AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP MUKT BHARATH: బీజేపీ ముక్త భారత్.. భారీవ్యూహంతో కదిలిన కేసీఆర్.. అంతిమంగా జరిగేదేంటన్నదే ఆసక్తికరం

జాతీయ రాజకీయాల్లో బీజేపీయేతర కూటమి అంటూ బయలుదేరిన కేసీఆర్.. ఆ క్రమంలో కొందరు కాంగ్రెస్ మిత్ర పక్షాలను, మరికొందరు తటస్థులను కలుస్తూ వస్తున్నారు. కానీ వీరిలో కాంగ్రెస్ మిత్ర పక్ష నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు.

BJP MUKT BHARATH: బీజేపీ ముక్త భారత్.. భారీవ్యూహంతో కదిలిన కేసీఆర్.. అంతిమంగా జరిగేదేంటన్నదే ఆసక్తికరం
CM KCR Political Strategy
Rajesh Sharma
|

Updated on: Sep 01, 2022 | 2:36 PM

Share

BJP MUKT BHARATH STRATEGY BY KCR LEADING MANY SPECULATIONS: మునుగోడు ఉప ఎన్నిక(Munugode bypoll) మరుగున పడుతుందా ? మునుగోడు ఉపఎన్నిక అసలు జరుగుతుందా ? అసెంబ్లీ రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రంగం సిద్దం చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వస్తుండడంతో సామాన్య ప్రజల్లో ఈ సందేహాలు కలుగుతున్నాయి. రెండు ఇంగ్లీషు దినపత్రికలు సెప్టెంబర్ 3వ తేదీన అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకునే ఛాన్స్ వుందంటూ స్పెక్యూలేటివ్ కథనాలు ప్రచురించాయి. అందుకే సెప్టెంబర్ 3వ తేదీన రాష్ట్ర కేబినెట్ భేటీ అయిన వెంటనే టీఆర్ఎస్ఎల్పీ(TRSLP) సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారని, పైగా ఆ సమావేశానికి ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానించారని ఆ రెండు పత్రికలు సూత్రీకరించాయి కూడా. సెప్టెంబర్ 3న అసెంబ్లీ రద్దుపైన కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆ రెండు ఆంగ్ల దినపత్రికలు రాస్తే.. అదే రోజు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని సంక్షేమ పథకాలను వేగవంతం చేసే దిశగా కేసీఆర్ కీలక సమాలోచనలు జరపబోతున్నారని ఒకట్రెండు తెలుగు దినపత్రికలు రాశాయి. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యమో లేక ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమో కానీ సెప్టెంబర్ మూడవ తేదీన జరగనున్న కేబినెట్, టీఆర్ఎస్ఎల్పీ సమావేశాలు కీలకమన్నది మాత్రం అర్థమవుతోంది. ఇంతకీ వున్నట్లుండి కేసీఆర్ వ్యూహంలో ఈ మార్పేమిటి అంటే మాత్రం అదంత ఈజీగా ఊహించడం సాధ్యం కాని విషయం. ఆగస్టు చివరి వారంలో వివిధ ఉత్తరాది రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్ రోజుల తరబడి సమావేశాలు నిర్వహించారు. వారిని ప్రభుత్వ ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాలకు పంపి, గత ఎనిమిదేళ్ళలో తాము చేసిన పనులను దేశానికి చాటే ప్రయత్నం చేశారు. రైతు సమాఖ్యల ప్రతినిధులతో భేటీలు పూర్తి అయిన రెండో రోజునే ఉత్తరాది యాత్రకు ప్లాన్ చేశారు. వినాయక చవితి పండుగను కూడా పక్కన పెట్టి ఆగస్టు 31వ తేదీన కేసీఆర్ బీహార్(Bihar) వెళ్ళారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌(CM Nitish Kumar)తోపాటు కురువృద్ధ నేత, ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav)ని కూడా కలిశారు. వీరిలో లాలూ బీజేపీకి సుదీర్ఘ కాల ప్రత్యర్థి కాగా.. నితీశ్ ఇటీవలనే బీజేపీ(BJP)తో దోస్తీకి గుడ్‌బై కొట్టి, ఎన్డీయే(NDA)ని వీడి ఆర్జేడీ(RJD), కాంగ్రెస్(Congress) పంచన చేరారు. వారి సహకారంతో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా పదవీప్రమాణ స్వీకారం చేశారు నితీశ్.

జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే వ్యూహంలో భాగంగా కేసీఆర్ జాతీయ పార్టీని పెడతారా లేక తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samathi)నే భారత రాష్ట్ర సమితి (Bharata Rashtra Samiti)గా మారుస్తారా అన్నదింకా తేలలేదు. ఆ అంశంపై మూడు నెలల క్రితం వచ్చిన స్థాయిలో ఇపుడు లీకేజీలు రావడం లేదు. దాంతో పత్రికా కథనాలు కూడా ఆగిపోయాయి. ఆనాడు మీడియాకు ఫీలర్లు వదిలిన టీఆర్ఎస్ శ్రేణులు ఇపుడు జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ (TRS).. అన్న అంశంపై మాట్లాడడం లేదు. దాంతో కేసీఆర్ యత్నాలు అటకెక్కాయి అన్న అనుమానాలు వచ్చాయి. కానీ ఆగస్టు చివరి వారంలో కేసీఆర్ కదలికలు, సమావేశాలు చూస్తే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం పక్కా అనిపిస్తోంది. వెళ్ళడం పక్కానే కానీ ఎప్పుడు అన్నది మాత్రం ఇదమిత్తంగా తేలడం లేదు. ఈక్రమంలో కేసీఆర్ మరోసారి వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర శక్తులను కల్వడం పున: ప్రారంభించారు. ఆయనిదివరకే శరద్ పవార్ (Sharad Pawar), ఉద్ధవ్ థాకరే (Uddav Thakre), ఎంకే స్టాలిన్ (MK Stalin), నవీన్ పట్నాయక్ (Navin Patnaik), అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal), భగవంత్ సింగ్ మాన్ (Bhagavant Singh Mann), అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav), దేవెగౌడ (Devegowda), కుమారస్వామి (Kumaraswamy) వంటి వారిని కలిసొచ్చారు. బీజేపీయేతర శక్తులను ఒక్కతాటిపైకి తెచ్చే యత్నాలను పలు సందర్భాలలో వివరించారు. తాజాగా పాట్నాలో నితీశ్ కుమార్, తేజస్వీయాదవ్‌లతో కలిసి మీడియాతో మాట్లాడిన కేసీఆర్ అక్కడి మీడియా ప్రశ్నలకు కాసింత ఇరిటేట్ అయినట్లు కనిపించారు. నితీశ్ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా అన్న మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. ఇంకోవైపు నితీశ్ కుమార్ తన సీట్లోంచి లేస్తూ.. ఇక చాలు ఈ మీడియా వారు ఇలాంటివే అడుగుతుంటారంటూ వెళ్ళిపోబోయారు కూడా. ఇలాంటి సందర్భాలను చూస్తే మాత్రం రేపు బీజేపీయేతర శక్తులు ఏకమయినా.. ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశం చర్చకొచ్చినపుడు ఎవరి దారి వారిదే అన్నట్లు పరిస్థితి మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే బృహత్తర కార్యంలో కేసీఆర్ పాత్ర ఎలా వున్నా.. కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తకరమైన అంశమే. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసిన వారిలో కేసీఆర్ పాత్ర ఎంతైనా వుంది. నిజానికి 2014లో రాష్ట్రం ఏర్పడినపుడు టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీలో విలీనమవుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా (Sonia) భావించారు. దానికి తగినట్లే కేసీఆర్ సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి సోనియా గాంధీని కలిశారు. పార్టీ విలీనం ఇక లాంఛనమే అనుకుంటున్న తరుణంలో కేసీఆర్ వ్యూహాలు మారాయి. సొంతంగా ఎన్నికల బరిలోకి దిగడంతోపాటు 2014లో బొటాబొటీ మెజారిటీ కూడా సాధించారు కేసీఆర్. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ పార్టీల భరతం పట్టారు. పదుల సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ప్రముఖ నేతలంతా వుండడంతో తెలంగాణలో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ అయ్యింది. ఈ తంతు 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత ముమ్మరమైంది. 2018లో కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు మాత్రమే రాగా అందులోంచి హుజూర్ నగర్‌ (Huzurnagar)లో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన 2019లో పార్లమెంటుకు ఎన్నికవడంతో రాజీనామా తప్పలేదు. మిగిలిన 18 మందిలో ఏకంగా 12 మంది అధికార టీఆర్ఎస్ పార్టీ పంచన చేరిపోయారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవాల్సిన దుస్థితి తలెత్తింది. మిగిలిన ఆరుగురిలో తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య కేవలం అయిదుగా తేలింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కుంగదీసింది కేసీఆర్ వ్యూహమే. ఇపుడు జాతీయ రాజకీయాల్లో బీజేపీయేతర కూటమి అంటూ బయలుదేరిన కేసీఆర్.. ఆ క్రమంలో కొందరు కాంగ్రెస్ మిత్ర పక్షాలను, మరికొందరు తటస్థులను కలుస్తూ వస్తున్నారు. కానీ వీరిలో కాంగ్రెస్ మిత్ర పక్ష నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు. స్టాలిన్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ వంటి వారిని కాంగ్రెస్ మిత్ర పక్ష నేతలుగానే భావించాలి. ఇక తటస్థుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్, దేవెగౌడ, కుమారస్వామి, నవీన్ పట్నాయక్ వంటి నేతలున్నారు. అయితే, వీరిలో నవీన్ పట్నాయక్ బీజేపీని అంతగా వ్యతిరేకించడం లేదు. మిగిలిన ముగ్గురు బీజేపీని వ్యతిరేకిస్తుండగా ఒక్క అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీతో కాస్త దూరం మెయింటేన్ చేస్తున్నారు. మొత్తమ్మీద కేసీఆర్ కలిసి నేతలను, వారి పొలిటికల్ అసోసియేషన్లను పరిశీలిస్తే.. దాదాపు 80 శాతం కాంగ్రెస్ పార్టీతో ఎంతో కొంత సన్నిహితంగా వుండేవారే అధికంగా కనిపిస్తున్నారు. మరి బీజేపీ ముక్త్ భారత్ అంటున్న కేసీఆర్ అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి చేరువవుతారా అన్న సందేహాలు ఈ విశ్లేషణలతో కలుగక మానవు.

