AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Pushpayagam: నేడు శ్రీవారికి పుష్పయాగం.. విశిష్టత.. ఎన్ని రకాల పువ్వులను వినియోగిస్తారో తెలుసా..

మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

Tirumala Pushpayagam: నేడు శ్రీవారికి పుష్పయాగం.. విశిష్టత.. ఎన్ని రకాల పువ్వులను వినియోగిస్తారో తెలుసా..
Tirumala Pushpa Yagam
Surya Kala
|

Updated on: Nov 01, 2022 | 10:57 AM

Share

తిరుమల శ్రీవారి ఆలయంలో  నేడు  పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం శ్రవణ నక్షత్రంలో చేసే అపురూప యాగం  పుష్ప యాగం. ఈ యాగానికి అంకురార్పణ శ్రవణ నక్షత్రం ఉన్న ముందు రోజు జరుగుతుంది. కంకణ ధారులైన ఆచార్యులు శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం చేస్తారు. పాలు, పెరుగు , తేనె , నెయ్యి , నారికేళ జలం , పసుపు , చందనం , కుంకుమ పువ్వు, వట్టి వేర్లు కలసిన సుగంధ పరిమళ జలాలతో అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారికి పుష్ప యాగం నిర్వహిస్తారు.

మలయప్ప స్వామికి పుష్పాలు, పాత్రలతో అర్చన చేస్తారు. ముందుగా ఆ పుష్ప యాగం కోసం వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 27 రకాలను సేకరిస్తారు. ఈ పుష్పాలతో వేద పురాణ ప్రబంధ పారాయణం జరుపుతూ.. తులసీదళముల తో వివిధ రకాల  పుష్పాలను స్వామివారి పాదాలకు సమర్పిస్తారు. ఈ పుష్ప యాగం నిర్వహించడం వలన బ్రహ్మోత్సవంలో తెలిసీ తెలియక ఏమైనా దోషాలు జరిగితే.. ఆ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు పుష్పయాగాన్ని దర్శించిన వారికీ ఉత్తమ గతులు లభిస్తాయని విశ్వాసం.

పుష్పయాగానికి ఉపయోరించే పువ్వుల రకాలు: 

ఇవి కూడా చదవండి

సంపంగి, కనకాంబరం, లిల్లీ, తామరపువ్వులు, విరజాజి, మరువం, దవనం, మల్లి, జాజి,  రక రకాల గులాబీలు, చామంతి, కదిరిపచ్చ, బిల్వ, కనకాంబరం, కమలం, మొగలి వంటి అగ్రకర్ణికా, కాలనందా అనేవి మొత్తం ఇరవై ఏడు రకాలు పువ్వులతో వెంకటేశ్వరస్వామికి పుష్పకైంకర్యం చేస్తారు. ఈ పుష్పయాగం కోసం తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకకు చెందిన దాతలు పుష్పాలను పంపుతారు.

ఈ రోజు ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. పుష్పయాగం నేపథ్యంలో అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ పుష్ప‌యాగానికి సోమ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు. రాత్రి 6 గంట‌ల‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన శ్రీ విష్వ‌క్సేనుల వారిని ఆల‌యం నుండి వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్క‌డ మృత్సంగ్ర‌హ‌ణం, ఆస్థానం నిర్వ‌హించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. రాత్రి 8 నుండి 9 గంట‌ల నడుమ ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..