Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత తెలుసుకోండి

సిక్కుమతంలో అతి పెద్ద పండగ గురునానక్ జయంతి. సమానత్వం, ప్రేమ, సేవకు ప్రతీక అయిన గురునానక్ జన్మదిన వేడుక. ఈ రోజున సిక్కులు కీర్తన, అఖండ మార్గం, లంగర్ నిర్వహించడం ద్వారా గురు నానక్ బోధనలను గుర్తు చేసుకుంటారు. సేవ, దాతృత్వం, దేవుని పట్ల భక్తిని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు

Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత తెలుసుకోండి
Guru Nanak Jayanti 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2024 | 8:04 PM

గురునానక్ జయంతి సిక్కులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీనిని “గురుపర్వ” లేదా “ప్రకాష్ పర్వ” అని కూడా అంటారు. సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ దేవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. గురునానక్ దేవ్ జీని సిక్కు మతాన్ని స్థాపించాడు. ఇతని సిక్కు మతస్తుల మొదటి గురువు. గురు నానక్ జయంతి పండుగ సిక్కులకు చాలా ప్రత్యేకమైనది. ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున అన్ని గురుద్వారాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం గురునానక్ జయంతిని ఏ రోజు జరుపుకుంటారో తెలుసుకుందాం.

గురునానక్ జయంతి తేదీ ఎప్పుడంటే

ప్రతి సంవత్సరం గురునానక్ జయంతి పండుగను కార్తీక మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి తిధి నవంబర్ 15వ తేదీన వచ్చింది. కనుక ఈ ఏడాది గురునానక్ జయంతి పండుగను 15 నవంబర్ 2024 న జరుపుకుంటారు. ఈ సంవత్సరం గురునానక్ 555వ జయంతిని జరుపుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

కార్తీక పౌర్ణమి రోజునే గురునానక్ జయంతి ఎందుకంటే

గురునానక్ దేవ్ జీ 1469వ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి రోజున జన్మించారని.. అప్పటి నుంచి నేటి వరకు ఆయన జయంతిని ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. “అఖండ మార్గం” గురునానక్ జయంతికి రెండు రోజుల ముందు నిర్వహించబడుతుంది. దీనిలో గురు గ్రంథ్ సాహిబ్ ను 48 గంటలపాటు నిరంతరం పఠిస్తారు. ఈ పఠనం గురునానక్ జయంతి రోజున ముగుస్తుంది. గురునానక్ జయంతి రోజున ఉదయం “నగర కీర్తన” నిర్వహిస్తారు.

నగర కీర్తనలో సిక్కులు షాబాద్ కీర్తనను పాడతారు. గురుగ్రంథ సాహిబ్‌ను ఊరేగింపులో తీసుకువెళతారు. ఈ రోజున గురుద్వారాలలో కీర్తనలు , ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక్కడ గురునానక్ దేవ్ జీ బోధనలను వినిపిస్తారు. ఇలా సిక్కులు తమ గురువు చెప్పిన సందేశాలను గుర్తు చేసుకుంటారు. వాటి నుంచి ప్రేరణ పొందుతారు. ఈ రోజున గురుద్వారాలలో ప్రత్యేక లంగర్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో అన్ని మతాలు, కులాల ప్రజలు ఒకచోట కూర్చొని భోజనం చేస్తారు.

లంగర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం సమానత్వం, సోదరభావం సందేశాన్ని అందించడం. ఈ సందర్భంగా కొన్ని చోట్ల దీపాలు వెలిగించి గురుద్వారాలను అలంకరిస్తారు. ఈ రోజున ప్రజలు పేదలకు ఆహారాన్ని అందిస్తారు. బట్టలు దానం చేయడం, సామాజిక సేవకు సంబంధించిన పనులు చేయడం వంటి సేవ, దానధర్మాలను కూడా చేస్తారు.

గురునానక్ జయంతి ప్రాముఖ్యత

గురునానక్ జయంతి ప్రాముఖ్యత ఏమిటంటే.. సిక్కుమతం మొదటి గురువుగా పరిగణించబడే గురునానక్ దేవ్ జీ జీవితం, బోధనలను గుర్తుంచుకోవడం. గురునానక్ దేవ్ జీ ఎల్లప్పుడూ సమానత్వం, ప్రేమ, సేవ, నిజాయితీ సూత్రాలను ఉద్ఘాటించారు. ఈ రోజున ప్రజలు కుల, మతాలకు అతీతంగా అందరి పట్ల సోదరభావం, సహన స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించాడు. గురునానక్ దేవ్ జీ భగవంతుని నామాన్ని జపించండి, నిజాయితీగా పని చేయండి.. పేదవారికి పంచి అనంతరం తినండి అని చెప్పాడు. ఈ పండుగ నిస్వార్థ సేవా స్ఫూర్తిని, మానవత్వం గురించి అయన చెప్పిన విషయాలు జీవితంలో అనుసరించడానికి, అమలు చేయడానికి ఒక పవిత్ర సందర్భం.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.