MUNUGODU BY-ELECTION: మరింత వేడెక్కనున్న మునుగోడు పాలిటిక్స్.. కేసీఆర్, అమిత్ షా, రేవంత్ రెడ్డిల వరుస పర్యటనలు ఖరారు. ఇక సమరమే!
మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూలు వెలువడలేదు. అక్టోబర్ నెలలో ఈ ఉఫ ఎన్నిక జరిగే సంకేతాలున్నాయి. కానీ ఆగస్టు 20వ తేదీ నుంచే మునుగోడు పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్‌కి చేరుకోబోతున్నాయి. మూడు పార్టీలు...
MUNUGODU BY-ELECTION POLITICS HEATING UP: గత నెలరోజులుగా వార్తల్లో నానుతున్న మునుగోడు నియోజకవర్గం ఇకపై మరింతగా వేడెక్కబోతోంది. ప్రస్తుతం తెలంగాణ (Telangana) రాజకీయాలు మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్దం చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై పడింది. ఆయన ఇంకా బీజేపీ (BJP)లో చేరకపోయినా ఆయన అభ్యర్థిత్వమే ఖరారైపోయింది. ఆగస్టు 21వ తేదీన మునుగోడుకు రానున్న కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) సమక్షంలో రాజగోపాల్ కాషాయ కండువా వేసుకోబోతున్నారు. అయితే దీనికంటే ఓ రోజుల ముందే గులాబీ బాస్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (Chief Minister K Chandrashekhar Rao) మునుగోడు నియోజకవర్గంలో జరగనున్న బహిరంగసభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఓరకంగా చెప్పాలంటే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ (KCR) ఆగస్టు 20వ తేదీనే శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగేలా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే మునుగోడు ఉపఎన్నిక ఒక ఎత్తు కానుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువుంది. ముందస్తుకు వెళ్ళేది లేదని ఇటీవల కేసీఆర్ తనయుడు, మంత్రి కే.టీ.రామారావు (K T Ramarao) ప్రకటించారు. దాంతో తెలంగాణలో 2023 అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంతా భావిస్తున్నారు. కానీ మునుగోడు ఫలితం ముందస్తు ఎన్నికలా? లేక షెడ్యూలు ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలా? అన్న అంశాన్ని కూడా తేల్చే అవకాశాలున్నాయి. అందువల్లే మూడు ప్రధాన పార్టీలు తమ బలాబలాలను చాటుకోవటానికి ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. ఆగస్టు 20న మధ్యాహ్నం 2 గంటలకు చౌటుప్పల్ రోడ్డులో బహిరంగసభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు టీఆర్ఎస్ నేతలు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. గత వారం రోజులుగా ఇక్కడే మకాం వేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి (Minister Jagdish Reddy) స్వయంగా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు నేతృత్వంలో పలు బృందాలు సభ ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యాయి. సభాస్థలాన్ని సిద్ధం చేయడంతోపాటు వేదిక నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ (Hyderabad) నుంచి సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో రానుండడం కూడా చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ సభకు విస్తృత ప్రచారం కల్పిస్తూ మండలాల వారీగా ఇంఛార్జీలను నియమించారు. జనసమీకరణలో వీరంతా శ్రమిస్తున్నారు.ఈ సభకు 3 లక్షల మందిని సమీకరించేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉద్యమ కాలం నుంచే ప్రత్యేక అనుబంధం ఉన్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఫ్లోరైడ్ భూతం పట్టి విలవిల్లాడుతున్న మునుగోడు ప్రజల పక్షాన సమైక్య పాలనలో తొలిసారి గొంతెత్తి నినదించిన చరిత్ర కేసీఆర్‌దేనని చెప్పారు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించి వారి వెతలను చూసి చలించిపోయారని, వారి బాధలపై స్వయంగా పాట రాశారని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో ఫ్లోరైడ్‌ను తరిమేస్తామని ఆనాడే ప్రకటించి.. రాష్ట్రం రాగానే ఇక్కడి నుంచే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారని జగదీశ్‌రెడ్డి అన్నారు.
మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో గ్రిప్ సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ (TRS Party)కి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉప ఎన్నిక గులాబీ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ వేదిక పైనుంచే తమ పార్టీ అభ్యర్ధిని ఖరారు చేయనున్నట్టు ఇటీవలే జరిగిన రివ్యూ మీటింగ్‌లో హింట్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే తిరిగి టిక్కెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్ధి ఎవరైనా సరే.. భారీగా బలప్రదర్శన చేసి తమ సత్తా ఏంటో ప్రత్యర్ధులకు చూపించేలా ప్లాన్ చేస్తుంది టీఆర్‌ఎస్. పోటా పోటీ సభలు.. వరుస కార్యక్రమాలతో మునుగోడులో పొలిటికల్ కాక రేగుతోంది. ఆగస్టు 20న కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంటే.. ఆ మర్నాడే (ఆగస్టు 21న) అమిత్ షా ఆధ్వర్యంలో భారీ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు కార్యక్రమాలకు కేవలం 24 గంటలు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా జరగనుంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. మునుగోడులో పొలిటికల్ హీట్ షురూ అయింది. ఆగస్టు 21న సాయంత్రం 5 గంటలకు బీజేపీ సభ జరగబోతోంది. అమిత్ షా ఈ సభకు హాజరవుతున్నారు. ఈ వేదిక మీదే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారు. ఆయనతోపాటు పలువురు ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే చేరిక కమిటీ కన్వీనర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటన ఒకింత చర్చనీయాంశమైంది. బీజేపీలో చేర్చుకునేందుకు తాము ఎవరికి సంప్రదించినా వారిని టీఆర్ఎస్ నేతలు బుజ్జగిస్తున్నారని, తమ ఫోన్లను ట్యాప్ చేస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారని ఈటల రాజేందర్ అంటున్నారు. అంటే వీరి చేర్చింపు యత్నాలు అంతగా ఫలించడం లేదన్న సంకేతాలను ఆయనిచ్చినట్లు అవగతం చేసుకోవచ్చు. ఈటల కామెంట్ల నేపథ్యంలో అమిత్ షా సభా వేదికలో ఎవరెవరు బీజేపీలో చేరతారన్నది చర్చనీయాంశంగా మారింది. దుబ్బాక, హుజూరాబాద్ గెలుపుతో జోష్ మీద ఉన్న కమలం సేనలు అదే ఉత్సాహాన్ని మునుగోడులోనూ చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ పార్టీకి అంతర్గత లుకలుకలు ఇబ్బందికరంగా మారాయి. సోదరుగు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komatireddy Venkat Reddy) కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తననే స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటిస్తే పరిశీలిస్తానని వెంకటరెడ్డి ప్రకటన చేశారు. కానీ ఆయన్ని స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. ఈ క్రమంలో మునుగోడు ప్రచారంలో వెంకటరెడ్డి రోల్ ఏంటన్నది ఊహించడం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. ఓవైపు టీఆర్ఎస్ చౌటుప్పల్‌లో సభ నిర్వహిస్తున్న తరుణంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC President Revant Reddy) నియోజకవర్గాంలో పాదయాత్రకు సిద్దమయ్యారు. ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు రేవంత్ ప్లాన్ చేశారు. మునుగోడు ఉపఎన్నికను సెమీఫైనల్‌లాగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ ఎలాగైనా గెలవాలని ముూడు ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.