Podu Farming : వర్షాల రాకతో తెలంగాణలో పోడు పోరు మళ్లీ మొదలు.. నేతలు సైతం రంగంలోకి దిగడంతో అట్టుడుకుతోన్న అడవి తల్లి.!

ఒకరిది ఉద్యోగ ధర్మం.. మరికరిది ఏండ్ల తరబడి భూమి కోసం పోరాటం. తెలంగాణలో పోడు భూముల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. గిరిజనులతో కలిసి ఫారెస్ట్ అధికారుల మీద యుద్ధానికి సిద్ధం అంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు..

Podu Farming : వర్షాల రాకతో తెలంగాణలో పోడు పోరు మళ్లీ మొదలు.. నేతలు సైతం రంగంలోకి దిగడంతో అట్టుడుకుతోన్న అడవి తల్లి.!
Podu Cultivation
Venkata Narayana

|

Jun 17, 2021 | 5:22 PM

Telangana Tribals preparing for Podu farming : వర్షాల రాకతో వ్యవసాయ సీజన్ మొదలైందో లేదో.. అప్పుడే మళ్లీ లొల్లి షురూ అయ్యింది. ఆ భూముల్లో పంటలు వేసుకుంటామంటూ.. నాగలి భుజాన పెట్టుకొని బయలుదేరారు పోడు రైతులు. అలా ఎలా కుదురుతుంది. అది అటవీ భూమి, అందులో పంటల సాగు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. దీంతో గూడేల్లో గడబిడ కొనసాగుతోంది. తొలకరి పలకరింపుతో.. రైతులంతా పొలం బాట పట్టారు. ఒకరిది ఉద్యోగ ధర్మం.. మరికరిది ఏండ్ల తరబడి భూమి కోసం పోరాటం. తెలంగాణలో పోడు భూముల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. గిరిజనులతో కలిసి ఫారెస్ట్ అధికారుల మీద యుద్ధానికి సిద్ధం అంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. సీజన్ ప్రారంభంతో పోడు రైతులు, అటవీ అధికారులకు మధ్య పోరు కేక వినిపిస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 95 వేల ఎకరాల్లో పోడు భూమి సాగులో ఉంది. ఆ భూముల్లో పంటలు సాగుచేసుకునేందుకు సిద్ధమయ్యారు రైతులు. అడవుల సంరక్షణ చేపట్టే పనిలో పడ్డారు ఫారెస్ట్ అధికారులు. ఏజెన్సీ గ్రామాల్లో పోడు రైతులు, అటవీ శాఖ అధికారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోడు భూములను సమస్యను పరిష్కరిస్తామని సీఎం ఎన్నికల్లోనే హామీ ఇచ్చారంటూ గుర్తు చేస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. అయితే కరోనా కారణంగా బ్రేక్ పండిందని అంటున్నారు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్.

రైతుల భూముల్లో కందకం తీస్తే కబర్దార్.. ఓ ఎమ్మెల్యే వార్నింగ్! రైతుల కోసం జైలుకైనా వెళ్తా.. మరో ఎమ్మెల్యే అల్టిమేటం! కవ్వింపు చర్యలు ఆపకపోతే అటవీశాఖ అధికారులపై తిరగబడుతామని ఏకంగా ఓ ఎంపి హెచ్చరిస్తే.. పోడు రైతులను ఆగంచేస్తే అధికారులను ఇక్కడి నుండి పంపిస్తామని మరో మంత్రి హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల ఈ కామెంట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడుపోరు వివాదానికి అద్దం పడుతున్నాయి. అయినా వెనక్కితగ్గని అటవీశాఖ అధికారులు డోంట్ కేర్.. తమ వృత్తి ధర్మం తాము నిర్వహిస్తామంటున్నారు. ఇరు వర్గాలు పట్టుమీదుండటంతో పచ్చని భూముల్లో రణరంగం కొనసాగుతోంది.

ఫలితంగా పచ్చటి పల్లెల్లో మళ్లీ పోడు చిచ్చుమొదలైంది. అటు అధికారులు-ఇటు ప్రజాప్రతి నిధుల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారుతుంది. పోడు సాగులో బాధిత రైతులకు బాసటగా నిలుస్తున్నారు అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాల కోసం పోడు రైతులు ఒకవైపు పాకులాడుతుంటే.. ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ సిబ్బంది వృత్తి ధర్మం పేరుతో వీరంగం సృష్టిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీలో రోజుకోచోట పోడు వివాదం రణరంగంగా మారుతుంది.

వరంగల్ జిల్లాలో లక్షా 9 వేల ఎకరాల్లో పోడు భూములున్నాయన్నది అటవీశాఖ అధికారుల అంచనా. వాటిని స్వాధీన పర్చుకునేందుకు అటవీ అధికారులు చేయని ప్రయత్నాలు లేవు. ఈ భూముల చుట్టూ నిత్యం వివాదం నడుస్తూనే ఉంది. రోజుకో చోట అగ్గి రాజుకుంటూనే ఉంది. మహబూబాబాద్, ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల్లో పోడు భూముల వివాదం ఏళ్ల తరబడి పరిష్కారం లేని సమస్యలా మారాయి.

గ్రామాల్లో పోడు సమస్యపై భగ్గుమంటున్నాయి ప్రతిపక్షాలు. పోడు భూముల సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అంటున్నారు ఎమ్మెల్యే సీతక్క. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు లెక్కచేయడం లేదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆ ఆదేశాలను పాటిస్తే.. ఈ సమస్యలు ఎందుకని ఆమె క్వశ్చన్ చేస్తున్నారు.

తాము నమ్ముకునేదే.. అటవీ భూములను! వాటితోనే మాకు జీవితం.. అవే బతుకుదెరువు. అక్కడి నుంచి వెళ్లిపోమంటే ఎలా? ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు ఎందుకు పట్టాలివ్వరు? ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోదా? ఇదీ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల గోడు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మళ్లీ పోడుభూముల రగడ రాజుకుంటోంది. వానకాలం సీజన్ ప్రారంభమవడంతో ఆదివాసీలు దుక్కులు దున్ని విత్తుకు సిద్దమయ్యారు.

హలం పట్టి, పొలం దున్ని.. విత్తు విసేందుకు సిద్ధమైన ఆదివాసీ రైతులకు అటవీశాఖ అధికారులు అడ్డుపడుతుండటంతో పోడు భూముల వివాదం తారస్థాయికి చేరింది. పోడు రైతులకు అడ్డుతగిలితే దాడులకైనా వెనకాడమంటూ తుడుందెబ్బ హెచ్చరికలు అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లో మళ్లీ అగ్గి రాజేస్తున్నాయి. పెంచికల్ పేట, కొండపల్లి, బజార్ హత్నూర్, పెంబి పరిసర ప్రాంతాల్లో ఆదివాసీ వర్సెస్ అటవీశాఖ రగడ నివురుగప్పిన నిప్పులా మారుతోంది. పెంచికల్ పేట పరిధిలో అటవి భూమిని సాగు చేస్తున్నారంటూ గిరిజనులతో పాటు గిరిజనేతరులపై కేసులు సైతం నమోదయ్యాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 56 వేల 358 మంది పోడు రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గ్రామసభల ద్వారా 37 వేల 372 దరఖాస్తులకు ఆమోదం లభించింది. వివిధ రకాల కారణాలతో మరో 18 వేల 886 దరఖాస్తులు తిరస్కరించారు.ఇప్పటి వరకు లక్షా 35 వేల 99 ఎకరాలకుగాను హక్కు పత్రాలు అందజేశారు. పోడు రైతుల భూముల్లో హరితహారం మొక్కలు నాటేందుకు అటవీ శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ భూముల్లో రైతులు సాగు చేస్తుండడం వివాదానికి దారి తీస్తుంది. అధికారుల చర్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేసుల విషయంలో వెనక్కి తగ్గకపోతే.. డ్యూటీలు చేయకుండా చేస్తామంటూ అటవీ శాఖ అధికారులను హెచ్చరించారు ఎంపీ సోయం బాపూరావు. ఈ నేపథ్యంలో తెలంగాణ అడవుల్లో పోడు పోరు రాబోయే రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.

Read also :  Corona on kids : థర్డ్ వేవ్ వస్తే పిల్లలకు నష్టమా..! వైద్యులు ఏమంటున్నారు?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu