President Murmu: చీకటికి, అజ్ఞానానికి ముగింపు మహాశివరాత్రి.. ఆదియోగి సేవలో రాష్ట్రపతి..
మహాశివరాత్రి మనలోని చీకట్లను తొలగించి సుసంపన్నమైన జీవితాన్ని గడపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహా శివరాత్రి కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సద్గురు జగ్గీ వాసుదేవన్ ఆధ్వర్యంలో వేడుకలు కనీవినీ ఎరుగనిరీతిలో నిర్వహించారు. తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోయింది. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులతోపాటు వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ అతిథిగా హాజరై.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీటితో పాటు తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ రవి, తమిళనాడు ఐటీ శాఖ మంత్రి తిరు మనో తంగరాజ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. ఆదియోగి నివాసంలో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం. మనం శివుడిని తండ్రి అని పిలుస్తాం. అతడిని అర్ధనారీశ్వర రూపంలో సగం శివుడిగా, సగం అమ్మవారిగా దర్శిస్తాం. సృష్టిని రెండు వైపులా బ్యాలెన్స్ చేయడమే మహాదేవుడి లక్ష్యం అని అన్నారు. శివుడు అందరికీ ఆరాధ్యదైవం. శివుడు గృహస్థుడు మాత్రమే కాదు సన్యాసి కూడా.. ఈ జగత్తుకు మొదటి యోగి, మొదటి జ్ఞాని కూడా.. పరమశివుడు దయగల దేవుడని అన్నారు.
కానీ, కొందరు అతడిని భయపెట్టే దేవతగా చిత్రీకరించాని.. శివుని మరో పేరు రుద్రుడు. అందుకే రాముడు, రావణుడు శివుడిని పూజించారు. పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని ఆదియోగి సన్నిధిలోకి జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మహాశివరాత్రి చీకటికి, అజ్ఞానానికి ముగింపు పలికి జ్ఞానానికి మార్గం తెరిస్తుందని అన్నారు.
జీవితంలో ఉన్నతమైన ఆశయాల కోసం వెతుకుతున్న వారికి ఈరోజు చాలా ముఖ్యమైన సందర్భమని, ఈ మహాశివరాత్రి మనలోని చీకట్లను పారద్రోలి మనందరినీ మరింత సంతృప్తికరమైన , ప్రగతిశీలమైన జీవితానికి నడిపించాలని ఆకాంక్షించారు. శివరాత్రి ఆధ్యాత్మిక కాంతి మన జీవితంలోని ప్రతి రోజు మన మార్గాన్ని ప్రకాశవంతం చేయాలని రాష్ట్రపతి ప్రార్థించారు.
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ సహకారాన్ని ప్రశంసించారు. సద్గురు ఆధునిక కాలపు జ్ఞాని అని, మన దేశంతోపాటు విదేశాలలో ఉన్న అసంఖ్యాక ప్రజలు ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక పురోగతిని సాధించడంతో ఎంతగానో క్రుషి చేశారని అన్నారు. ఆయన మాటలు, చేతల ద్వారా మనకు సామాజిక బాధ్యతను కూడా బోధిస్తున్నారని గుర్తు చేశారు.ఈ శివరాత్రి వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘పంచ భూత క్రియ’ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం