ఇక ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు కుదరదు.. పిజ్జా, బర్గర్ లవర్స్‌కు కేంద్రం షాక్..!
బర్గర్ల పైన, పిజ్జాల పైన ఉన్న క్రేజ్.. ఇప్పుడు మన ఆరోగ్యాన్ని హరించివేస్తోంది. దేశంలో జంక్ ఫుడ్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ఆరోగ్య భారత్ లక్ష్యంగా 2026 ఆర్థిక సర్వేలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రతిపాదనలు చేశారు.

దేశంలో పెరిగిపోతున్న ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పదునైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. 2025-26 ఆర్థిక సర్వేలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జంక్ ఫుడ్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వాటి మార్కెటింగ్‌పై కఠిన ఆంక్షలు విధించాలని సూచించారు. సర్వేలోని ప్రధాన అంశాల ప్రకారం.. అత్యంత ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ప్రకటనలపై టీవీలు, సోషల్ మీడియాలో భారీగా నియంత్రణ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రకటనల నిషేధం
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలను ప్రసారం చేయకూడదని ప్రతిపాదించారు. పసిపిల్లల పాలు, పానీయాల మార్కెటింగ్‌పై కఠినమైన ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ప్యాకెట్లపై కేవలం పోషకాల వివరాలే కాకుండా.. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉంటే స్పష్టంగా కనిపించేలా హెచ్చరిక ముద్రించాలని సూచించారు.
షాకింగ్ గణాంకాలు: 40 రెట్లు పెరిగిన అమ్మకాలు..
గడిచిన రెండు దశాబ్దాల్లో భారతీయుల ఆహారపు అలవాట్లు ఎంతలా మారాయో ఈ గణాంకాలు చెబుతున్నాయి. 2006లో కేవలం 0.9 బిలియన్ డాలర్లుగా ఉన్న జంక్ ఫుడ్ మార్కెట్ 2019 నాటికి 38 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2009-2023 మధ్య కాలంలో జంక్ ఫుడ్ వినియోగం 150 శాతం పెరిగింది. ఊబకాయం సమస్య పురుషులు, మహిళల్లో దాదాపు రెట్టింపు అయ్యింది. 2035 నాటికి దేశంలో దాదాపు 8.3 కోట్ల మంది చిన్నారులు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉందని సర్వే హెచ్చరించింది.
ఎందుకు ఈ నిర్ణయం?
కేవలం ప్రజల అలవాట్లు మారితే సరిపోదని, ప్రభుత్వ పాలనలో కూడా మార్పులు రావాలని సర్వే స్పష్టం చేసింది. బర్గర్లు, పిజ్జాలు, సాఫ్ట్ డ్రింక్స్ వంటి పదార్థాలు ప్రీ-డైజెస్టెడ్ ఫుడ్‌గా మారి రోగాలకు కారణమవుతున్నాయని, అందుకే వీటిని నియంత్రించడమే ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు మార్గమని తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




