- Telugu News Photo Gallery Dussehra 2024: ‘Vishwashanti Mahayagya’ organized at Swaminarayan Akshardham Temple at Delhi
Akshardham Mandir: విశ్వశాంతి మహాయజ్ఞం.. స్వామినారాయణ అక్షరధామ్ ఆలయంలో దసరా వేడుకలు
విజయదశమి (దసరా) శుభ సందర్భంగా ఢిల్లీలోని స్వామినారాయణ అక్షరధామ్ ఆలయంలో ‘విశ్వశాంతి మహాయజ్ఞం’ను ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలనే సంకల్పంతో 114 యజ్ఞ కుండలిల పవిత్ర సమర్పణలు జరిగాయి.
Updated on: Oct 12, 2024 | 12:42 PM

విజయదశమి (దసరా) శుభ సందర్భంగా ఢిల్లీలోని స్వామినారాయణ అక్షరధామ్ ఆలయంలో ‘విశ్వశాంతి మహాయజ్ఞం’ను ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలనే సంకల్పంతో 114 యజ్ఞ కుండలిల పవిత్ర సమర్పణలు జరిగాయి. ఈ విశ్వశాంతి మహాయజ్ఞంలో మత పెద్దలతోపాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమం భగవద్గీత, హెచ్.హెచ్. మహంత్ స్వామీజీ మహారాజ్ బోధనల నుండి ప్రేరణ పొందింది. ఈ పవిత్ర సమర్పణలో భాగంగా 114 యజ్ఞ కుండలిలు ద్వారా పూజలు చేశారు. వేద పండితులు, 900 జంటలతో సహా దాదాపు 2500 మంది ఈ యజ్ఞ కర్మలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమ ఇన్‌ఛార్జ్ యష్ సంపత్ మాట్లాడుతూ.. “భగవద్గీత అపారమైన జ్ఞానం నుంచి తీసుకోబడిన మహాయజ్ఞం.. అన్ని క్రియలు యజ్ఞం ద్వారా జ్ఞానాన్ని పొందుతాయి” (అధ్యాయం 3) అనే శ్లోకంతో పరమాత్మ అయిన బ్రహ్మను ఆరాధించడానికి ఒక మార్గంగా తీసుకున్నట్లు తెలిపారు. ఈ వైదిక ఆచారం ద్వారా, భక్తులు మానవాళి అందరికీ దైవిక ఆశీస్సులను కోరుతూ ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు పవిత్ర వేద మంత్రాలను పఠించారు. యజ్ఞం.. ఆధ్యాత్మిక శక్తిని నొక్కిచెబుతూ.. పురాతన సంప్రదాయాలతో లోతైన సంబంధాన్ని పెంపొందిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ యజ్ఞం చేశారు. 114 యజ్ఞ కుండ్‌లు ద్వారా యజ్ఞం చేస్తూ.. అందరికీ దేవుని ఆశీర్వచనలు.. ఆయురారోగ్యాలు ప్రసాందించాలని.. సామరస్యాన్ని, విశ్వశాంతిని ప్రసాదించాలని పూజించారు. ఈ వేడుకలో ప్రత్యేక ప్రార్థనలు కూడా జరిగాయి.. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలు.. సాయుధ పోరాటాల మధ్య ప్రపంచంలో శాంతియుత జీవనం కోసం పిలుపునిచ్చారు.

అనంతరం స్వామినారాయణ అక్షరధామ్ మందిర్ ఇన్‌ఛార్జి పూజ్య మునివత్సలదాస్ స్వామి మాట్లాడుతూ.. ప్రపంచంలో.. పర్యావరణంలో, సమాజంలో, ప్రతి వ్యక్తిలో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఈ యజ్ఞం నిర్వహించామని.. భగవంతుడు విశ్వశాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ యజ్ఞం ప్రారంభంలో ప్రతిధ్వనించిన వేద మంత్రాలు.. స్వామినారాయణ మహామంత్రం అందరికి.. వారి కుటుంబాలకు సంతోషాన్ని కలిగిస్తుందని.. సుఖ శాంతిని ప్రసాదిస్తుందని తెలిపారు. మన జీవితంలో.. మనలో ఉన్న 'రావణుడిని' దహనం చేద్దాం.. అది ఎప్పటికీ తిరిగి రాని విధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక యుద్ధాలకు ముగింపు పలకాలని.. అందరికీ శాంతిని ప్రసాదించాలని మేము ప్రార్థిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో.. విజయ దశమి నిజమైన అర్ధం... ఆత్మవిశ్లేషణ సందేశాన్ని తెలుసుకుంటూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. భక్తులకు ఆధ్యాత్మిక పరిపూర్ణత.. లోతైన భావాన్ని మిగిల్చిందని వేద పండితులు పేర్కొన్నారు.



















