బీహార్ లో మాజీ ఎంపీ పప్పు యాదవ్ అరెస్ట్, జైల్లో నిరాహారదీక్ష, కోవిడ్ బాధితులకోసం నా పోరాటం ఆగదని స్పష్టీకరణ
బీహార్ లో మాజీ ఎంపీ రాజేష్ రంజన్ ఎలియాస్ పప్పు యాదవ్ ని పోలీసులు అరెస్టు చేశారు. పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో రభస సృష్టించినందుకు అరెస్టు చేసి ఆయనను జైలుకు తరలించారు.
బీహార్ లో మాజీ ఎంపీ రాజేష్ రంజన్ ఎలియాస్ పప్పు యాదవ్ ని పోలీసులు అరెస్టు చేశారు. పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో రభస సృష్టించినందుకు అరెస్టు చేసి ఆయనను జైలుకు తరలించారు. నాలుగు సార్లు ఎంపీగా ఉన్న పప్పు యాదవ్ జన్ అధికార్ పార్టీ అధ్యక్షుడు కూడా. వీర్పూర్ జైల్లో ఉన్న ఈయన ఇక్కడే నిరాహార దీక్షకు దిగాడు.ఈ జైల్లో నీటి సౌకర్యం గానీ, వాష్ రూమ్ గానీ లేదని, ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న తాను సరిగా కూర్చోలేకపోతున్నానని అన్నాడు. కోవిడ్ రోగులకు సాయం చేయడమే తన పాపమా, ఆక్సిజన్, మెడికల్, అంబులెన్స్ మాఫియాను అడ్డుకుని వారి ఆగడాలను ఎక్స్ పోజ్ చేయడమే నేను చేసిన నేరమైందా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. కోవిద్ రోగులకోసం వారికి అవసరమైన సహాయం కోసం తను ఎంతవరకైనా పోరాడుతానని, ఎవరు అడ్డు వచ్చినా సహించేది లేదని పప్పు యాదవ్ పేర్కొన్నాడు. ఈ కోవిడ్ బీభత్స సమయంలో బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ తన ఇంట్లో ఎన్నో అంబులెన్సులను దాచాడని, వాటిని ఆసుపత్రులకు ఇవ్వడంలేదని పప్పు యాదవ్ సహచరులు ఆరోపిస్తున్నారు. ఈ మాఫియాను తమ నేత ఎలాగైనా అడ్డుకుంటాడని వారు హెచ్చరించారు. మా లీడర్ ను అరెస్టు చేసి జైలుకు పంపడం అన్యాయమని, తాము కోర్టుకెక్కుతామని వారు తెలిపారు.
అయితే బీహార్ లో అధికార పార్టీ నేతలు మాత్రం, జైల్లో పప్పు యాదవ్ చేస్తున్న నిరాహార దీక్ష నాటకమని కొట్టి పారేస్తున్నారు. తనపై గల పోలీసు కేసులనుంచి తప్పించుకునేందుకే ఆయన ఈ డ్రామాకు తెర తీశాడని వారు ఆరోపిస్తున్నారు. కిడ్నాపింగులు, బలవంతపు వసూళ్లు, తదితర నేరాలకు పాల్పడిన క్రిమినల్ చరిత్ర అతనిదని పాలక జేడీయూ నేతలు పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పీఎం కేర్స్ ఫండ్ కింద సప్లయ్ అయిన వెంటిలేటర్లలో లోపాలు, మూలన పడి మూలుగుతున్న యంత్రాలు, పంజాబ్ లో చోద్యం !