‘రైతు అంటే పేదవాడు’ అనే భావన విడనాడాలి.. ఎందుకో కారణం చెప్పిన కేంద్ర మంత్రి
Kailash Chaudhary: కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి 'రైతు అంటే పేదవాడు' అనే భావనను విడనాడాలని సూచించారు. ఈ పదమే యువత వ్యవసాయం వైపు
Kailash Chaudhary: కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి ‘రైతు అంటే పేదవాడు’ అనే భావనను విడనాడాలని సూచించారు. ఈ పదమే యువత వ్యవసాయం వైపు రాకుండా చేస్తుందన్నారు. వ్యవసాయానికి గుర్తింపు లేకుండా చేస్తుందన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ వ్యవసాయ కార్యకలాపాలపై యువత ఆసక్తి చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకాలు, మీడియాల్లో ‘రైతు పేదవాడు’ అనే తప్పుడు అభిప్రాయమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు.
గ్రామాల్లో లేదా ఎక్కడైనా రైతుల గురించి చర్చించినప్పుడు ‘రైతులు పేదవారై ఉండాలి’ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందన్నారు. రైతుల కథలలో కూడా ‘ఈ గ్రామంలో నివసించే ఓ పేద రైతు’తో ప్రారంభమవుతుందన్నారు. ‘పేద’ అనే పదం ఎప్పుడూ రైతులతో ముడిపడి ఉంటుందని ఈ పదాన్ని వారికి ఆపాదించడం మానుకోవాలని సూచించారు. పేద అనే పదాన్ని తొలగించాలని తెలిపారు. అందుకే రైతంటే పేదవాడు అనే భావన విడనాడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
రైతులంటే అనాధికాలంగా పేదలై ఉంటారని అందరు భావించడం మొదలెట్టారని మంత్రి కైలాష్ చౌదరి అన్నారు. ఒక వార్తా పత్రికలో రైతు ఫొటోని చూస్తే పొడి నేలపై చిరిగిన బట్టలతో ఆకాశం వైపు చూస్తున్నట్లు ఉంటుంది. ఇలా రైతును వర్ణించడం వల్ల యువత వ్యవసాయాన్ని ఒక వృత్తిగా చూడటంలేదని ఆరోపించారు. అందుకే వ్యవసాయం చేయడానికి ఎవ్వరు ముందుకు రావడంలేదన్నారు.
వ్యవసాయం చేస్తే పుస్తకాలు, మీడియాలో వివరించిన విధంగానే తమ పరిస్థితి కూడా ఉంటుందని యువత భావిస్తుందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మంచి ఆదాయాన్ని పొందడానికి పంటల వైవిధ్యం, అధిక విలువ కలిగిన పంటలను అనుసరించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.