AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల్లో లోపాలకు తల్లిదండ్రుల పాపపుణ్యాలే కారణమా..? అసలు విషయం చెప్పిన గరికపాటి

పిల్లలకు వచ్చే వైద్యం లేని అనారోగ్యాలకు తల్లిదండ్రుల పూర్వజన్మ కర్మ కారణం కాదని గరికిపాటి నరసింహారావు స్పష్టం చేశారు. ఆధునిక జీవనశైలి, ఇతర కారణాలు ఇటువంటి వ్యాధులకు దారితీస్తున్నాయని ఆయన వివరించారు. సరైన వైద్యం, వ్యక్తిగత ప్రయత్నం చేయాలని, మానసిక ఉపశమనం, ఆధ్యాత్మిక శక్తి కోసం నామస్మరణ, ఈశ్వరారాధన అవసరమని సూచించారు.

పిల్లల్లో లోపాలకు తల్లిదండ్రుల పాపపుణ్యాలే కారణమా..? అసలు విషయం చెప్పిన గరికపాటి
Childhood Illnesses
Rajashekher G
|

Updated on: Feb 09, 2026 | 4:59 PM

Share

పిల్లల్లో లోపాలకు తాము గత జన్మోల చేసిన పాపాలే కారణమై ఉంటాయని కొందరు తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అయితే, దీనికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు స్పష్టమైన సమాధానం తెలియజేశారు. ప్రజ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక, సాహిత్య సంబంధమైన అనేక సందేహాలకు పరిష్కారాలను అందిస్తున్న డా. గరికిపాటి నరసింహారావు.. పిల్లలకు వచ్చే అనారోగ్యాలకు, లోపాలకు తల్లిదండ్రుల పూర్వజన్మ పాపపుణ్యాలు కారణమా అనే సందేహాన్ని నివృత్తి చేశారు. హైదరాబాద్‌కు చెందిన వైద్యవృత్తిలో ఉన్న డా. పద్మనాభ వర్మ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ అంశంపై ఆయన సుదీర్ఘంగా వివరించారు.

ఇది క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు..

గరికిపాటి.. అత్యంత స్పష్టంగా, పిల్లలకు వైద్యం లేని రోగాలు రావడానికి తల్లిదండ్రుల పూర్వజన్మ కర్మకు ఎటువంటి సంబంధం లేదని మూడుసార్లు నొక్కి చెప్పారు. ఈ భావన ఒక అబద్ధమని, అంతేకాకుండా తల్లిదండ్రులకు అపకారం చేస్తుందని అన్నారు. పూర్వజన్మ కర్మను కారణంగా చూపడం సమాజానికి పట్టిన క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు అని ఆయన అభివర్ణించారు.

అసలు కారణం ఇదే..

పిల్లల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను ఆయన ఉదాహరించారు. ప్రస్తుతం నూటికి పదిహేను మంది పిల్లలకు మాట రాకపోవడం (ఆటిజం వంటివి), నూటికి ఏడుగురికి వినికిడి సమస్యలు ఉన్నాయని తెలిపారు. వీటికి ఆధునిక జీవనశైలి కారణమని, గర్భిణులు ల్యాప్‌టాప్‌లు ఒళ్ళో పెట్టుకుని పనిచేయడం వల్ల లేజర్ కిరణాల ప్రభావంతో పిండంలో అవయవాలు సరిగా ఏర్పడకపోవచ్చని ఒక సంఘటనను ఉదాహరణగా చెప్పారు. జన్మాంతర సంబంధం కాకుండా, ప్రస్తుత పరిస్థితులే అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని ఆయన ఉద్ఘాటించారు.

పాపపుణ్యాలే కాదు..

కార్య-కారణ సిద్ధాంతాన్ని వివరిస్తూ.. వ్యాసుడు మహాభారతంలో చెప్పిన “న కర్మణా లభ్యతే చింతయా వా, నాప్యస్తి దాతా పురుషస్య కశ్చిత్, పర్యాయ యోగేణ హితం విధాత్రా, కాలేన సర్వం లభతే మనుష్యః” శ్లోకాన్ని ఉటంకించారు. కేవలం పుణ్యకర్మల వల్ల అంతా మంచి జరుగుతుందని, ఆత్మచింతన వల్ల శుభాలు కలుగుతాయని అనుకోవడం పొరపాటు అని వ్యాసుడు స్పష్టం చేశాడని వివరించారు. మానవ ప్రయత్నం తప్ప ఎవరో వచ్చి అనుగ్రహిస్తారని అనుకోవడం పొరపాటు అని ఆయన అన్నారు. యోగవాసిష్ఠం, శంకరాచార్యులు, వివేకానందులు సైతం ప్రయత్నానికే అధిక ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

నిందించుకోకుండా..

అలాగే, పిల్లలున్న ఇళ్లలో పెద్దవాళ్లు ఉండటం వల్ల పిల్లలకు మాటలు నేర్చుకోవడానికి, స్పందించడానికి అవకాశం ఉంటుందని గరికిపాటి సూచించారు. పెద్దలను దూరం పెట్టడం వల్ల పిల్లలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల అనారోగ్యానికి తమను తాము నిందించుకోవడం వల్ల మానసికంగా కుంగిపోతారని, ఇది పిల్లలకూ మంచిది కాదని పేర్కొన్నారు.

వారి జీవితాలే ఉదాహరణలు

ఉపశమన మార్గాన్ని సూచిస్తూ.. ప్రాకృతికంగా జరిగే విషయాలకు చింతించవద్దని, చేయగలిగిన వైద్యం చేయించాలని అన్నారు. తగ్గకపోతే, అది మన ప్రాప్తంగా భావించి, మన ధర్మాన్ని నిర్వర్తించాలని సూచించారు. అష్టావక్రుడు, శంకరాచార్యుల శిష్యుడైన హస్తామలకుడు వంటి వారి జీవితాలను ఉదాహరణలుగా చూపారు. హస్తామలకుడి విషయంలో, ఆయన జన్మాంతర జ్ఞానంతో నిరంజనాష్టకం చదివిన వైనాన్ని ప్రస్తావించారు.

అనుకూల సమయం వస్తుంది..

దైవారాధనను మానవద్దని, నామస్మరణ (నమశ్శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః) ద్వారా భావ తీవ్రతను పెంచడం వల్ల సమస్యలకు పరిష్కారం, వైద్యం లభించే అవకాశం ఉంటుందని గరికిపాటి నొక్కి చెప్పారు. కాల నిర్ణయం ప్రకారం మంచివారికైనా కష్టాలు వస్తాయని, వాటిని తట్టుకోవడమే జీవితమని అన్నారు. అన్ని శక్తులను మార్చగలిగిన ఆదిపరాశక్తిని ప్రార్థించాలని సూచించారు. కలియుగంలో దానం, స్మరణ అనే రెండు మార్గాలు ప్రధానంగా పని చేస్తాయని మహాభారతం చెప్పిన మాటను గుర్తుచేస్తూ.. అవి ఆచరించడం ద్వారా అనుకూల సమయం లభిస్తుందని గరికిపాటి నరసింహారావు తమ ప్రసంగాన్ని ముగించారు.