AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: వెండి విశ్వరూపం.. ఈ టైమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చా.. ధరలు ఢమాల్ అంటాయా..?

బంగారాన్ని మించి వెండి మెరుపు వేగంతో దూసుకెళ్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కిలో వెండి ధర రూ. 4 లక్షల మైలురాయిని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ వైట్ మెటల్ గడిచిన ఏడాది కాలంలోనే దాదాపు 188 శాతం లాభాలను పంచింది. అయితే ఈ స్థాయి లాభాల తర్వాత మార్కెట్ అస్థిరత ఉంటుందా? కొత్తగా పెట్టుబడి పెట్టేవారు ఇప్పుడు సాహసం చేయవచ్చా? అనేది తెలుసుకుందాం..

Silver: వెండి విశ్వరూపం.. ఈ టైమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చా.. ధరలు ఢమాల్ అంటాయా..?
Is It Still A Good Time To Invest In Silver
Krishna S
|

Updated on: Jan 29, 2026 | 3:01 PM

Share

ప్రస్తుత ప్రపంచ రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5,500 డాలర్ల మార్కును దాటగా, వెండి ధరలు ఏకంగా ఏడాదిలో 188శాతం వృద్ధిని నమోదు చేసి ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తున్నాయి. వెండి ధరలు ఇంతలా పెరగడానికి కేవలం డిమాండ్ మాత్రమే కారణం కాదు దాని వెనుక బలమైన నిర్మాణాత్మక అంశాలు ఉన్నాయి. సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. యుద్ధ వాతావరణం, ఆర్థిక మాంద్యం భయాల సమయంలో ఇన్వెస్టర్లు కరెన్సీ కంటే లోహాలనే నమ్ముకుంటున్నారు. గ్లోబల్ మార్కెట్లలో నగదు లభ్యత, వడ్డీ రేట్ల మార్పులు వెండి వైపు ఇన్వెస్టర్లను మళ్లించాయి.

మార్కెట్ నిపుణుల హెచ్చరిక

ICICI ప్రుడెన్షియల్ AMC నిపుణులు చింతన్ హరియా ప్రకారం.. వెండి ప్రస్తుతం ఓవర్ హీటెడ్ జోన్‌లో ఉంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు కొన్ని కీలక అంశాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ధరలు పెరిగిపోతున్నాయి కదా అని భయంతో లేదా అత్యాశతో ఇప్పుడు భారీగా పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. ఏ ఆస్తి అయినా ఇంత వేగంగా పెరిగినప్పుడు, లాభాల స్వీకరణ జరిగి ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. మీ మొత్తం పెట్టుబడిలో వెండి వాటా పెరిగిపోతే, ఆ లాభాల్లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకుని, ఇతర ఆస్తుల్లోకి మళ్లించడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.

కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి సూచనలు

మీరు ఇప్పుడు వెండిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ వ్యూహాలు పాటించడం ఉత్తమం.

  • ఒకేసారి కాకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా నెలకు కొంత చొప్పున వెండి ETFలలో పెట్టుబడి పెట్టండి.
  • మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో బంగారం, వెండి కలిపి 10శాతం నుండి 15శాతం మించకుండా చూసుకోండి.
  • ఫిజికల్ సిల్వర్ కంటే సిల్వర్ ETFలు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల భద్రతతో పాటు లిక్విడిటీ ఉంటుంది.

2026 ఆర్థిక చిత్రం చాలా వేగంగా మారుతోంది. వెండి ధరలు కిలోకు 4 లక్షలకు చేరడం అనేది ఒక గొప్ప లాభదాయక అంశమే అయినప్పటికీ, పదునైన ఎత్తుల తర్వాత లోతైన పల్లాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి