- Telugu News Photo Gallery Spiritual photos Sun Transit in Simha Rasi These zodiac signs to ave Raja Yoga and Dhana Yoga Details in Telugu
Telugu Astrology: సింహ రాశిలోకి రవి.. ఆ రాశులకు రాజయోగాలు, ధన యోగాలు..!
Dhana Yoga and Raja Yoga: ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్న రవి ఈ నెల 16 నుంచి సింహ రాశిలో ప్రవేశిస్తాడు. స్వక్షేత్రమైన సింహ రాశిలో రవి నెల రోజుల పాటు సంచారం చేయడం జరుగుతుంది. అధికారానికి, అందలాలకు కారకుడైన రవి తన స్వక్షేత్రంలో సంచారం చేసేటప్పుడు కచ్చితంగా కొన్ని రాశులకు రాజయోగాలు, ధన యోగాలు కలగజేస్తాడు. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశులవారు ఏ రంగంలో ఉన్నా తప్పకుండా ఉన్నత పదవులు చేపడతారు. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి, రాజకీయ ప్రాబల్యం కలగడానికి కూడా అవకాశం ఉంది.
Updated on: Aug 08, 2025 | 7:03 PM

మేషం: ఈ రాశికి పంచమాధిపతిగా రవి పంచమ స్థానంలోనే సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి రాజ యోగాలు కలిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగాలు కలుగుతాయి. సమర్థతకు, శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలను ఆశిస్తున్నవారి కోరిక నెరవేరుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా లాభిస్తాయి.

వృషభం: ఈ రాశికి చతుర్థాధిపతి అయిన రవి చతుర్థ స్థానంలోనే ప్రవేశించడం వల్ల తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సొంత ఇంటి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయాల్లో లేక ప్రభుత్వంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఆదాయానికి లోటుండదు.

కర్కాటకం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన రవి ధన స్థానంలోనే సంచారం చేయడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ లాభాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అత్యధికంగా లాభం పొందుతారు. బంధుమిత్రుల నుంచే కాక. పని చేస్తున్న సంస్థ నుంచి రావలసిన సొమ్ము కూడా పూర్తిగా చేతికి అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. భారీగా పిత్రార్జితం లభించే సూచనలున్నాయి.

సింహం: రాశ్యధిపతి రవి స్వక్షేత్ర ప్రవేశం వల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఏ రంగంలో ఉన్నా రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపడతారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. రాజకీయ ప్రాబల్యానికి అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

తుల: ఈ రాశికి లాభ స్థానంలో లాభస్థానాధిపతి రవి ప్రవేశం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ధన ధాన్య సమృద్ది యోగం పడుతుంది. ఉన్నత స్థాయి జీవనశైలి ఏర్పడుతుంది. తండ్రి నుంచి ఆస్తి సంక్రమిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నత పదవులు లభిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి నిశ్చయమవుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.

వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి దశమ స్థానంలోనే ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో అధికార యోగం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ విజయాలు, సాఫల్యాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఉద్యోగులు, నిరుద్యోగులకు ఆఫర్లు అందే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా బాగా రాణిస్తాయి.

ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి రవి సంచారం వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. జీతభత్యాలు, ఆదనపు ఆదాయం బాగా వృద్ది చెందుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.



