Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atla Taddi: అచ్చ తెలుగు పండగ అట్ల తద్ది పూజ విధి, విశిష్టత.. అమ్మాయిలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

అట్ల తద్ది పండగ రోజున తెల్లవారు జామునే నిద్ర లేచి..   కన్నెపిల్లలు , ముత్తయిదువులు తలస్నానం చేస్తారు. తెల్లవారు జామున అన్నం, గోంగూర పచ్చడి , పెరుగుతో కడుపునిండా తింటారు.

Atla Taddi: అచ్చ తెలుగు పండగ అట్ల తద్ది పూజ విధి, విశిష్టత.. అమ్మాయిలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
Atlataddi
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2022 | 6:38 PM

తెలుగువారి విశిష్ట సాంప్రదాయాల్లో ఒకటి ‘అట్లతద్ది’. ఆశ్వయుజ బహుళ తదియనాడు మహిళలు జరుపుకునే ఈ పండగను కొన్ని ప్రాంతాల్లో ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. అట్ల తద్దెను కన్నె పిల్లలు జరుపుకోవడం వలన మంచి భర్త లభిస్తాడని నమ్మకం. ముత్తైదువులు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు. అందుకనే ఈ పండగ ముందు రోజున గోరింటాకు పెట్టుకుంటారు. పండగ రోజున తెల్లవారు జామునే నిద్ర లేచి..   కన్నెపిల్లలు , ముత్తయిదువులు తలస్నానం చేస్తారు. తెల్లవారు జామున అన్నం, గోంగూర పచ్చడి , పెరుగుతో కడుపునిండా తింటారు. అనంతరం అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ , ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌.. అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఉయ్యాలలూగుతారు. పగలంతా ఉపవాసం ఉండి.. రాత్రి చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని చూసి..  మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి అప్పుడు ఉపవాసం విడుస్తారు.

పూజా విధానం: 

గౌరీ పూజ కోసం పూజా మందిరంలో పీఠాన్ని పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్తారు. ఆ తర్వాత పార్వతీదేవికి అట్లు , ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొద్దీ ముగ్గురుకానీ , ఐదుగురు కానీ ముత్తయిదువులకు వాయినం ఇస్తారు. గౌరీదేవి అనుగ్రహంతో తమ కుటుంబంలో సుఖ సంతోషం, సౌభాగ్యం కలకాలం నిలుస్తాయని నమ్మకం.

ఇవి కూడా చదవండి

అట్లతద్దె వ్రత కథ-మహిమ:

పూర్వం ఒక మహారాజుకు లావణ్యవంతమైన కుమార్తె ఉండేది. ఆమె పేరు కావేరి. తన తల్లి ద్వారా అట్లతద్దె వ్రత మహిమను తెలుసుకున్న కావేరి తన రాజ్యంలో కల తన స్నేహితురాళ్లు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి  ఈ  చంద్రోదయ ఉమావ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. అనంతరం మంత్రి, సేనాపతి, పురోహితుని కూతుళ్లకు యుక్త వయసు రాగానే నవయవ్వనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది. మహారాజు తన కుమార్తెకు వివాహప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు. అయితే కావేరీకి వృద్ధులైన వారు మాత్రమే పెండ్లి కుమారులుగా రాసాగారు.

తన తండ్రి మహారాజు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడం చూచిన రాకుమార్తె కావేరి ఎంతో కలతచెంది. రాజ్యాన్ని వదిలి సమీప అరణ్యంలో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరీకి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా..! కావేరి తన అట్లతద్దె వ్రతాచరణ చేసినా ఫలితం దక్కలేదని, నా వ్రతములో ఏదైనా దోషమేమిటని? ప్రశ్నిస్తూ.. దుఃఖించసాగింది. అప్పుడు పార్వతీపరమేశ్వరులు ఓ సౌభాగ్యవతి.. ఇందులో  నీ దోషం లేదు.. అయితే నీవు ఆ అట్లతద్దె నోచే సమయంలో ఉపవాసదీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయావు. దీంతో నీ సోదరులు ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి  అద్దంలో చంద్రుడిని చూపించి.. నీ ఉపవాస దీక్షను విరమింపజేశారు. దీంతో నీ అట్లతద్ది వ్రత భంగం అయిందని పార్వతి పరమేశ్వరులు చెప్పారు. అయితే నీ సోదరులు నీ పై ఉన్న ప్రేమతోనే ఇలా చేసారు.. నీవు దుఃఖించవలసిందేమీ లేదని అన్నారు. రానున్న ఆశ్వీయుజ బహుళ తదియనాడు అట్లతద్దిని విధి విధానంగా వ్రతమాచరించు. నీ మనోభిష్టము తప్పక నెరవేరుతుందని కావేరిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు.

దీంతో కావేరీ అట్లతద్దిని శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించింది. అందమైనవాడు, చక్కని శౌర్యపరాక్రమాలు కలిగిన నవయవ్వన రాకుమారునితో వివాహం జరిగింది. ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగాలను అనుభవించింది.

పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయని నమ్మకం. మహిళలు ఈ అట్లతద్దె రోజున ఉమామహేశ్వరులను నిష్ఠతో పూజించి.. ఆదిదంపతుల అనుగ్రహాన్ని పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)