ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు ఉండాలి.. నాడు-నేడు సమీక్షలో సీఎం జగన్.. ఇంకా ఏమన్నారంటే..
మన బడి నాడు – నేడుపై క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి..
మన బడి నాడు – నేడుపై క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్రశిక్షా అభియాన్ ఎస్‌పిడి వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మొదటి దశ నాడు – నేడు పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. స్కూళ్ళు మంచి కలర్‌ఫుల్‌గా మంచి డిజైన్లతో ఉండాలని సూచించారు. నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు మార్చిన స్కూల్స్ ఫొటోలు పరిశీలించిన సీఎం.. స్కూళ్ళలో ఇంటీరియర్ కూడా బావుండాలని అన్నారు. రెండో దశ నాడు – నేడు పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెకండ్ ఫేజ్‌లో మరింత మార్పులు చేయాలి, విద్యార్ధులకు ఏర్పాటుచేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలన్నారు. పనుల్లో ఎక్కడా నాణ్యతా లోపం రాకూడదని అధకారులను ఆదేశించారు.
పనుల్లో నాణ్యత లేకపోతే సీరియస్‌గా తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. మనసా వాచా కర్మణ మనం కమిటెడ్‌గా పనిచేయాలి అప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం, టేబుల్స్ విషయంలో మరింత జాగ్రత్త అవసరం, టేబుల్స్ హైట్ కూడా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థితి ఎక్కడా ఉండకూడదు.ఎక్కడైతే భవనాలు లేవో.. అక్కడ కచ్చితంగా భవనాలు కట్టించాలి. నాడు – నేడులో భాగంగా ఆ పాఠశాలలన్నింటికీ భవన నిర్మాణాలు శరవేగంగా జరగాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు భవనాల నిర్మాణానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.
స్కూళ్లలో టాయిలెట్ల శుభ్రతపై సీఎం సమీక్షించారు. ఇప్పటికే 27వేల మంది ఆయాలను నియమించామన్న అధికారులు.. మార్చి మొదటివారంలో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు, పరికరాలు, పరిశుభ్రంగా ఉంచేందుకు లిక్విడ్స్ అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్ధుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్ సెక్రటరీలు, వాలంటీర్ల మ్యాపింగ్ ప్రక్రియ నడుస్తోందని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించడంతో.. మార్చి 15కల్లా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.
విద్యాకానుకలో ఇంగ్లిషు – తెలుగు డిక్షనరీని చేర్చాలని సీఎం ఆదేశించారు. విద్యాకానుకలో కిట్‌లో ఈసారి తప్పనిసరిగా డిక్షనరీ ఉండాలన్నారు. అలాగే పాఠ్యపుస్తకాలు ప్రైవేటు స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ఉండాలని సీఎం ఆదేశించారు. అమ్మ ఒడి కింద ఆప్షన్ తీసుకున్న విద్యార్ధులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌లు క్వాలిటీ, సర్వీస్ బాగుండాలని సూచించారు. 2021– 22 విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలని సూచించారు. తర్వాత తరగతులకు ఒక్కో ఏడాదీ అమలు చేయాలన్నారు. 2024 విద్యా సంవత్సరానికల్లా 1 నుంచి 10 తరగతి వరకూ విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలోకి మారిపోవాలన్నారు.
చిన్నారులకు బోధన ఎలా చేయాలన్న దానిపై అంగన్ వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి రెండు నెలలకోసారి వారు ఎంతవరకు నేర్చుకున్నారన్నదానిపై ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. అయితే పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా వారు ఎంతవరకు శిక్షణ కార్యక్రమాల ద్వారా అప్‌గ్రేడ్ అయ్యారో పరిశీలించి, మరింతగా వారికి ట్రైనింగ్ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.
Read more:
చంద్రబాబును ఎర్రగడ్డలో చేర్చే టైమొచ్చింది.. పంచాయతీ ఫలితాలనుద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్