Union Budget 2026: బడ్జెట్లో కేంద్రం బిగ్ డెసిషన్.. రైల్వే టికెట్లపై 50 శాతం వరకు రాయితీ..! వారికి పండుగే..
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పలు వర్గాలకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. అందులో భాగంగా సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా పలు కీలక ప్రకటనలు ఉండనున్నాయని సమాచారం. సినియర్ సిటిజిన్లకు ఇప్పటికే ట్యాక్స్ మినహాయింపులతో పాటు వారి చేసే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు, మనీ విత్ డ్రాలపై ట్యాక్స్ రిలీఫ్‌లు వంటివి అమలు చేస్తున్నారు.

కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించేందుకు సిద్దమవుతోంది. రైళ్లల్లో ప్రయాణించే వృద్దులకు ఇది వరంగా మారనుంది. ఎందుకంటే వారికి రైల్వే టికెట్లపై రాయితీ అందించనున్నారు. ఈ పథకాన్ని గతంలో ఆపేయగా.. ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సినియర్ సిటిజన్లకు ఉపయోగపడే ఈ నిర్ణయాన్ని 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ ప్రకటించనుంది. ఇది దేశంలోనే వృద్దులందరికీ ఉపయోగపడనుంది. ఇక నుంచి తక్కువ టికెట్‌తో దేశవ్యాప్తంగా వాళ్లు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
రైల్వే టికెట్లపై రాయితీ
గతంలో రైల్వే టికెట్లపై సినియర్ సిటిజన్లకు రాయితీ కల్పించేవారు. కానీ కరోనా మహమ్మారి సమయంలో 2020లో దీనిని నిలిపివేశారు. దీంతో ఈ సబ్సిడీని తిరిగి ప్రారంభించాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. దీంతో ఈ బడ్జెట్లో రాయితీని పున:ప్రారంభించడంపై ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆర్ధిక మంత్రిత్వశాఖతో రైల్వేశాఖ సంప్రదింపులు జరుపుతోంది. బడ్జెట్లో ఈ అంశాన్ని పొందుపర్చాలని ఆర్ధికశాఖను రైల్వేశాఖ కోరింది. దీంతో ఆర్ధికశాఖ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 60 ఏళ్లుపైబడ్డ పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు రైల్వే టికెట్లపై రాయితీ లభించనుంది.
దశాబ్దాలుగా అమలు
దశాబ్దాలుగా సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై రాయితీ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో తక్కువ ధరతో ఆ వర్గాల వారు ప్రయాణించగలుగుతున్నారు. రైల్వే టికెట్లపై పురుషులకు 40 శాతం తగ్గింపు, మహిళలకు 50 శాతం తగ్గింపు అమలు చేస్తున్నారు. స్లీపర్ క్లాస్ టికెట్లతో పాటు థర్డ్, సెకండ్, ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లపై కూడా రాయితీ లభిస్తోంది. ఆఫ్‌లైన్ కౌంటర్లతో పాటు ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నా సీనియర్ సిటిజన్లకు టికెట్లపై రైల్వేశాఖ రాయితీ అందిస్తోంది. ఇందుకోసం ఐఆర్‌సీటీలో టికెట్ బుక్ చేసుకునే సమయంలో వయస్సును నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్ కేటగిరీ ఎంచుకోవాల్సి ఉంటుంది.
కరోనా కారణంగా బంద్
మార్చి 2020లో కరోనా మహహ్మారి కారణంగా రైల్వే సర్వీసులన్నీ బంద్ అయ్యాయి. దీని వల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో రైల్వేశాఖకు భారీగా ఆర్ధిక కష్టాలు ఎదురయ్యాయి. దీని వల్ల రైల్వేశాఖ సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై ఇచ్చే రాయితీని తాత్కాలికంగా నిలిపివేసింది. సినియర్ సిటిజన్లకు 50 శాతం వరకు రాయితీ ఇవ్వడం వల్ల రైల్వేశాఖకు దాదాపు రూ.1600 నుంచి రూ.2 వేల కోట్ల వరక ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం రైల్వే సర్వీసులు మళ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం, రైల్వే ఛార్జీలను కూడా పెంచిన క్రమంలో తిరిగి రాయితీని అందించాలని రైల్వేశాఖ భావిస్తోంది. రాయితీని పునరుద్దరించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించామని, బడ్జెట్లో ప్రకటన ఉంటుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల సీనియర్ సిటిజన్లకు ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని చెబుతున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి దీనిని అమలు చేసే అవకాశముంది.
