Telangana: ఇతరులకు మేలు చేస్తే.. శివుడే మనకు మేలు చేస్తాడు.. శివుడికి శరణాగతి చేస్తే అన్నీ సాధ్యమే అన్న తమిళిసై
ఇతరులకు మేలుచేస్తే శివుడే మనకు మేలు చేస్తాడు.. అందరినీ సంతోషపరచడమే మన తారకమంత్రం కావాలన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. నేను శివుడి అనుగ్రహాన్ని అనుభవిస్తున్నాను. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఓరుగల్లుకు రావడమే అందుకు ఉదాహరణ అని చెప్పారు. హనుమకొండలో మహాశివరాత్రి వేడుకల్లో గవర్నర్ పాల్గొనడం ప్రత్యేకత సంతరించుకుంది.
హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా శివరాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.. ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అంతకు ముందు నిట్ కు చేరుకున్న గవర్నర్ తమిళిసైకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీపీ రంగనాథ్ స్వాగతం పలికారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అచ్చ తెలుగులో ప్రసంగించి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఇతరులకు మేలు చేస్తే.. శివుడే మనకు మేలు చేస్తాడు. అందరినీ సంతోష పెట్టడమే మన లక్ష్యం కావాలని.. మనం సంతోషంగా ఉందాం.. అందరినీ సంతోష పరుద్దాం అనేదే మన తారక మంత్రం కావాలనాన్నరు. ‘నేను శివుడి అనుగ్రహాన్ని అనుభవిస్తున్నాను. వేల కిలో మీటర్లు ప్రయాణించి ఇక్కడికి రావడమే అందుకు ఉదాహరణ అని అన్నారు. ఉదయం జార్ఖండ్ గవర్నర్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు రాంచీకి వెళ్లి.. అంతదూరం నుంచి వరంగల్ లో శివరాత్రి ఉత్సవాలకు రాలేనని కొందరు అన్నారు. కానీ ఆ శివుడే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడని, 3,800 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చారు.
శివుడికి శరణాగతి చేస్తే అన్నీ సాధ్యమే’ అవుతాయని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఫ్లయిట్ లో ఒకరికి ఛాతి నొప్పి వచ్చిందని.. ఆయనను తానే కాపాడాననని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. కాశీ విశ్వనాథుడే ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం తనకు ఇచ్చాడని చెప్పారు. స్త్రీ, పురుషులు సమానమని గ్రహించినవాడు శివుడని, అందుకే అర్ధనారీశ్వరుడిగా దర్శనం ఇస్తాడని అన్నారు. అందరి సంతోషమే మన సంతోషని, అందరి ఆరోగ్యమే మన ఆరోగ్యమన్నారు. అందరినీ గౌరవిస్తూ.. సంతోష పరచాలని, అప్పుడు శివుడు కూడా మనకు సహాయం చేస్తాడని చెప్పారు.
వరంగల్ కు రావడం తనకు గర్వంగా ఉందని, ఓరుగల్లు కాకతీయ రాజులు పాలించిన ప్రాంతమని, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పుట్టిన గడ్డ అని గవర్నర్ అన్నారు. యునెస్కో గుర్తింపుపొందిన రామప్ప నెలవై ఉన్న ప్రదేశమని, శివరాత్రి ఉత్సవాలకు ఓరుగల్లు రావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని శివుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో విశేష కృషి చేస్తున్న వ్యక్తులతోపాటు వివిధ రంగాల్లో రాణించిన వారికి గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. తర్వాత ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..