French Open 2026 : 26 ఏళ్ల రికార్డు బద్దలు.. వైల్డ్‌కార్డ్‌తో వచ్చి టెన్నిస్ ప్రపంచాన్ని వణికించిన నెల్లూరు కుర్రాడు
French Open 2026 : ఫ్రెంచ్ ఓపెన్ 2026 లో భారతీయ సంతతికి చెందిన నిశేష్ బసవరెడ్డి ప్రపంచ 7వ సీడ్ టైలర్ ఫ్రిట్జ్ ను ఓడించి సంచలనం సృష్టించాడు. చిన్నతనంలోనే అతను రెండు సార్లు మోకాళ్ల సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది.

French Open 2026 : ఫ్రెంచ్ ఓపెన్ 2026 టోర్నీలో ఆదివారం మధ్యాహ్నం ఒక అద్భుతం జరిగింది. పారిస్ నగరంలోని ప్రసిద్ధ రోలాండ్ గారోస్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో.. ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ 148వ ర్యాంకర్, 21 ఏళ్ల భారతీయ సంతతి అమెరికన్ కుర్రాడు నిశేష్ బసవరెడ్డి సంచలన విజయం సాధించాడు. టోర్నీలో 7వ సీడ్‌గా బరిలోకి దిగిన అమెరికా టాప్ ప్లేయర్ టైలర్ ఫ్రిట్జ్‌ను నిశేష్ దారుణంగా ఓడించాడు. మూడు గంటల 25 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరులో నిశేష్ 7-6(5), 7-6(5), 6-7(9), 6-1 తేడాతో విజయం సాధించి, ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లోనే అత్యంత పెద్ద అప్‌సెట్‌ను నమోదు చేశాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వచ్చి తన కెరీర్‌లో మొదటిసారి ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రా మ్యాచ్ ఆడుతున్న నిశేష్ ఈ రేంజ్‌లో ఆడతాడని టెన్నిస్ పండితులు సైతం ఊహించలేదు.
ఈ మ్యాచ్‌లో టైలర్ ఫ్రిట్జ్ ఏకంగా 21 ఏస్‌లు కొట్టి నిశేష్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని చూశాడు. కానీ నిశేష్ ఎక్కడా బెదరలేదు. నెట్ దగ్గరికి వచ్చి ఆడే గేమ్ ప్లాన్‌లో నిశేష్ ఏకంగా 83.8 శాతం సక్సెస్ రేట్ సాధించాడు. మూడో సెట్‌ను టైబ్రేకర్ లో కోల్పోయినప్పటికీ, నాలుగో సెట్‌లో పుంజుకుని 6-1తో ఫ్రిట్జ్‌ను క్లూలెస్‌గా మార్చేశాడు. ఈ మ్యాచ్‌లో నిశేష్ వాడిన అతిపెద్ధ ఆయుధం డ్రాప్ షాట్. బేస్‌లైన్ మీద పడే బంతులను కూడా నిశేష్ ఎంతో చాకచక్యంగా నెట్ అవతలి వైపు డ్రాప్ చేశాడు. దీనివల్ల బేస్‌లైన్ వెనుక నిలబడే అలవాటున్న ఫ్రిట్జ్.. ప్రతిసారీ ముందుకు పరిగెత్తలేక చేతులెత్తేశాడు. మ్యాచ్ అనంతరం ఫ్రిట్జ్ మాట్లాడుతూ.. “నిశేష్ అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా అతని డ్రాప్ షాట్లు నన్ను మానసికంగా, శారీరకంగా దెబ్బతీశాయి, వాటికి నా దగ్గర సమాధానం లేదు” అని ఓటమిని ఒప్పుకున్నాడు.
ఈ గెలుపుతో నిశేష్ బసవరెడ్డి అమెరికా టెన్నిస్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డును లిఖించాడు. ఫ్రెంచ్ ఓపెన్ మట్టి కోర్టులలో ప్రపంచ టాప్-10 ప్లేయర్‌ను ఓడించిన మొదటి అమెరికన్ ఆటగాడిగా నిశేష్ నిలిచాడు. ఈ ఘనత గత 26 ఏళ్లుగా (2000 సంవత్సరం నుంచి) ఏ అమెరికా ఆటగాడికీ సాధ్యం కాలేదు. మ్యాచ్ గెలిచిన తర్వాత నిశేష్ ఫ్రెంచ్ భాషలో కొన్ని ముక్కలు మాట్లాడి అక్కడి స్థానిక ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో తన తదుపరి రౌండ్ మ్యాచ్‌లో నిశేష్.. అలెక్స్ మిచెల్సన్ లేదా అలెగ్జాండర్ షెవ్‌చెంకోతో తలపడనున్నాడు.
నెల్లూరు టూ అమెరికా..
నిశేష్ బసవరెడ్డి మే 2, 2005న కాలిఫోర్నియాలో జన్మించాడు. అతని తల్లిదండ్రులైన మురళీకృష్ణ బసవరెడ్డి, సాయి ప్రసన్నలు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరం నుంచి 1999లో అమెరికాకు వలస వెళ్లారు. నిశేష్ తండ్రి ఉద్యోగ రీత్యా కాలిఫోర్నియా నుంచి తర్వాత కాలంలో ఇండియానా రాష్ట్రంలోని కార్మెల్ నగరానికి షిఫ్ట్ అయ్యారు. ఇంట్లో పూర్తిగా తెలుగు వాతావరణం, తెలుగు సినిమాలు, మ్యూజిక్ మధ్యే నిశేష్ పెరిగాడు. “నాకు మన భారతీయ వంటకాలంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ ప్రతిరోజూ పక్కా దేశీ నెల్లూరు రుచులతో వంట చేస్తుంది, నేను రాత్రిపూట అవే తింటాను” అని నిశేష్ గతంలో ఒక ఇంటర్వ్యూలో గర్వంగా చెప్పుకున్నాడు. వాళ్ల కుటుంబంలో ఎవరూ ప్రొఫెషనల్ అథ్లెట్లు కాకపోయినా, తన అన్న నిశాంత్‌ను చూసి చిన్నతనంలోనే నిశేష్ రాకెట్ పట్టుకున్నాడు.
HUGE win for Nishesh Basavareddy against Taylor Fritz 🇺🇸#RolandGarros pic.twitter.com/Ze36UzxubO
— Roland-Garros (@rolandgarros) May 24, 2026
చిన్నతనంలోనే అతను రెండు సార్లు మోకాళ్ల సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దీనివల్ల జూనియర్ ర్యాంకింగ్స్ పడిపోయినా.. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ అతని టాలెంట్‌ను నమ్మి అడ్మిషన్ ఇచ్చింది. అక్కడ డేటా సైన్స్ చదువుకుంటూనే కాలేజ్ టెన్నిస్‌లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. 2022లో యూఎస్ ఓపెన్ బాయ్స్ డబుల్స్ టైటిల్ కూడా గెలిచాడు. ఆ తర్వాత డిసెంబర్ 2024 లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారాడు. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్‌తో అడుగుపెట్టి మొదటి రౌండ్‌లోనే సాక్షాత్తూ నోవాక్ జొకోవిచ్‌తో తలపడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫ్రిట్జ్‌ను ఓడించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ గర్వపడేలా చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
