మార్చి 24 నుంచి 28 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. ఆర్జితసేవలు రద్దు -టీటీడీ
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల తెప్పోత్సవాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మార్చి 24 నుంచి 28 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు..
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల తెప్పోత్సవాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మార్చి 24 నుంచి 28 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అంటారు.
తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.
తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఆర్జితసేవలు రద్దు : తెప్పోత్సవాల కారణంగా మార్చి 24, 25వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ (వర్చువల్), మార్చి 26, 27, 28వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ (వర్చువల్)లను టిటిడి రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని టీటీడీ పేర్కొంది.
Read More:
భైంసాలో జరిగింది అమానుష ఘటన.. ప్రభుత్వం నిద్రపోతుందా..? ఆ నిందితులను కఠినంగా శిక్షించాలి-షర్మిల