భైంసాలో జరిగింది అమానుష ఘటన.. ప్రభుత్వం నిద్రపోతుందా..? ఆ నిందితులను కఠినంగా శిక్షించాలి-షర్మిల

నిర్మల్‌ జిల్లా భైంసాలో నాలుగేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి అమానుషమని షర్మిల పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను కఠినంగా..

భైంసాలో జరిగింది అమానుష ఘటన.. ప్రభుత్వం నిద్రపోతుందా..? ఆ నిందితులను కఠినంగా శిక్షించాలి-షర్మిల
Follow us
K Sammaiah

|

Updated on: Mar 18, 2021 | 7:22 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైయస్‌ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజల్లోకి వెళతామంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచుతున్నారు. గతంలో తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా అంటూ ప్రశ్నించిన షర్మిల.. తాజాగా భైంసా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్మల్‌ జిల్లా భైంసాలో నాలుగేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి అమానుషమని షర్మిల పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగి రోజులు గడుస్తున్నా నిందితులకు శిక్ష ఎందుకు పడడంలేదని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో చిన్నారులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె మండిపడ్డారు. నేరాలను రాజకీయ కోణంలో చూడకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

పోలీసుల దర్యాప్తు ముమ్మరం భైంసాలో బాలికపై లైంగిక దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ ఆదేశాలతో తెలంగాణ మహిళా భద్రతా విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈనెల 10న ఉదయం ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిపై స్థానిక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. చిన్నారి తల్లి భైంసా రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు 376 ఏబీ సెక్షన్‌తో పాటు పోక్సో చట్టం 2012 సెక్షన్‌ 6 కింద కేసు నమోదు చేశారు. భైంసా డీఎస్పీ పర్యవేక్షణలో చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. 24 గంటల్లోగా బాలుడిని అదుపులోనికి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ఫోరెన్సిక్‌, న్యాయ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు.

షర్మిలకు వెల్లువెత్తుతున్న మద్దతు లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో షర్మిలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మిట్ట పురుషోత్తంరెడ్డి, మెదక్‌ జిల్లా ఆందోల్‌ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత సంజీవరావు మద్దతు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ప్రజాసేవ సంస్థ వ్యవస్థాపకుడు రత్నకుమార్‌ తన అనుచరులతో కలసి షర్మిలకు మద్దతు తెలిపారు. సెంట్రల్‌ వర్సిటీకి చెందిన ఓబీసీ విద్యార్థి సంఘం నేత కిరణ్‌ ఆధ్వర్యంలో 15 మంది విద్యార్థులు తమ సమస్యలను షర్మిల దృష్టికి తీసుకొచ్చారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందేదని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం 10 వేల లోపు ర్యాంకు వచ్చినవారికి మాత్రమే పూర్తి రీయింబర్స్‌మెం ట్‌ ఇస్తున్నారని వాపోయారు. షర్మిల స్పందించిస్తూ తాము అధికారంలోకి వచ్చాక పూర్తి రీయింబర్స్‌మెంట్‌ అందిస్తామని భరోసా ఇచ్చారు. గురువారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు.

Read More:

సీఎం కేసీఆర్‌ వర్సెస్‌ భట్టి.. వ్యవసాయ చట్టాలపై భట్టి ఆరోపణలను తిప్పి కొట్టిన కేసీఆర్

ఏపీలో ఆ సంచలన నిర్ణయానికి గవర్నర్‌ ఆమోదముద్ర.. ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన బీబీ హరిచందన్

మళ్లీ పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. ఆ తరగతులకు స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలు.. విద్యాశాఖ ఆదేశాలు ‌