Chandrababu to Approach: ఏపీలో హాట్ టాపిక్ ఇదే.. మాజీ సీఎం సీఐడీ విచారణకు హాజరవుతారా..? లేదా..?
అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఇటు అధికార.. ప్రతిపక్షాల మధ్య అమరావతి పంచాయతీ మరోసారి అగ్గిరాజేసింది. అసైన్డ్ ల్యాండ్స్ ఇష్యూ..
Chandrababu: మాజీ సీఎం సీఐడీ విచారణకు హాజరవుతారా..? లేదా కేసు కొట్టివేతకు కోర్టు మెట్లెక్కుతారా..? అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం ఏ మలుపు తిరగనుంది..? ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో ఇదే చర్చ సాగుతోంది. ఇంతకీ చంద్రబాబు అనుసరించబోయే వ్యూహమేంటన్నది ఆసక్తిగా మారింది.
అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఇటు అధికార.. ప్రతిపక్షాల మధ్య అమరావతి పంచాయతీ మరోసారి అగ్గిరాజేసింది. అసైన్డ్ ల్యాండ్స్ ఇష్యూ కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబును టార్గెట్ చేశారని ప్రతిపక్షం అంటుంటే.. చట్టం తన పని తాను చేసుకెళ్తుందంటోంది అధికారపక్షం.
ఇక.. తనకు జారీ చేసిన నోటీసులపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించారు చంద్రబాబు. సీఐడీ కేసు విషయంలో కోర్టును ఆశ్రయించాలన్న భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని స్పష్టంగా కనిపిస్తోందని, దానిని కొట్టివేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే మంచిదని న్యాయ నిపుణులు సూచించినట్లు తెలుస్తోంది. సంబంధిత ప్రభుత్వ శాఖల తనిఖీ పూర్తైన తర్వాతే రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల పరిహార జీవో జారీ అయ్యిందని, దానిని మంత్రివర్గం కూడా ఆమోదించిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు కూడా న్యాయ నిపుణుల సూచనల వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై తుది నిర్ణయానికి వస్తే ఒకటి రెండు రోజుల్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.
మరోవైపు.. అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసులో నేడు విచారణకు రావాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసు అందజేసింది. తన దగ్గర ఉన్న ఆధారాల్ని సమర్పించాలని ఆర్కేకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.
ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణ ఇంట్లోనూ సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. నెల్లూరు, హైదరాబాద్, విజయవాడల్లోని ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఈనెల 22న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నారాయణకు సూచించింది సీఐడీ. లేదంటే అరెస్టు చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొంది.
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఒక్కసారిగా సీఐడీ దూకుడు పెంచడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పక్ష ఎమ్మెల్యే ఆళ్లతో పాటు మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు జారీ చేసిన నోటీసులపై పొలిటికల్ సర్కిళ్లలో విస్తృత చర్చ నడుస్తోంది. వీరంతా సీఐడీ ఎదుట హాజరవుతారా..? వీరి ముందున్న ఆప్షన్స్ ఏంటి..? అన్నది ఆసక్తి రేపుతోంది.