Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona on kids : థర్డ్ వేవ్ వస్తే పిల్లలకు నష్టమా..! వైద్యులు ఏమంటున్నారు?

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో ఎంతటి భయోత్పాతాన్ని సృష్టించిందో జనాల మది నుంచి ఇంకా తొలగిపోలేదు. ప్రస్తుతం కాస్త నిదానించినా మూడోవేవ్‌లో చిన్నపిల్లలపై కరోనా ప్రభావం అధికంగా..

Corona on kids : థర్డ్ వేవ్ వస్తే పిల్లలకు నష్టమా..! వైద్యులు ఏమంటున్నారు?
Covid 19 In Children
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 17, 2021 | 3:57 PM

Corona third wave affect on kids : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో ఎంతటి భయోత్పాతాన్ని సృష్టించిందో జనాల మది నుంచి ఇంకా తొలగిపోలేదు. ప్రస్తుతం కాస్త నిదానించినా మూడోవేవ్‌లో చిన్నపిల్లలపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందన్న ఆందోళనలు నెలకొంటున్నాయి. అయితే కరోనా ప్రభావం చిన్నపిల్లలపై అనుకున్నంత ఎక్కువ ప్రభావం చూపుతుందన్న దాఖలాలు లేవని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. చిన్నపిల్లల్లో కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నా, వంద మంది పిల్లల్లో కేవలం రెండు శాతం మంది పిల్లలు మాత్రమే ఇతర వ్యాధుల ప్రభావంతో ఆసుపత్రులకు వస్తున్నారని చెబుతున్నారు. వారిలో కూడా రికవరీ శాతం గణనీయంగా ఉంటుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో తొలిదశ కరోనా సమయంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 19 ఏళ్ల లోపు పిల్లలు 3 శాతం ఉంటే, రెండో దశలో ఇవి 14 శాతం వరకు ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలు మూసివేసినా పిల్లలు వైరస్‌ బారిన ఎందుకు పడుతున్నారనే అంశంపై పరిశీలించారు. బయట తిరగడంతో పాటు, కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, ఎక్కువ మంది గుమికూడటం వంటివాటి వల్ల వ్యాధి సోకుతున్నట్లు నిర్ధారించారు.

పదేళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తుందని పరిశీలనలో తేలింది. జిల్లాలో కేసుల సంఖ్య వేగంగా తగ్గకపోవడానికి ఎక్కువమంది ఒకచోట చేరడం కారణంగా భావిస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల సీఎస్‌పురంలో జరిగిన తిరునాళ్లకు వెళ్లి వచ్చిన వారిలో 50 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. కొన్నిచోట్ల కర్మకాండలకు వెళ్లివచ్చిన వారిలో లక్షణాలు బయట పడ్డాయి. అయితే కరోనా సోకిన చాలా మంది పిల్లలు ఇంటి వద్దనే హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొంది కోలుకుంటున్నారని, కరోనా సోకిన వారిలో కేవలం రెండుశాతం మంది పిల్లలే ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఒంగోలు జిజిహెచ్‌ డాక్టర్లు చెబుతున్నారు.

చిన్నపిల్లల్లో కరోనా వచ్చినా వెంటనే కోలుకుంటున్నారని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఒంగోలు జిజిహెచ్‌ సర్వజన ఆసుపత్రిలో రెండురోజుల క్రితం ఇద్దరు పిల్లలు కొవిడ్‌తో చేరారు. వారిలో ఒకరికి రెండున్నర సంవత్సరాలు. 9 ఏళ్ల మరో బాలుడిలో మల్టీ డిజార్డర్‌ లక్షణాలు కనిపించాయి. వీరికి ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. రెండో దశలో ఇప్పటివరకు 12 మంది చేరారని, అందరూ కోలుకొని డిశ్ఛార్జి అయ్యారన్నారు. పిల్లల చికిత్స కోసం ప్రత్యేక విభాగం సిద్ధం చేశామని, ఒంగోలు జిజిహెచ్‌లో కరోనా సోకిన చిన్నపిల్లల కోసం 20 బెడ్లతో ప్రత్యేకవార్డు నిర్వహిస్తున్నామని 14 మంది వైద్య బృందంతో కూడి చిన్నపిల్లల డాక్టర్లు అందుబాటులో ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు.

Read also : Business dull : బిజినెస్ లేక, పెట్టుబడికి వడ్డీలు.. షాపు అద్దెలు.. వర్కర్లకు జీతాలు ఇవ్వలేక, దిక్కుతోచని స్థితిలో వస్త్ర వ్యాపారస్తులు..!