AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సత్యమేవ జయతే.. ఆనందయ్యది దివ్యౌషధమా? జనం అమాయకత్వమా?

మొట్టమొదటిసారి చదువుకున్న విజ్ఞులు కూడా కన్ఫ్యూజ్ అవ్వడం చూస్తున్నాను. మరీ కొందరి తీరు చదవక ముందు కాకరకాయ... చదివిన తర్వాత కీకరకాయ అన్న చందంగా ఉంది.

సత్యమేవ జయతే.. ఆనందయ్యది దివ్యౌషధమా? జనం అమాయకత్వమా?
TV9 Rajinikanth
Janardhan Veluru
| Edited By: Team Veegam|

Updated on: May 27, 2021 | 11:45 AM

Share

(వి.రజనీకాంత్, TV9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్)

మొట్టమొదటిసారి చదువుకున్న విజ్ఞులు కూడా కన్ఫ్యూజ్ అవ్వడం చూస్తున్నాను. మరీ కొందరి తీరు చదవక ముందు కాకరకాయ…చదివిన తర్వాత కీకరకాయ అన్న చందంగా ఉంది. ఆనందయ్య అసలు క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ కాదు. ఆయన ఏ ఆయుర్వేద కాలేజీ నుండి డిగ్రీ తీసుకోలేదు. దీనికి డిగ్రీలు ఎందుకని సిల్లీ రీజన్ చెప్పకండి అది ఆయుర్వేదానికే అవమానం. ఆయన పూర్వీకులు ఆయనకు నాలెడ్జ్ ఇచ్చారని కూడా అనొద్దు. అలాంటివి ఇంకా సిల్లీగా ఉంటుంది. ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ మనం కరోనాని నయం చేసే మందు కోసం చూస్తున్నామా? సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు కోసం చూస్తున్నామా? ఆనందయ్య వాడిన పదార్థాలు రోజూ నిత్యవసరాలుగా వినియోగంలో ఉన్నవే.. అలాంటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉంటాయి? మనం తేల్చాల్సిన విషయం అది కరోనాను నయం చేస్తుందా? లేదా? అన్నదే. ఏ డాక్టర్ అయినా వాళ్లు రోగికి ఇచ్చే మెడిసిన్స్ వారి అవయవాలపై ఎలా పనిచేస్తుందో చెప్పగలరు. ఆనందయ్య అయన మద్దతుదారులు ఆ వివరణ ఇవ్వకపోగా వారు తయారు చేసిన మందును నమ్మమని మాత్రమే చెబుతున్నారు. అసలు ఇందులో అర్థం కావడం లేని అంశం…కన్నులో డ్రాప్స్ వేస్తే అది ఎలా డైరెక్ట్‌గా లంగ్స్ లోకి వెళ్లి వ్యాధిని నయం చేస్తుంది? దీనిపై ఎవరి భాష్యం వాళ్ళు చెబుతున్నారు.

ప్రతి 100 కరోనా కేసుల్లో 90 శాతం కరోనా బాధితులు నార్మల్గా చాలా సింపుల్ మెడిసిన్స్ తో హోం .క్వారంటైన్‌లోనే కోలుకుంటున్నారు. హాస్పిటల్‌లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి 10 శాతం కేసులకు మాత్రమే ఉన్నాయి. ఇందులో రెండు శాతం మందికి ఐసియు అవసరం పడుతుంది. వారిలో 1.5% చనిపోతున్నారు. అంటే కరోనా సోకినట్లు త్వరగా డిటెక్ట్ చేయకపోయినా? త్వరగా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా? రోగి ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశముంది. అయితే ముందుగా ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెట్ చేసిన వారు కూడా ఆనందయ్య మందు తీసుకుంటే క్షణాల్లో లేచి నిల్చుంటారని కొన్ని వీడియోల ఆధారంగా సోషల్ మీడియాలో జరుగుతున్న అతి ప్రచారాన్ని సమర్థించగలమా?

హెల్త్ కేర్ బలహీనతలకు నాటు వైద్యం పరిష్కారమా?

ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి? త్వరగా వ్యాధిని డిటెక్ట్ చేయకపోవడం, ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోవడం. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ప్రభుత్వాలు ఈ కరోనా క్రైసిస్ నుండి మనల్ని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నాలు సరిపోలేదు. ప్రభుత్వాలను హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్మెంట్ పెంచమని, మెడిసిన్స్ సప్లై సరిగ్గా ఉండేలా చూడాలని అడగాల్సిన అవసరం ఉంది. దేశంలో చాలా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్నో వెంటిలేటర్లు 2020లో డెలివరీ చేయబడిన దగ్గర నుండి ఇప్పటివరకు ఓపెన్ చేయకుండా మిగిలిపోయాయి. వాటికి కారణాలు..వెంటిలేటర్ కి అవసరమైన టెక్నికల్ ఆపరేటర్ లేకపోవడం, వెంటిలేటర్ ఎలా ఉపయోగించాలో మ్యానువల్ లేకపోవడం. యూసర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ తర్వాత స్టోర్స్ కి తీసుకు వెళ్ళలేకపోవడం. ఇందులో చాలా వెంటిలేటర్లు ఇప్పుడు పనిచేయట్లేదు. కరోనా డిటెక్ట్ చేసే ప్రక్రియలో వెనకబడటం, ట్రీట్మెంట్ త్వరగా స్టార్ట్ చేయకపోవడం, వెంటిలేటర్లు పనిచేయకపోవడం, సరైన మలికవసతులు లేకపోవడం, సరైన మందులు అందుబాటులో లేకపోవడం కరోనా మరణాలకు ముఖ్య కారణాలు. ఆనందయ్య నాటు వైద్యం దీనికి పరిష్కారం అవుతుందా?

Anandaiah Nattuvaidyam

Anandaiah Nattuvaidyam

గుడ్డిగా నమ్మితే నష్టం తథ్యం..

ఇప్పుడు ఆయుర్వేదంను మోడర్న్ సైన్స్ తో కన్ఫ్యూజ్ చేస్తూ రేపు ఇంకెవరో వచ్చి గుండెపోటు కూడా నయం అవుతుందని చెపుతారు. ఆయుర్వేద మందులతో మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని దీర్ఘకాలంలో పెంపొందించుకునే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో ఎక్కడ కూడా మూడు రోజులు తీసుకుంటే వ్యాధి నయమైపోతుందని రాయలేదు. సింగిల్ డోస్‌తో మీకు ఫలానా వ్యాధి నయం అవుతుందని, పడకపై అపస్మారక స్థితిలో ఉన్న రోగి లేచి కూర్చుంటాడని ఆయుర్వేదంలో అయితే ఎక్కడా లేదు. ఇది కేవలం మన మూర్ఖత్వం, ఆతృత, గుడ్డిగా నమ్మే అమాయకత్వం మాత్రమే.  ప్రస్తుతం సాధారణ మందులతో  ఇంట్లో ఉండే 90 శాతం మంది ఎవరైతే కరోనా నుంచి కోలుకుంటున్నారో? అలాగే ఆనందయ్య మందు తీసుకున్న వారు కూడా…వారివారి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వల్లే కోలుకుంటున్నారు. ఆనందయ్య నాటు మందులపై నమ్మకంతో ట్రీట్మెంట్ ఆలస్యం జరిగితే వ్యాధి ముదిరి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆనందయ్య నాటు మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు  కానీ…కరోనా మహమ్మారిని జయించలేమని గుర్తుపెట్టుకోవాలి. ఆనందయ్యది దివ్య ఔషధమని కొన్ని భజన బ్యాచ్‌లు అదే పనిగా ఊదరగొడుతున్నాయి. ఈ నాటు మందు మాయలో పడి అమాయకులు కొవిడ్ వ్యాక్సిన్ అవసరమంలేదని భావించొచ్చు. అప్పుడు జరిగే నష్టాన్ని మనం ఊహించుకోగలమా?

నాటు వైద్యానికి ప్రోత్సాహం కరెక్టేనా?

దశాబ్ధ క్రితం వరకూ పచ్చకామెర్లకు చేతికి వాతలు పెట్టుకునేవారు..ఇప్పటికీ మనలో చాలామందికి చేతి మీద వాతలు కనిపిస్తాయి. అలాగే గతంలో పచ్చకామెర్లకు ఆకుపసరు కూడా ఇచ్చేవారు. ఇలాంటి నాటు వైద్యాలు ఊరికొకటి ఉన్నాయి. పాము ఎవరినైనా కాటువేస్తే దాని విషం కారణంగా కాకుండా భయంతో చనిపోయే వాళ్లే ఎక్కువ మంది. పసరు వైద్యంతో ఇక తమకు ఏమీకాదన్న  ధైర్యంతో చాలా మంది కోలుకుంటారు తప్ప…ఆ పసరు మందు కారణం కాదని గుర్తించాలి.  కానీ ఇప్పుడు ఆ నాటు వైద్యాలపై ప్రజలకు నమ్మకం పోయింది. ఆనందయ్య పుణ్యమాని మళ్లీ అందరు నాటు మందు నమ్మేయటం మొదలు పెడుతున్నారు. నాటు వైద్యాన్ని చేయటం వదిలేసిన వాళ్ళు ఇప్పుడు ఊరూరు లేచి కూర్చున్నారు. ఆనందయ్య మందును గుడ్డిగా నమ్మే వాళ్ళు మరి ఈ నాటు మందులన్నిటిని కూడా నమ్ముతారా? ఆలా అయితే మనం ప్రభుత్వ ఆసుపత్రుల కోసం కంటే నాటు మందు దుకాణాలు కోసం డిమాండ్ చేయాలి. ఆలా చేద్దామా? ఒకసారి ఆలోచించండి.

Krishnapatnam Naatu vaidhyam

Krishnapatnam Naatu vaidhyam

కృష్ణపట్నం పసరు మందు బాధితుల  గోడు వినరా?

ఎప్పుడైతే పరిస్థితిలు చేజారిపోతుందో ప్రజల అటెన్షన్ పొందడానికి మిరాకిల్ మెడికల్స్ పేరుతో కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. చదువుకున్న వాళ్ళం మనం వీరిని సపోర్ట్ చేద్దామా? ఒక బాధ్యతాయుతమైన పౌరులకు అలాంటి వాళ్ళని తప్పు చేయకుండా ఆపాల్సిన బాధ్యత లేదా? నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న కృష్ణపట్నం పసరు మందు బాధితుల గోడు వినటానికి, వారి దుస్థితిని చూడటానికి ఎవరికీ కళ్ళు రావటం లేదు. ఆధునిక యుగంలో మనం ఇంతగా కళ్ళున్న కభోదులుగా మారిపోయామా? ఇంతగా మనలో ఆవహించిన అజ్ఞానం ఏంటి?

సంవత్సరన్నర కాలంలో కరోనాతో చావు బతుకుల మధ్య కూర్చుని, నలిగిపోయి, ఒత్తిడికి గురైన ప్రజలకు ఆనందయ్య భరోసా గుడ్డిగా నమ్మేలా చేసింది. రేయింబవళ్లు రీసెర్స్ చేసి వ్యాక్సిన్ తెచ్చినా ఎఫికసీ 80 శాతం, 90 శాతం అని చెబుతున్నారు. దాన్ని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెబుతున్నారు.. ఎందుకంటే సైన్సు కాబట్టి. అదే ఆనందయ్య వైద్యంలో ఎలాంటి రీసెర్చ్ లేదు. అందుకే ఈ మందు సామర్థ్యం, సైడ్ ఎఫెక్ట్స్ పై ఎలాంటి వివరాలు లేవు. అదే సైన్స్ కు, మూఢ నమ్మకానికి ఉన్న తేడా. సైన్స్ ఎప్పటికీ ఎంతో కొంత చిన్న బెనిఫిట్ ఆప్ డౌట్ పెట్టుకుంటుంది. అదే నాటు వైద్యం వంద శాతం కరెక్ట్ అని గుడ్డిగా నమ్ముతారు.

అసలు ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? అసలు ఆనందయ్య ఏదైనా ఆయుర్వేద కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారా? ఆనందయ్య ఇస్తున్న మందు ఆయుర్వేదం కాదు. ఆయుర్వేదం అని కన్ఫ్యూజ్ చేయకండి ఆయన కేవలం చెట్ల మూలికలు వాడినంత మాత్రాన ఆయుర్వేదం కాదు.. ఎప్పటికీ ఆయుర్వేదం కాదు. చివరగా ఆనందయ్య మందుని సపోర్ట్ చేస్తున్న వాళ్లకు ఒకటే సూటి ప్రశ్న. మీకు కరోనా వచ్చి ప్రాణం మీదకు వస్తే దగ్గరలో ఉన్న అల్లోపతి ఆసుపత్రికి వెళతారా? ఆనందయ్య మందు తిన్నాం కదా.. అని ధైర్యంగా కూర్చుంటారా? మీ గుండెపై చెయ్యి వేసుకొని నిజంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

(వి.రజనీకాంత్, TV9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్)

Read Also:

ఫ్రీగా ఇస్తే మంచి మందై పోతుందా..? అనుమతి లేని నాటు వైద్యం కరెక్టేనా?

కోవిడ్‌ బాధితులకు శుభవార్త.. నేడే 2-DG డ్రగ్ సెకండ్ బ్యాచ్ విడుదల.. డ్రగ్ పనితీరుపై భారీ అంచనాలు

తెలంగాణలో జూలై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు.! పరీక్షా సమయం కుదింపు.