‘మా ఎమ్మెల్యేలను బెదిరించారు, ఆధారాలు నా వద్ద ఉన్నాయి’, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి
పుదుచ్చేరిలో తన ప్రభుత్వం కూలిపోవడానికి తమ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ పార్టీని వదిలేలా చేయడమే కారణమని మాజీ సీఎం వి. నారాయణస్వామి అన్నారు..
పుదుచ్చేరిలో తన ప్రభుత్వం కూలిపోవడానికి తమ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ పార్టీని వదిలేలా చేయడమే కారణమని మాజీ సీఎం వి. నారాయణస్వామి అన్నారు. వారిని బెదిరించడమే కాదు..వారిమీద ఒత్తిడి కూడా తెచ్చారు అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇందుకు తనవద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తనపట్ల ఎవరూ అసంతృప్తితో వెళ్లలేదని, చాలామంది ఎమ్మెల్యేలకు తనంటే అభిమానం ఉందని ఆయన చెప్పారు. నలుగురు కాంగ్రెస్ సభ్యులతో బాటు ఓ డీఎంకే ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడంతో నాలుగున్నర ఏళ్ళ నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది..చివరకు బలపరీక్షలో నెగ్గలేకపోవడంతో నారాయణస్వామి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు.
(మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని హఠాత్తుగా తొలగించి నారాయణస్వామి సర్కార్ ని చిక్కుల్లో పడేయాలన్న బీజేపీ వ్యూహం ఫలించిందని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి). కాగా నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని, వారిలో కొందరు మాత్రం తనపై ఫిర్యాదులుచేశారని నారాయణస్వామి పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే తనవద్దకు వఛ్చి..తాను టాక్స్ రిటర్నులుగా 22 కోట్లు చెల్లించాల్సి ఉందని, తను రాజీనామా చేస్తే ఈ కేసు క్లోజయిపోతుందని తనతో చెప్పాడని ఆయన వెల్లడించారు. తనపై ‘పారాచ్యుట్ చీఫ్ మినిస్టర్’ అన్న వ్యంగ్య వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ముఖ్యమంత్రిగా తన నియామకం ఏకాభిప్రాయంతో జరిగిందన్నారు. అంతే తప్ప సోనియా గాంధీ గానీ, రాహుల్ గానీ తన ఎంపికలో జోక్యం చేసుకోలేదన్నారు. వారిమద్దతు తనకు ఇప్పటికీ ఉందని నారాయణస్వామి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ తను గెలిచి సీఎంగా అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. పుదుచ్చేరిలో కూడా త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
Also Read:
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు ఉండాలి.. నాడు-నేడు సమీక్షలో సీఎం జగన్.. ఇంకా ఏమన్నారంటే..