Devineni Uma: దేవినేని ఉమపై కృష్ణా జిల్లాలో కేసు నమోదు.. కరోనా కట్టుబాట్లను ఉల్లంఘించారని ఆరోపణ
మాజీ మంత్రి దేవినేని ఉమపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు దేవినేని ఉమతోపాటు మరో 13 మందిపై కేసులు
మాజీ మంత్రి దేవినేని ఉమపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు దేవినేని ఉమతోపాటు మరో 13 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 16న మైలవరంలోని అయ్యప్ప నగర్‌లో ప్రభుత్వ ఇళ్ల స్థలాలను దేవినేని ఉమ పరిశీలించారు. ఈ నెల 16న కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన దేవినేని ఉమా కార్యక్రమాలు చేపట్టారని పెనుబోయిన రాంబాబు అనే వ్యక్తి పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దేవినేనిపై 188 ఐపీసీ, ౩ ఈడీఏ ప్రకారం కేసు నమోదు చేసినట్లుగా దర్యాప్తు చేస్తున్న మైలవరం ఎస్సై వెల్లడించారు.
ఈ నెల 16న ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మైలవరంలో ఆందోళన నిర్వహించారు. అంతే కాకుండా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సహాయంను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైద్య సౌకర్యాలు విస్తృతం చేయాలన్న తదితర డిమాండ్లతో తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. అయితే, కరోనా మహమ్మారి సమయంలో.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు.