Insurance: బ్యాంకులు మూసివేస్తే డిపాజిట్ చేసిన డబ్బుల పరిస్థితి ఏమిటీ..? తాజాగా కేంద్రం కీలక నిర్ణయం
బ్యాంకులో డబ్బులు పొదుపు చేసుకోవడం చాలా మంది చేసేదే. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులు దివాలా తీస్తుండటంతో బ్యాంకులను మూసివేయడం, ఇతర బ్యాంకుల్లో విలీనం...
బ్యాంకులో డబ్బులు పొదుపు చేసుకోవడం చాలా మంది చేసేదే. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులు దివాలా తీస్తుండటంతో బ్యాంకులను మూసివేయడం, ఇతర బ్యాంకుల్లో విలీనం చేయడం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాంటప్పుడు మూసివేతకు గురైన బ్యాంకులో మీరు డబ్బులు డిపాజిట్ చేసినట్లయితే వాటి పరిస్థితి ఏమిటీ ? అన్న ప్రశ్న అందరిలో తలెత్తుతుంటుంది.
1 / 7
అలాంటి సమయంలో ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వారి డిపాజిట్లకు రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఖాతాదారుల డిపాజిట్లకు ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్’ (DICGC) హామీ ఇస్తుంది. అంటే బ్యాంకులు సరిగ్గా నడపని పక్షంలో ఖాతాదారుల డిపాజిట్ డబ్బులను డీఐసీజీసీ ఇన్సూరెన్స్ రూపంలో చెల్లిస్తుంది. ఈ కవరేజీని రూ.1 లక్షగా ఉండేది. కానీ గత ఏడాది దీనిని సవరించారు. 2020 ఫిబ్రవరి 4 నుంచి డిపాజిట్లకు రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజీ అమల్లోకి వచ్చింది.
2 / 7
ఈ నేపథ్యంలో రూ.65 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకునే అవకాశాలపై ఖాతాదారులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అకౌంట్ ఉన్న అదే బ్రాంచిలో ఈ సదుపాయం ఉంటుంది. డీఐసీజీసీ సేవింగ్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లు, రికవరింగ్ డిపాజిట్లు వంటి డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజీ ఇస్తుంది. కానీ విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు, రాష్ట్ర సహకార బ్యాంకులు, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర డిపాజిట్లు, రిజర్వు బ్యాంక్ మినహాయించిన డిపాజిట్లకు ఇన్సూరెన్స్ వర్తించదు.
3 / 7
బ్యాంకు లైసెన్స్ రద్దు చేసిన తేదీ లేదా.. విలీనం చేసిన తేదీ నుంచి ఖాతాదారులు తమ అసలు, వడ్డీపై రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంటుంది. అయితే అన్ని రకాల డిపాజిట్లకూ ఇన్సూరెన్స్ పరిమితి అత్యధికంగా రూ.5 లక్షలుగానే ఉంది. ఒక వేళ డిపాజిట్ చేసిన అసలు రూ. 5 లక్షల వరకే ఉంటే.. ఖాతాదారులు అంత వరకే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దానిపై రావాల్సిన వడ్డీకి ఎలాంటి గ్యారంటీ ఉండదు. అసలు, వడ్డీ కలిపి రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటే ఆ డబ్బును పూర్తిగా పొందే అవకాశం ఉంటుంది
4 / 7
కాగా, వినియోగదారులు ఒకే బ్యాంకులో వివిధ రకాల పథకాలు, డిపాజిట్లను ఎంచుకుంటే వాటన్నింటికీ విడివిడిగా రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. బ్యాంకు ఎఫ్‌డీలను ఎంచుకునే కస్టమర్లు ఒకటి మైనర్‌తో ఉమ్మడిగా, ఒకటి వ్యక్తిగతంగా, మరొకటి జీవిత భాగస్వామితో కలిపి ఇలా తీసుకోవాలి. ఒక వేళ బ్యాంకులు మూసివేస్తే ఈ అన్ని ఎఫ్‌డీ ఖాతాలపైనా ఖాతాదారులు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ డిపాజిట్ల మెచూరిటీ మొత్తం రూ.5 లక్షలకు మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
5 / 7
అయితే ఇది అన్ని బ్యాంకులకు వర్తిస్తుందా..? అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. మన దేశంలో పని చేసే విదేశీ బ్యాంకులు, వాణిజ్య, సహకార బ్యాంకులు అన్నీ ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్’ (డీఐసీజీసీ) పరిధిలోకి వస్తాయి. కానీ ప్రాథమిక సహకార సంఘాలు, NBFC, HFC వంటి సంస్థల డిపాజిట్లకు డీఐసీజీసృ ఇన్సూరెన్స్ వర్తించదు.
6 / 7
అందువల్ల డిపాజిట్ల భద్రత, ఇన్సూరెన్స్ హామీ ఆధారంగా పెట్టుబడులను ఎంచుకోవాలి. డిపాజిట్ల పరిమితి రూ.5 లక్షలు మించకుండా జాగ్రత్తపడాలి. ఇలాంటి ప్రయోజనాల ఆధారంగా పెట్టుబడులు ఎంచుకునేవారు ఆర్థిక నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.