ఇక్కడ రెండు విశ్లేషణలు ప్రస్తావించుకోవాల్సి వుంది. బీజేపీ ముక్త భారత్‌ లక్ష్యంలో భాగంగా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కలుస్తున్న నేతలు, వారి పార్టీలు బీజేపీయే లక్ష్యంగా పనిచేసి.. బీజేపీ ఎంపీల సంఖ్యను బాగా తగ్గించగలిగితే.. రెండు పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఒకటి బీజేపీ పతనంతో కాంగ్రెస్ పార్టీ బాగా లాభపడితే.. ఆ పార్టీ ఎంపీల సంఖ్య 200 దాటితే అప్పుడు కేసీఆర్ కలుస్తూ వస్తున్న నేతలు కాంగ్రెస్ పార్టీ పంచన చేరడం ఖాయం. ఎందుకంటే ఇందులో ఆల్ రెడీ యూపీఏలో వున్నవి కొన్నైతే, మరికొన్ని బీజేపీని నిలువరించే పనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కలుస్తాయి. అప్పుడు కేసీఆర్ ఎలాంటి రోల్ ప్లే చేస్తారనేది ఆసక్తిరేపడం ఖాయం. ఒకవేళ బీజేపీ పతనం వల్ల ప్రాంతీయ పార్టీలు బాగా పుంజుకుని, కాంగ్రెస్ పార్టీ వంద ఎంపీ సీట్లకు కాస్త అటూ ఇటూగా సాధిస్తే అప్పుడు ఆ పార్టీ మద్దతుతో థర్డ్ ఫ్రంట్ (కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ (Federal Front) అని కూడా అనొచ్చు) అధికారం చేపట్టే అవకాశం వుంది. అయితే, చౌదరీ చరణ్ సింగ్ (1979), చంద్రశేఖర్ (1991), ఐకే గుజ్రాల్ (1997) ప్రభుత్వాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించిందో కొద్దిపాటి రాజకీయ పరిఙ్ఞానం వున్నవారికి కూడా తెలుసు. మరి కేసీఆర్‌కు ఆ విషయం తెలియదు అనుకోలేం. ఈ క్రమంలో అస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో దేశప్రజలు బీజేపీని కాదని ప్రాంతీయ, ఉపప్రాంతీయ పార్టీల వైపు మొగ్గుచూపుతారా అన్నది చర్చనీయాంశమే. ఈక్రమంలో కేసీఆర్ బీజేపీ ముక్త భారత్ నినాదం అయితే కాంగ్రెస్ పార్టీకి సానుకూలమన్నా కావాలి లేదా విఫలమన్నా కావాలి అన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో ప్రబలంగా వినిపిస్తున్నాయి.