Dakkili Temple Construction : అమ్మ చెప్పిన మాట కోసం ఆస్తులు అమ్మి మరీ గుడి కట్టాడు.. ఇప్పుడాయన పరిస్థితి ఎలా ఉందంటే..!
మనం ఇప్పటి వరకు రేసులు ఆడి డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైన వాళ్ళను చూసుంటాం. అలాగే, చెడు వ్యసనాలకు బానిసలై అప్పులు పాలైన వ్యక్తులను చూసుంటాం.. అయితే నెల్లూరు జిల్లాలో..
Temple Construction : మనం ఇప్పటి వరకు రేసులు ఆడి డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైన వాళ్ళను చూసుంటాం. అలాగే, చెడు వ్యసనాలకు బానిసలై అప్పులు పాలైన వ్యక్తులను చూసుంటాం.. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి భక్తికి బానిసై అప్పులు పాలైయ్యాడు. భక్తిలోపడి అప్పులపాలయిన ఆ కలియుగ రామదాసు గురించి తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లా డక్కిలికి వెళ్ళాలి.
నెల్లూరు జిల్లా డక్కిలి మండలం డి వడ్డీపల్లికి చెందిన సూర్య ప్రకాష్ రావు 40 ఏళ్ళ పాటు విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలలో కాంట్రాక్టర్ గా పని చేశారు. చిన్న వయసులోనే తన తండ్రి పెద్ద నరసయ్యను కొల్పోయాడు. అయితే, తన తల్లి యనడమ్మకు ముద్దులు కొడుకుగా పెరిగాడు. అప్పుడు తన తల్లి చిన్ననాడు చెప్పిన మాటలే ఈ రోజు రెండు కోట్లతో గుడి నిర్మాణానికి కారణమయ్యాయి. నీవు వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని, నీకు తల మీద నామం ఉందని, నీవు ఎప్పటికైనా వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించాలని అతని తల్లి ఉగ్గుపాలతోనూ.. గోరుముద్దలతోనూ ఈ విషయాన్ని సూర్య ప్రకాష్ రావుకు నూరిపోసేది.
తన తల్లి కోరిన కోరికను నెరవేర్చాలన్న సంకల్పంతో సూర్య ప్రకాష్ రావు చిన్నప్పటి నుండే వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం కోసం తనకు చేతనైనంత డబ్బు దాచి పెట్టే వాడు. తరువాత రోజులలో విశాఖపట్నం, చెన్నై ప్రాంతాలలో కాంట్రాక్టర్‌గా పనిచేసి ఇంకొంత డబ్బు కూడబెట్టి డక్కిలి దగ్గర నాలుగు ఎకరాల స్థలం తీసుకుని రెండు ఎకరాలలో గుడి నిర్మాణం చేపట్టాడు.
గుడి నిర్మాణం కోసం మొదట్లో టీటీడీని ఆశ్రయించి తన రెండు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇస్తాము.. దాంట్లో మీరు గుడి కట్టండి అని టీటీడీ వారిని అభ్యర్థించగా వారు వెనుకడుగు వేయడంతో, తానే ఈ మహా యజ్ఞానికి స్వామి మీద అ నమ్మకంతో గుడి ప్రారంభించానని సూర్య ప్రకాష్ రావు టీవీ9 కు చెప్పారు. అయితే తన దగ్గర కొంత సొమ్ము ఉందని, ప్రజల దగ్గర కొంత సొమ్ము వసూలు చేయడం జరిగిందని అయినా గుడి నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తి అవకపోవడం వల్ల అప్పులు చేసి గుడి నిర్మించాల్సి వచ్చిందని సూర్య ప్రకాష్ రావు చెప్పారు.
సుమారు 60 లక్షల వరకు గుడి మీద చేసిన అప్పు ఉండడంతో రెండు రూపాయల వడ్డీ కట్టలేక ఇప్పుడు తనకున్న భూమిని సైతం అమ్మకానికి పెట్టాడీ పరమ భక్తుడు సూర్యప్రకాష్ రావు. అయితే ప్రస్తుతం తనకు ఆరోగ్యం సరిగా లేదని, కిడ్నీలు దెబ్బతినడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో అన్నదాన సత్రం, కోనేరు నిర్మించలేని పరిస్థితి ఉందని చెప్పారు. స్వామి వారి దయతో దాతలు.. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముందుకొస్తే తన ఆశయం పూర్తవుతుందని టీవీ9 కు సూర్యప్రకాష్ రావు వెల్లడించారు.
మురళి, టీవీ9 ప్రతినిధి, నెల్లూరు రూరల్