RAHUL GANDHI: అధ్యక్ష బాధ్యతలకు రాహుల్ మరోసారి ససేమిరా.. ప్రియాంక కూడ కాకపోతే రేసులో మరో సీనియర్?
ఆయన మరోసారి విల్లంబులందుకునేందుకు విముఖత ప్రదర్శించారు. పగ్గాలు చేపట్టడం తనకిష్టం లేదన్నారు. 2019 నాటి పరాజయం తాలూకా అవమానం ఆయన్నింకా వీడలేదు. మరిపుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేదెవరు?
RAHUL GANDHI REJECTED CONGRESS PRESIDENT POST ONCE AGAIN: రాహుల్ మరోసారి సారీ అన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ కోరిన కాంగ్రెస్ సీనియర్ల విఙ్ఞప్తిని రాహుల్ గాంధీ మరోసారి తోసిపుచ్చారు. దాంతో శతాధిక కాంగ్రెస్ పార్టీకి సారథి ఎవరన్న చర్చ మరోసారి మొదలైంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20వ తేదీ మధ్య నెల రోజుల పాటు కొనసాగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఓ పరీక్షగా మారబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ సీనియర్ల విఙ్ఞప్తితో వయోభారం వేధిస్తున్నా సోనియా గాంధీ (Sonia Gandhi)నే తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మధ్యలో జీ23 (G23) పేరిట సీనియర్లు పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగుర వేసి, పార్టీ వైఫల్యాలు, విధానపరమైన లోపాలపై లేఖ రాసిన సందర్భంలో సోనియా తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించారు. అయితే, ఆమె సొంత కోటరీ అభ్యర్థనల మేరకు ఆమె కొనసాగారు. 2014లో మొదలైన కాంగ్రెస్ పార్టీ పరాజయ పరంపర 8 ఏళ్ళు అవుతున్నా కొనసాగుతూనే వుంది. పార్టీకి పునర్వైభవం రావాలంటే రాహుల్ గాంధీనే పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్నది పార్టీలో మెజారిటీ నేతలు అభిప్రాయం. అయితే, వారి అభ్యర్థన మేరకు పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలను చేపట్టేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేరు. తాజాగా ఆగస్టు 18, 19, 20 తేదీలలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీని ఒప్పించేందుకు విఫల యత్నం చేశారు. ఆగస్టు 21 నుంచి నెల రోజుల పాటు అంటే సెప్టెంబర్ 20వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో రాహుల్ గాంధీనే పార్టీ పగ్గాలు చేపడితే అధ్యక్ష ఎన్నికల ప్రహసనం సులువుగా పూర్తి అవుతుందని పలువురు భావించారు. అయితే, సీనియర్ల విఙ్ఞప్తిని రాహుల్ తోసిపుచ్చడంతో ఇపుడు ఎన్నికల నిర్వహణ అనివార్యం కాబోతోంది. అయితే, ఈ ఎన్నిక పూర్తిగా ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతుందా ? లేక సోనియా కనుసన్నల్లో పార్టీని నడిపించే ఓ నేతకు పట్టం కడతారా అన్నది తేలాల్సి వుంది.
నిజానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరిగిన ఫిబ్రవరి, మార్చి నెలల్లో కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పీకే వ్యూహంలో భాగంగా పలు నిర్ణయాత్మక పోస్టులను క్రియేట్ చేసి, అందులో నెహ్రూ (Nehru) కుటుంబీకులతోపాటు సీనియర్లకు ప్రాధాన్యతనివ్వాలని పీకే సూచించారు. రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వధేరా (Priyanka Gandhi Vadhera)లకు పార్టీ పగ్గాలను అప్పగించాలని, పార్లమెంటరీ బోర్డు తరహాలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని, వర్కింగ్ ప్రెసిడెంటు పోస్టును కూడా క్రియేట్ చేయాలని అప్పట్లో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. ఈ మేరకు ఆయన ఓ నివేదిక రూపొందించి సోనియా గాంధీకి ఇచ్చారు. పీకే రిపోర్టుపైనా, ఆయనిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పైనా సోనియా తొలుత కాస్త సీరియస్‌గానే పరిశీలన జరుపుతున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే రాహుల్ కంటే ప్రియాంకకు పెద్దపీట వేయాలన్న ప్రతిపాదన తెరమీదికి వచ్చిందో.. అప్పుడే పీకే సిఫారసులు పక్కన పడేశారు సోనియా గాంధీ. కొడుకా ? కూతురా? అంటే కొడుకే అన్న నిర్ణయానికి సోనియా వచ్చారంటూ అప్పట్లో నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అదేసమయంలో పీకే కీలక నివేదిక ఇచ్చిన తరుణంలో రాహుల్ గాంధీ సడన్‌గా విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు. దాంతో పీకే సూచనలు ఆయనకు నచ్చలేదన్న ప్రచారం జరిగింది. ఇదంతా ఓ పక్కన కొనసాగుతున్న తరుణంలోనే పార్టీలో మరోసారి జీ23 నేతల కదలికలు మొదలయ్యాయి. గులాం నబీ ఆజాద్ (Gulam Nabi Azad), కపిల్ సిబాల్ (Kapil Sibal) వంటి నేతలు సోనియా వైఖరి పట్ల కినుక వహించారు. వీరిలో ఆజాద్ సైలెంటయిపోయారు. కపిల్ సిబాల్ మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడారు. సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party)లో చేరి.. ఆ పార్టీ తరపున పెద్దల సభలో సభ్యత్వం సంపాదించారు. కాగా ఇటీవల కశ్మీర్ స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన గులాం నబీ ఆజాద్‌కు సోనియా కట్టబెట్టగా ఆ బాధ్యతలను చేపట్టేందుకు ఆజాద్ విముఖత ప్రదర్శించారు. దాంతో జీ23 నేతల్లో ఇంకా అసంతృప్తి రగులుతూనే వుందన్న చర్చ మొదలైంది.
ఈక్రమంలోనే ఇపుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగబోతోంది. నెల రోజుల కాల వ్యవధిలో పార్టీలో అందరికీ సమ్మతమైన నేతను ఎన్నుకోవాల్సి వుంది. ఈక్రమంలో తొలి ప్రాధాన్యత సహజంగానే రాహుల్ గాంధీకి ఇస్తారు కాబట్టి కొందరు సీనియర్లు ఆయన్ని మూడు రోజుల్లో పలు దఫాలుగా కలిసి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి, పార్టీలో పునరుత్తేజం నింపాల్సిందిగా కోరారు. అయితే, అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ మరోసారి విముఖత వ్యక్తం చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈక్రమంలో తరువాతి ఆప్షన్ ప్రియాంకా వధేరాకు ఇచ్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ప్రియాంక ఇటీవల జరిగిన యుపీ ఎన్నికల్లో యధాశక్తి ప్రయత్నించినా ప్రియాంక వధేరా పెద్దగా సానుకూల ఫలితాలను సాధించలేకపోయారు. 403 మంది సభ్యులున్న యుపీ అసెంబ్లీ (UP Assembly) ఎన్నికల్లో కేవలం రెండంటే రెండు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే ప్రియాంక సారథ్యంలో ఆ పార్టీ ఎంతటి పేలవ ప్రదర్శన చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలో ప్రియాంకకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. పార్టీలో అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. మరి రాహుల్, ప్రియాంక కాకపోతే పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారు ? అప్పగించిన వ్యక్తి నెహ్రూ కుటుంబీకుల కనుసన్నల్లో కాకుండా ఇండిపెండెంట్‌గా వ్యవహరించే అవకాశం ఏమేరకు వుంటుంది ? అన్న సందేహాలు తలెత్తకమానవు. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) దారుణ హత్య తర్వాత పార్టీ పగ్గాలను చేపట్టేందుకు సోనియా ముందుకు రాని సందర్భంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి, అయిదేళ్ళు మైనారిటీ ప్రభుత్వాన్నే మహా చక్కగా నెట్టుకొచ్చి, దేశం దశ, దిశలను మార్చిన తెలంగాణ (Telangana) బిడ్డ పీవీ నరసింహారావు (PV Narsimha Rao)కు ఆ తర్వాత పార్టీలో ఎలాంటి అవమానాలు జరిగాయో చరిత్ర మరవలేదు. పీవీకి చెక్ పెట్టి తన కనుసన్నల్లో వుంటాడని పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో నియమించిన సీతారాం కేసరి (Seetaram Kesari)కి చివరికి ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలిసిందే. ఇపుడు నెహ్రూ కుటుంబేతర వ్యక్తికి బాధ్యతలు కట్టబెట్టినా ఆయనకు స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛను ఏ మేరకు ఇస్తారన్నది ప్రశ్నార్థకమే. పార్టీపై తమ కుటుంబం వారికే ఆధిపత్యం వుండాలని సోనియా చాలా బలంగా భావిస్తారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వ్యక్తి రేపు ప్రధాని పదవిపైనే కన్నేస్తే దాన్ని ఆమె కచ్చితంగా సహించరు. అంటే అధ్యక్షునిగా వుండాలి కానీ ఒకవేళ పార్టీకి ప్రధాని పదవి దక్కే పరిస్థితి వస్తే అది తన తనయునికే దక్కాలి.. ఇలాంటి అభిప్రాయం వున్న తరుణంలో ఎవరు పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైనా స్వతంత్రంగా వ్యవహరించడమన్నది కలేనన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
ఇదేసమయంలో మరో అంశం కూడా చర్చల్లో నానుతోంది. రాహుల్, ప్రియాంక కాకపోతే సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగేలా ఒప్పించాలని, ఆమెకు రోజూవారీ విధులలో సాయపడేందుకు ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలని కూడా పార్టీలో ఓ వర్గం ప్రతిపాదిస్తోంది. అయితే, వృద్ధాప్యానికితోడు.. తరచూ అనారోగ్యం పాలవుతూ, అమెరికా వెళ్ళి చికిత్స తీసుకుంటున్న సోనియా పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా కొనసాగేందుకు ఏ మేరకు సుముఖత వ్యక్తం చేస్తారన్నది ప్రశ్నార్థకమే. అయితే, పార్టీ అధ్యక్ష స్థానంలో నెహ్రూ కుటుంబీకులెవరైనా లేకపోత పార్టీలో ఐక్యత కష్టసాధ్యమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. బుల్ డోజర్‌లా దూసుకు వస్తున్న మోదీ, అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోవాలంటే, పార్టీకి పునర్వైభవం సాధించాలంటే అయితే రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీనే సారథ్యం వహించాలని పార్టీ శ్రేణుల్లో హెచ్చుశాతం భావిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల రోజులు పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తి రేపుతోంది.