వరకు వారి వెంటే ఉంటాడు. వారితో పరిచయం పెంచుకొని ఆలయంలో ఇష్టారీతిన వ్యవహరిస్తుంటాడని విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా వారి నుంచి ఆర్థికంగా లబ్ధి పొందుతాడని ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఆ మధ్య కర్నూల్ లో తన భార్యాపిల్లలతో సినిమాకు వెళ్లిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని ఆనంద్ శర్మ చాటుగా ఫోటోలు, వీడియో లు తీయడం తీవ్ర దుమారం రేపింది. విషయం గమనించిన ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. అసలు ప్రసిద్ధ ఆలయ ప్రధాన అర్చకుడు ముఖానికి మాస్క్ వేసుకొని చాటుగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఫోటోలు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది అంతుచిక్కడం లేదు. జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే పూజారి ఆనంద్ శర్మపై కర్నూల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడు. ఇదంతా కుట్రలో భాగంగా జరుగుతున్నదని భావించి దేవదాయ శాఖ అధికారులకు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు, అసెంబ్లీ స్పీకర్ కు సైతం ఫిర్యాదు చేశాడు. దీంతో ఆలయ ప్రధాన అర్చకుడిపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విచారణను వేగవంతం చేశారు.
అర్చకుడు వ్యవహారంపై ఆలయ ఈవో పూర్తి నివేదికను అసెంబ్లీ కార్యదర్శికి, దేవాదాయ శాఖ కమిషనర్ కు పంపించారు. దీనికి తోడు ఆనంద్ శర్మ పై దాఖలైన ఫిర్యాదుపై కర్నూల్ పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆనంద్ శర్మపై శాఖ పరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడి వివాదాస్పద వ్యవహారశైలి పట్ల అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదోశక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు. బాధ్యతయుతమైన అర్చక వృత్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆనంద్ శర్మపై చర్యలు తీసుకోవాలని పలువురు అర్చకులు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఆనంద్ శర్మపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఫిర్యాదులో తెలిపారు.
ఆలయ ఈవో పై అవినీతి ఆరోపణలు:
మరోవైపు ఆలయ ఈవో పురేందర్ పై అవినీతి ఆరోపణలు సంచలనంగా మారాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ ఆదాయానికి సంబందించి ఆడిట్ నిర్వహించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల నుంచి వచ్చే కానుకలు, నగదు లెక్కలకు సంబంధించిన రికార్డులు నిర్వహించడం లేదని ఉన్నాతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దాతలు ఇచ్చిన వస్తువులను తామే కొన్నట్లు బిల్లులు దండుకుటున్నారని ఆరోపణలు ఉన్నాయి. దేవాలయ భూముల కౌలు వసూలు చేయకుండా వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నారని పలువురు అధికారులకు ఫిర్యాదుల చేశారు. ఏది ఏమైన అటూ ప్రధాన అర్చకుడిగా ఉంటూ ఆనంద్ శర్మ తీరు ఆలయ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. దేశంలోనే ఐదోశక్తిపీఠంగా దేదీప్యమానంగా వెలగాల్సిన ఆలయ ప్రతిష్ఠ ఇలాంటి పూజారి, ఈవో కారణంగా మసకబారుతుందని ఆవేదన వ్యక్తం అవుతోంది. తక్షణమే ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈవో పురేందర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..