Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..

అమ్మ ఆరాధనలో అంతరార్థం ఎంతో ఇమిడి ఉంది. దసరా పండగ సరదా వెనక ఆధ్యాత్మికత దాగి ఉంది. అంతే కాదు ఈ రోజు జమ్మి చెట్ట, పాలపిట్టకు చాలా ప్రత్యేకత ఉంది.

Dasara - Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..
Shami Plant
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Oct 15, 2021 | 10:54 AM

ఇప్పుడంతా దసరా సందడే. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. దేవాలయాలన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో కళకళలాడిపోతున్నాయి. ఒకవైపు శరన్నవరాత్రోత్సవాలు.. తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఈ పండుగకు ఓ విశిష్టత ఉంది. స్త్రీ శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఇది. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు రోజుకో అవతారంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని ఘనంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణలో తమ పల్లెల్లో దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి భక్తి శ్రద్ధలతో గౌరమ్మను కొలుస్తారు. అయితే అమ్మ ఆరాధనలో అంతరార్థం ఎంతో ఇమిడి ఉంది. దసరా పండగ సరదా వెనక ఆధ్యాత్మికత దాగి ఉంది. అంతే కాదు ఈ రోజు జమ్మి చెట్ట, పాలపిట్టకు చాలా ప్రత్యేకత ఉంది.

దుర్గానామం, దుర్గాజపం శుభప్రదం, శుభకరం. అమ్మ రూపాన్ని దర్శించినా..అమ్మ నామాన్ని జపించినా మంచి జరుగుతుంది. దుర్గాదేవి చల్లని చూపు ఉంటే అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. అదే విజయాలను అందించే విజయదశమి ప్రత్యేకత.

దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం సనాతన సంస్కృతిలో భాగం. కానీ ఈ దసరా రోజుకీ జమ్మి చెట్టుకీ మధ్య అనుబంధం చాలా ఉంది.

జమ్మి చెట్టు గురించి..

జమ్మి చెట్టు భారతీయులకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించిందన్నది శాస్త్రవేత్తలు చెప్పారు. అందుకనే రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలోనూ.. వేదాలలోనూ తరచూ వినే ‘అరణి’ని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం జీవిస్తుంది. అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్తాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ వరకు పొడి ప్రాంతాలలోని ప్రజలకు జమ్మి జీవనాధారంగా నిలుస్తోంది.

నగరవాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే మహా ప్రాణం. దీని జమ్ము చెట్టు కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి. దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా.. దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు.

ఏడాదిపాటు అజ్ఞానవాసానికి బయల్దేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి.. తమ ఆయుధాలను తీసుకున్నారు పాండవులు. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే వారు యుద్ధంలో విజయాన్ని అందుకున్నారని మహాభారతంలో చెప్పారు.

కేవలం పాండవులే కాదు..  రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనదని చెబుతారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాములవారికి లభించబట్టే ఆయన రావణునితో జరిగిన యుద్ధంలో విజయాన్ని సాధించారని చెబుతారు. జమ్మి చెట్టుకి మన పురాణాలలోనూ.. నిజ జీవితాలలోనూ ఇంతటి అనుబంధం ఉందికాబట్టే దసరారోజు జమ్మిచెట్టుకి చాలా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అంతే కాదు ఇలా దసరా రోజు శమీవృక్షానికి ప్రదక్షిణలు చేసి ఈ శ్లోకాలను చెప్పాలంటారు..

‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ, అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.’’

‘’శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా, ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ, కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా, తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.”

దసరా బంగారం..

పూజ ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్నా ఆధ్మాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా కుబేరుడు ఒకనాడు రఘమహారాజుకి భయపడి జమ్మిచెట్లున్న తావున బంగారాన్ని కురిపించాడనే గాథ  ప్రచారంలో ఉంది. అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మిని పెద్దల చేతిలో ఉంచి వారి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి మనోకామన నెరవేరాలని తమ దీవెనలను కూడా అందిస్తారు. జమ్మిచెట్టు, పాలపిట్ట తిరిగి మన జీవితాలలో భాగమైనప్పుడే అసలైన విజయదశమి!

ఇవి కూడా చదవండి: Modi Government: దసరా పండుగ వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం…

Amit Shah: మరోసారి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తప్పవు.. పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చిన హోంమంత్రి అమిత్ షా