Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR’s letter to Nirmala Sitharaman : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ

కేంద్రం తీసుకొచ్చిన 'ఆత్మ నిర్భర్ భారత్' సహాయ ప్యాకేజీ వల్ల ఒనగూడుతోన్న ఫలితాలు, సమస్యలను నిర్మలా సీతారామన్ దృష్టికి తన లేఖ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఆ లేఖ పూర్తి పాఠం.. మీకోసం..

KTR's letter to Nirmala Sitharaman : కేంద్రమంత్రి  నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ
KTR
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 17, 2021 | 6:42 PM

KTR’s letter to Union Minister Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ లేఖ రాశారు. కరోనా కష్టకాలాన దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ సహాయ ప్యాకేజీ వల్ల ఒనగూడుతోన్న ఫలితాలు, సమస్యలను నిర్మలా సీతారామన్ దృష్టికి తన లేఖ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఆ లేఖ పూర్తి పాఠం.. మీకోసం..

“గౌరవ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గారికి….

కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు గౌరవ ప్రధాన మంత్రి 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికీ ఒక సంవత్సరం పైగా కావస్తున్నది.

తెలంగాణ రాష్ట్ర తయారీ రంగానికి వెన్నుముకగా నిలుస్తున్న సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేలా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా గట్టి ప్రయత్నం చేస్తూ వచ్చాను.

అయితే కరోనా సంక్షోభం ద్వారా తీవ్రంగా ప్రభావితమైన ఇక్కడి సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలకు మీరు ప్రకటించిన ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు అత్యంత కనిష్టంగా ఉన్నాయని తెలిపేందుకు చింతిస్తున్నాను.

రాష్ట్రంలో ఉన్న 80 శాతానికిపైగా ఎంఎస్ఎంఈలు లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, 25 శాటానికి పైగా ఎంఎస్ఎంఈలు తమ రాబడులను పూర్తిగా కోల్పోవడం జరిగింది.

ఈ ప్యాకేజీ విషయంలో మా ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని, రాష్ట్రాల అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాను.

మీరు ప్రకటించిన ప్యాకేజీలో ప్రధానంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించిన గ్యారంటేడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీం కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే ఈ పథకం మార్గదర్శకాలు వెలువడిన తర్వాత.. ఈ పథకంలో ప్రత్యేక ఆకర్షణ ఏమీ లేదని తెలంగాణలోని ఎంఎస్ఎంఈలు భావిస్తున్నాయి. పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియను రూపొందించడం జరిగింది. దీనితో ఎంఎస్ఎంఈలు అనేక వ్యవప్రయాసలకు గురవుతున్నాయి.. ఒక్కో యూనిట్ ఒక్కో విదమైన ఇబ్బందిని, సవాళ్ళను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అన్ని ఎంఎస్ఎంఈలకు ఒకే రకమైన పథకం ద్వారా వాటి అవసరాలు తీరే అవకాశం లేదు. కరోనా సంక్షోభం ద్వారా కలిగిన నష్టాలను భరించేలా ఒక భారీ ఆర్థిక గ్రాంట్ ఇవ్వడం ద్వారా ఎంఎస్ఎంఈలను ఆదుకోవచ్చుని భావిస్తున్నాను. సంవత్సరానికి పైగా సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలు ఈ రోజుకి కూడా సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్, తీవ్రమైన లేబర్ కొరత, మరికొన్ని ఎంఎస్ఎంఈల విషయంలో మారిన కస్టమర్ల ప్రాధాన్యతల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయన్న విషయాన్ని మీరు సైతం అంగీకరిస్తానని భావిస్తున్నాను.

మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ సహాయ ప్యాకేజీలో రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఇన్నోవేటివ్ ఎంఎస్ఎంఈల కోసం మరో రెండు పథకాలను ప్రకటించారు. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలోనే కాకుండా, దేశంలో ఎక్కడా కూడా ఈ రెండు పథకాలు ప్రారంభమైన పరిస్థితి కనిపించడం లేదు. రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన సబార్డినెట్ డెబ్ట్ స్కీం అత్యంత తక్కువ రుణ మొత్తాన్ని అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈల వయబిలిటీ పైన స్పష్టత లేదు. ఇలాంటి సందర్భంలో మీరిచ్చే అత్యంత తక్కువ రుణ మొత్తం ఆయా ఎంఎస్ఎంఈల అవసరాలకి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో పాటు ఇన్నోవేటివ్ ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన కార్పస్ ఫండ్ స్కీమ్ మార్గదర్శకాలు ఇంతవరకు విడుదల కాలేదు.

ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో భాగంగా కీలక రంగాలకు ప్రకటించిన పిఎల్ఐ పథకం ద్వారా దేశంలోని ఎంఎస్ఎంఈల పై పెద్దఎత్తున సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత పథకం కేవలం పెద్ద తయారీ కంపెనీలకు మాత్రమే ప్రయోజనాలు చేకూర్చేలా ఉంది. దేశీయ ఎంఎస్ఎంఈలతో కూడిన ఒక సప్లై చైన్ ఏర్పాటు చేయాలని భారీ తయారీ కంపెనీలకు ఒక నిబంధన రూపొందించడం ద్వారా పిఎల్ఐ ప్రయోజనాలను ఆయా ఎంఎస్ఎంఈలతో పంచుకునేలా ఈ కార్యక్రమం మార్గదర్శకాలను మార్చవలసిన అవసరం ఉన్నది.

గత ఏడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజ్ లో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభ కాలం స్వల్పకాలమే ఉంటుందని, ఈ కాలానికి మీరు ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని ఆశించాము. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం రెండవ దశను సైతం దాటి కొనసాగుతున్నది. అతి త్వరలోనే కరోనా మూడవ దశ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజీని మరోసారి పునర్ నిర్వచించడం ద్వారా ఈ కరోనా సంక్షోభం ద్వారా ప్రభావితమైన వివిధ రంగాలు, ముఖ్యంగా అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంఎస్ఎంఈ రంగానికి మరింత చేయూతనిచ్చే అవకాశం కలుగుతుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వము సరైన చర్యలు తీసుకుంటుందని, కేంద్రం చేసే ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేస్తున్నాను. ఈ ప్యాకేజీ విషయంలో మా ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని, రాష్ట్రాల అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాను.

శుభాభినందనలతో

మీ.

కే. తారక రామారావు”

Read also : Hyderabad: గ్రేటర్లో 56 వేల కుటుంబాలకు రేపటి నుంచి తీరనున్న ఇక్కట్లు