New Coronavirus Variant: దేశంలో మరో కొత్త కరోనా వేరియంట్ కలకలం.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వెలుగుచూసిన మహమ్మారి..!

కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. అన్ని రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలుపెడుతున్నాయి. ఇంకా అంతా ఓకే అనుకున్న వేళ.. మళ్లీ కొత్త వైరస్ కలకలం రేపుతోంది.

New Coronavirus Variant: దేశంలో మరో కొత్త కరోనా వేరియంట్ కలకలం.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వెలుగుచూసిన మహమ్మారి..!
Covid-19 Research

New Coronavirus Variant detected: కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. అన్ని రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలుపెడుతున్నాయి. ఇంకా అంతా ఓకే అనుకున్న వేళ.. మళ్లీ కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఇటు మహారాష్ట్రలో, అటు మధ్యప్రదేశ్ లోనూ నూతన వేరియంట్ వెలుగు చూసినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి. దీంతో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్‌తో విజృంభిస్తుందని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది.

దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్ వల్ల థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర కోవిడ్19 టాస్క్‌ఫోర్స్ , వైద్య నిపుణుల బృందం హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం సీఎం ఉద్ధవ్ థాక్రేకు నివేదిక సమర్పించారు. డెల్టా ప్లస్ వేరియెంట్‌తో థర్డ్ వేవ్ వస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో రెండు నెలల్లో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని వివరించారు. అయితే, ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే సెకండ్ వేవ్ ముగియక ముందే విజృంభించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అటు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ మహిళకు నూతన వేరియంట్ కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య నిపుణులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్నారు. మహిళకు సోకిన కొత్త వేరియంట్ నిజమేనని మధ్యప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రి విశ్వస్ సారంగ్ ధ్రువీకరించారు. ఎన్‌సిడిసి (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) నివేదికలో నూతన వేరియంట్ సంబంధించి పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త వేరియంట్ కరోనా వైరస్ సోకిన మహిళ కోవిడ్ టీకా సైతం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అయితే, వైరస్ వ్యాప్తి నియంత్రణకు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి విశ్వస్ తెలిపారు. సదరు మహిళకు చికిత్స కొనసాగుతున్నట్లు.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.


ఇదిలావుంటే, కరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని.. ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి నిపుణులు సూచించారు. ఇందులో భాగంగా సెరో సర్వే, వ్యాక్సిన్‌ పంపిణీలను వేగవంతం చేయాలని వారు సూచించారు. థర్డ్ వేవ్ గనక వస్తే లక్షల యాక్టివ్ కేసులు నమోదు అయ్యే అవకాశముందని అందులో 10శాతం వరకు పిల్లలే ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ చికిత్స అందించేలా ముందస్తు సన్నద్ధత కావాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ప్రాంతాల్లో ఔషధాలు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సీఎం ఉద్ధవ్ థాక్రే ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలో ఫస్ట్ వేవ్ సమయంలో 19 లక్షల మంది కోవిడ్ బారినపడ్డారు. సెకండ్ వేవ్‌లో రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ఏకంగా 40లక్షల మంది కోవిడ్ బారినపడ్డారు. మరణాల రేటు కూడా గణనీయంగా పెరిగింది. అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వైద్యాధికారులను అలర్ట్ చేసింది. ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్న ఆయన.. ప్రాధాన్య క్రమంలో ఉన్న వారికే టీకా వేయాలని ఆదేశించారు.

ఇక, అయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు ఇప్పటికే ప్రారంభమైంది. రెస్టారెంట్లు, దుకాణాలు తెరచుకుంటున్నాయి. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, సడలింపులు ఇచ్చారు కదా అని.. ప్రజలు ఇష్టానుసారం తిరిగితే, భారీ మూల్యం చెల్లించుకోతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also… Corona virus: కరోనా కల్లోలానికి దేశంలో అనాధలుగా మారిన 30 వేలమందికి పైగా చిన్నారులు