Brahmamgari Matam: కొత్త వివాదంలో బ్రహ్మంగారి మఠం.. పీఠాధిపతి కోసం వారసుల మధ్య వైరం..!

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరు? పీఠం కోసం వారసుల మధ్య వైరం కొనసాగుతోంది. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి వారసుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది వివాదాస్పదంగా మారింది.

Brahmamgari Matam: కొత్త వివాదంలో బ్రహ్మంగారి మఠం.. పీఠాధిపతి కోసం వారసుల మధ్య వైరం..!
Sri Potuluri Veerabrahmamgari Matam
Follow us
Balaraju Goud

|

Updated on: May 28, 2021 | 12:02 PM

Sri Potuluri Veera Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరు? పీఠం కోసం వారసుల మధ్య వైరం కొనసాగుతోంది. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి వారసుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది వివాదాస్పదంగా మారింది. ఆయన ఇద్దరు భార్యల కుమారుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది చిక్కుముడిగా మారింది.

కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో జీవ సమాధి అయ్యారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మఠంగా భావించి, దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీరబ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా ఉంటున్నారు. ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటివరకు ఇలా ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు.

మొన్నటి వరకు బ్రహ్మంగారి పీఠాధిపతిగా వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి ఉండేవారు. అయితే, ఇటీవల ఆయన మరణించడంతో పీఠాధిపతి పదవి ఖాళీ అయింది. ఇప్పుడా పదవి ఎవరికి ఇవ్వాలనేది పీటముడిగా మారింది.

వీరభోగవసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చంద్రావతమ్మ 8 మంది సంతానం. అందులో నలుగురు కుమారులు, నలుగురు కూతుళ్లున్నారు. మొదటి భార్య మృతి చెందడంతో రెండో భార్యను వివాహం చేసుకున్నారు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు. అయితే వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మరణం తర్వాత మఠం పీఠాధిపతి ఎవరు ఉండాలనే దానిపై ఓ వీలునామా రాసి పెట్టారు. అందులో మొదటి భార్యకు చెందిన రెండో కుమారుడు, చిన్న భార్యకు చెందిన ఒక కొడుకు పేరు రాశారు. దీంతో ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

మఠాధిపతి నియామకం కోసం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణాప్రతాప్‌ ఇప్పటికే విచారణ చేపట్టారు. అయితే రాణాప్రతాప్‌ సమక్షంలోనే పీఠాధిపతికి అర్హులు నేనంటే నేనంటూ కుటుంబీకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ప్రాథమిక విచారణను మధ్యలోనే నిలిపివేశారు రాణాప్రతాప్‌.

అయితే, గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికే ఇవ్వాలని మద్దతు తెలుపుతున్నారు. ఇంటికి పెద్ద కొడుకు కనుక ఆయనకే ఇవ్వాంటున్నారు. అయితే వీలునామాలో మాత్రం మొదటి భార్య రెండో కుమారుడి పేరు ఉంది. పెద్ద భార్య కిడ్నీ ఫెయిల్ అయిన సమయంలో ఎవరైతే కిడ్నీ ఇస్తారో తదుపరి పీఠాధిపతి వారేనని ప్రకటించారు. అప్పుడు రెండో కుమారుడు ముందుకు వచ్చాడు. దీంతో అతని పేరును వీలునామాలో రాశారు. దీంతో ఆయనకు కొందరు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు, వీలునామాలో తన కుమారుడి పేరు ఉందని, అయితే చిన్నవాడు కావడంతో తానే మఠాధిపత్యాన్ని స్వీకరిస్తానని చెబుతోంది చిన్న భార్య మారుతి లక్ష్మమ్మ. తన భర్త తర్వాత తనకే మఠాధిపత్యం వస్తుందని వీలునామాలో రాశారని వాదిస్తున్నారు. దీంతో అందరి అభిప్రాయాలు తెలుసుకున్న దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణాప్రతాప్‌ ప్రాథమిక విచారణ వాయిదా వేసి వెళ్లిపోయారు.

బ్రహ్మంగారి పీఠాధిపతి కావాలంటే దానికి కొన్ని అర్హతలుండాలి.. హిందూమతం, వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. ధార్మిక గ్రంధాలలో, మఠానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఙానం తెలిసి ఉండాలి. మఠం శిష్యగణానికి జ్ఞానబోధ, సంప్రదాయాలను నేర్పించే సమర్థత ఉండాలి. క్రమశిక్షణలో, దాన్ని పాటించుటలోనూ నిశ్చయమైన నమ్మకంతో మత ప్రవృత్తి కలిగి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారి పేరు ప్రతిపాదించిన తర్వాత దేవాదాయశాఖ కమిషనర్‌తో పాటు నలుగురు సభ్యులు పేరును ప్రతిపాదించి 90 రోజుల్లో దానిపై ధార్మిక పరిషత్‌ ఓ నిర్ణయం తీసుకుంటుంది. అందరి సమక్షంలో బ్రహ్మంగారి పీఠాధిపతి పేరును ప్రకటిస్తుంది.

Read Also… Balakrishna Rama Dandakam : బాలయ్య కఠం నుంచి ఉప్పొంగిన శ్రీరామ దండకం.. తండ్రి జన్మదినవేళ ఘనంగా గాత్ర నివాళి.. ఎలా ఉందో మీరూ చూడండి..!