AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతి ఉప ఎన్నిక బరిలో విశాఖ ఉద్యమం తరపున అభ్యర్థి… అఖిల పక్షాలతో చర్చించి నిర్ణయిస్తామన్న గంటా

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పార్టీలకు అతీతంగా ట్రేడ్‌యూనియన్లు పోరాటం కొనసాగిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీల నేతలు ధర్నాలు, రాస్తరోకోలతో..

తిరుపతి ఉప ఎన్నిక బరిలో విశాఖ ఉద్యమం తరపున అభ్యర్థి... అఖిల పక్షాలతో చర్చించి నిర్ణయిస్తామన్న గంటా
Ex Minister Ganta Srinivasa
K Sammaiah
|

Updated on: Mar 13, 2021 | 1:11 PM

Share

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పార్టీలకు అతీతంగా ట్రేడ్‌యూనియన్లు పోరాటం కొనసాగిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీల నేతలు ధర్నాలు, రాస్తరోకోలతో ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. అయినా కేంద్ర పట్టువీడకపోవడాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి ధ్వజమెత్తారు. లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకపోతున్నామని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజీనామాను కొందరు రాజకీయం చేయడం సరికాదన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఉద్యమించి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందని స్పష్టం చేశారు.

తిరుపతి ఉపఎన్నికల్లో ఉద్యమం తరపున ఎంపీ అభ్యర్థిని నిలబెట్టే అంశంపై అఖిలపక్షంతో చర్చిస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుపతి వచ్చామని తెలిపారు. విశాఖ గుండె చప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేస్తుండటం అనే ఆలోచనే బాధాకరమని…శరీరం నుంచి ఓ భాగం వేరు అయినట్లు ఉందని అన్నారు. టీడీపీ, జనసేన, వామపక్షాలు అన్నీ విశాఖ ఉక్కు కోసం నిలబడ్డాయని చెప్పారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు అని, అమ్మేస్తాం లేదా మూసేస్తాం అన్నట్లు కేంద్ర వైఖరి ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాము అని నిర్మలా సీతారామన్ చెప్పారన్నారు. విశాఖ ఉక్కు బాధ్యతను సీఎం జగన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ చొరవ తీసుకుంటే కలిసి నడుస్తానని చంద్రబాబు స్పష్టం చేశారని గుర్తు చేశారు.

రాజీనామా చేస్తే ఎలా పోరాడతాం అని వైసీపీ మంత్రులు అంటున్నారని…అయితే చివరి అస్త్రం రాజీనామాలు సంధించే సమయం ఆసన్నమైందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎంపీలు రాజీనామా ఏస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. వైసీపీ మంత్రులు, ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో మళ్లీ టీడీపీ అభ్యర్థులను పెట్టబోమని గతంలో చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్యమంలో నేరుగా పాల్గొంటే ప్రభావం ఎక్కువ ఉంటుందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కార్మికుల ఉద్యమంలో పవన్‌ కల్యాణ్‌ నేరుగా పాల్గొనాలని గంటా కోరారు.

Read More:

సానుభూతి రాజకీయాలతో లాభం లేదు.. దమ్ముంటే స్వచ్ఛమైన రాజకీయాలు చెయాలి -మంత్రి పేర్నినాని

అట్టుడుకుతున్న ఉక్కునగరం.. గుంటూరు నుంచి విశాఖకు పాదయాత్ర.. జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎంపీ