NTR : నిండైన వ్యక్తిత్వం.. నిలువెత్తు తెలుగుతనం.. తిరుగులేని కథానాయకుడు ఎన్టీఆర్
దేదీప్యమాన తెలుగు తేజం. స్ఫురద్రూపం. జగన్మోహన రూపం. కంచుకంఠం. అయిదు దశాబ్దాల సంచలనం... ఆరు కాలాల ప్రాభవం. ఎనిమిది కోట్లమంది అభిమానించే నవరస నటనా వైదుష్యం....
నిండైన వ్యక్తిత్వం. నిలువెత్తు తెలుగుతనం. దేదీప్యమాన తెలుగు తేజం. స్ఫురద్రూపం. జగన్మోహన రూపం. కంచుకంఠం. అయిదు దశాబ్దాల సంచలనం… ఆరు కాలాల ప్రాభవం. ఎనిమిది కోట్లమంది అభిమానించే నవరస నటనా వైదుష్యం… దశదిశలా పాకిన వైభవం. ఆయనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. తెలుగు ప్రేక్షకుల బంగారు కలలకు వెండితెరపై ప్రతిరూపమాయన! మూడు తరాల ప్రేక్షకులను తన అసమాన అభినయంతో సమ్మోహనపర్చిన కారణజన్ముడాయన! ఆయన మూర్తీభవించిన మంచితనం…చరిత్రలో మిగిలిన యుగపురుషుడు. యుగానికొక్కడు. ఒకే ఒక్కడు.
అవును…ఎన్టీయార్ ఒక్కడే! పాతాళభైరవి సినిమాలో ఇతిహాసం విన్నారా అనే పాటను పింగళి నాగేంద్రరావు ఏ సుమూహుర్తాన రాశాడో… కెవిరెడ్డి ఏ శుభవేళ చిత్రీకరించారో తెలియదు కానీ…అందులో ఉన్నట్టుగానే ఎన్టీఆర్ యుగానికి ఒక్క కథనాయకుడిగా వెలిగారు. జగన్ మంగళం సాధించారు. సినిమాలో తోటరాముడిలాగే ఎన్టీఆర్ నిజంగానే ధైర్యవంతుడు. తిరుగులేని కథానాయకుడు. జగదేకవీరుడు. ఎదురులేని మనిషి. సినీ ఉజ్జయినినేలిన విక్రమార్కుడు. కదిలే బొమ్మలతో కోట్లాది మంది హృదయాలను జయించిన అభినవ శాలివాహనుడు.
ఎన్టీయార్.. అక్షరాలు మూడే. కానీ వాటికున్న పవర్ మాత్రం అనంతం. అద్భుతం. అపూర్వం. ఆ ఘనత తెచ్చింది నందమూరి తారక రామారావు..ఎన్టీయార్ వంటి వ్యక్తి అంతకు ముందు ఉద్భవించలేదు. భవిష్యత్తులో ఉద్భవిస్తాడన్న నమ్మకమూ లేదు. ఎన్టీయార్ సాహసి. ఏటికి ఎదురీదే మనస్తత్వం. పాతాళభైరవిలోని తోటరాముడిలో ఏ గుణగణాలున్నాయో ఎన్టీయార్‌లోనూ అన్ని వున్నాయి. అమాయకత్వం… స్నిగ్ధ సౌందర్యం… నిజాయితీ.. నిబద్ధత…నిర్భీతి… పట్టుదల..అంకితభావం…ఇవన్నీ ఆయన సొంతమయ్యాయి. ఇతిహాసాన్ని సృష్టించేవాడే కథానాయకుడు. చరిత్రలో తనకంటూ కొన్ని పుటలను ఏర్పరచుకునేవాడే ధీరోదాత్తుడు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వాడే మహిమాన్వితుడు. ఏటికి ఎదురీది విజయం సాధించేవాడే సాహసవంతుడు. ఈ లక్షణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్న ఏకైక నటుడు ఎన్టీయార్ మాత్రమే!
ఆయన ధరించని పాత్రలేదు. పోషించని రసం లేదు. సాంఘిక చిత్రాల్లో ఆయన అభినయం అనితర సాధ్యం. ఇక చారిత్రక…జానపదాలైతే ఆయనకు కొట్టిన పిండి. పౌరాణికాలా.. చెప్పేదేముంది. పురాణ పురుషుల పాత్ర పోషణలో ఆయనకు మించినవారు లేరు.. ఏడేడు లోకాల్లో వెతికినా కనిపించడు. అందుకే ఆయన విశ్వ విఖ్యాత నటుడయ్యాడు.
సాంఘికాలు. జానపదాలు. పౌరాణికాలు. చారిత్రాత్మకతలు. కాకమ్మ కథలు. కాలక్షేపం కథలు అన్నీ చేశారు ఎన్టీయార్. ఆయన ఏనాడూ పాత్రలను ఎంపిక చేసుకుని మరీ నటించలేదు. నచ్చిన పాత్రలన్నీ వేశాడు. నచ్చకపోయినా దగ్గరవాళ్లకోసం చేశాడు. అందుకే ఎవరికీ లేని. ఎవరికీ రాని. ఎవరు చేయలేని వైరుధ్యమైన పాత్రలు రామారావు దగ్గరకి నడుచుకుంటూ వచ్చాయి.
ఎన్టీయార్ పాత్రలను ఏనాడూ సెలక్ట్ చేసుకోలేదు. అలాగని పాత్రల పట్ల స్పృహ లేదని కాదు..ఆ మాటకొస్తే ఆయనకు మంచి పాత్రలు వేయాలన్న తపన ఎక్కువే. లేకపోతే తోడుదొంగలు ఎందుకు చేస్తాడు? ఆ సినిమా అప్పుడు ఎన్టీయార్ వయసు 30 ఏళ్లు.. అందులో వేసిన పాత్రేమో ఆరవై ఏళ్ల ముసలివాడి పాత్ర. భార్యగా హేమలత…కొడుకుగా చలం వేశారు. ఓ పక్క అగ్గిరాముడు వంటి సినిమా చేస్తూ ఓల్డ్ ఏజ్ పాత్ర వేయడానికి ఎంత దమ్ముండాలి. ఇమేజ్ పోతుందన్న దిగులు కొంచెం కూడా లేదు. అంతెందుకు కన్యాశుల్కంలో గిరీశం పాత్ర వేస్తే ఏమవుతుందోనని అక్కినేని భయపడ్డాడు. ఎన్టీయారేమో మొహమాటం లేకుండా ఓకే అన్నాడు. అలాగే చింతామణిలో బిల్వమంగళుడి పాత్ర కూడా అంతే.
రామారావులో ఇంకో గొప్ప విషయం వుంది… దర్శకుడి ఆదేశాలను శిరసావహించడం! రాజూ పేద సినిమాలో ఆయన వేసిన పాత్ర ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మోస్ట్ అన్‌గ్లామరైజ్డ్ పాత్ర. చింకి గుడ్డలతో, అస్తమానం తాగుతూ..దొంగతనాలు చేస్తూ.. పెళ్లాం పిల్లల్ని కొడుతూ వుండే పాత్ర. చాలా దరిద్రంగా వుంటుంది. హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాక కూడా ఇలాంటి పాత్ర వేయడానికి కొండంత ధైర్యం వుండాలి. అది రామారావులో పుష్కలంగా వుంది. అన్నట్లు దాసిలో వేసిన పాత్ర కూడా అన్ గ్లామరైజ్‌డే! భీష్మ సినిమాలో చాలా సేపు వృద్ధుడిగానే కనిపిస్తాడు. కలసి వుంటే కలదుసుఖంలో అవిడి వాడిగా. చిరంజీవులులో గుడ్డివాడిగా. నర్తనశాలలో బృహన్నలగా…ఇవి మరొకరు ఒప్పుకోగలరా? మరొకరు చేయగలరా?
రాయలవంటి రాజూ లేడు.. అప్పాజీ వంటి మంత్రీ లేడు అన్నట్టుగా ఎన్టీయార్ వంటి నటుడుండడు. తెలుగు చిత్ర రంగాన్ని నిలబెట్టి శాసించిన వ్యక్తి ఆయన! నటనలో నడకలో మాటలో ఆటలో ఆయన్ను మించిన వారు లేరు. ఆయన తిరుగులేని అదృష్టజాతకడు. నాయకుడు-ప్రతి నాయకుడు.. రెండు విరుద్ధమైన పాత్రలను వేసి మెప్పించడం ఒక్క రామారావుకే చెల్లింది. రాముడు-రావణుడు, కృష్ణుడు-సుయోధనుడు, కీచకుడు ఆయనే పాత్ర వేసినా తెలుగు ప్రజలు గుండెకు హత్తుకుని ఆదరించారు. సీతారామకళ్యాణంలో రావణుడి పాత్రకు గ్లామర్ తెచ్చిన రామారావే… పాండవీయంలో దుర్యోధనుడి పాత్రకూ తెచ్చారు. అదీ ఆయన జన సమ్మోహనశక్తి. పాత్రలో జీవించడమనేది రామారావుకు సరిగ్గా అతుకుతుంది. పెళ్లి చేసి చూడు, వద్దండే డబ్బు, మిస్సమ్మ, గుండమ్మకథ, రాముడు-భీముడు, తిక్క శంకరయ్య, యమగోల ఇత్యాది సినిమాల్లో కామెడితో కడుపుబ్బా నవ్వించిన ఎన్టీయారే…చిరంజీవులు.. రక్తసంబంధం.. ఆత్మ బంధువు.. ఇంటికి దీపం ఇల్లాలే వంటి చిత్రాల్లో కంటతడి పెట్టించాడు.
కోడలు దిద్దిన కాపురం ఆయన రెండువందలో సినిమా. పైగా సొంత చిత్రం.. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తన పాత్రపరంగా పేరు పెట్టుకుంటారు. కానీ రామారావు మాత్రం కోడలు దిద్దిన కాపురం అని సావిత్రి పరంగా పెట్టాడు. అప్పుడాయన టాప్‌లో వున్నాడు. దటీజ్ ఎన్టీయార్. చిరంజీవులులో ఆయనది అంధుడి పాత్ర. కాంటాక్ట్ లెన్స్ లేని రోజుల్లో పాత్ర కోసం కళ్లకు ఏవో తెచ్చి పెట్టారు. పాత్రలో విపరీతంగా తాదాత్మ్యం చెందే ఎన్టీయార్ బ్రేక్‌లో కూడా వాటిని తీసేయలేదు. దాంతో కళ్లు పోయే పరిస్థితి కూడా వచ్చింది. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత అలాంటిది. ఆయన మాస్ హీరోగా టాప్ పోజిషన్లో వున్న రోజుల్లోనే బడిపంతులులో ధైర్యంగా ముసలి పాత్ర వేశారు. మరుసటి ఏడాది ధనమా దైవమా చేశాడు. ఇందులోనూ మధ్య వయస్కుడి పాత్ర.
సాత్విక వేషాలంటే రామరావుకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే వివాహబంధం, డాక్టర్ ఆనంద్, సంగీత లక్ష్మి, నిర్దోషి, స్త్రీ జన్మ వంటి సినిమాలు చేశాడు. ప్రేక్షకులు వాటిని పెద్దగా ఆదరించలేదు. అలాగని ఎన్టీయార్ అలాంటి రోల్స్ వేయడం మానలేదు. డ్రైవర్ రాముడు వంటి ఫక్త్ కమర్షియల్ సినిమా కాలంలోనే మా వారిమంచితనం అనే కుటుంబకథా చిత్రంలో చేశాడు. ఎన్టీఆర్ సాహసి కాకపోతే సామాజికాంశం ప్రధానంగా తోడుదొంగలు సినిమా ఎందుకు తీస్తాడు? ఎందుకు చేతులు కాల్చుకుంటాడు? ఆ సినిమా రాష్ర్టపతి నుంచి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్‌ను సంపాదించి పెట్టిందంతే! అప్పటికీ ఊరుకున్నాడా? పిచ్చి పుల్లయ్య తీశాడు. మరింత నష్టపోయాడు. ఈ రెండు సినిమాలు సినిమా పట్ల రామారావుకున్న స్పష్టమైన అభిరుచిని చెబుతాయి.
అభ్యుదయ చిత్రాలకు అడుగుజాడ కచ్చితంగా రామారావుదే! సాహసి కాకపోతే…పల్లెటూరి పిల్ల సినిమాలో కోడే దూడతో నిజంగానే ఎందుకు పోట్లాడతాడు? డూప్‌ను పెడతామని దర్శకుడు ఎంత చెప్పినా ఎన్టీఆర్ వింటేగా.. ? ఎద్దేమో బలిష్టమైన ఆస్ట్రేలియా గిత్త.. ఎన్టీయార్‌ను ఎత్తి పడేసింది. దెబ్బకి కుడిచేతి మణికట్టు విరిగింది. పుత్తూరుకెళ్లి వైద్యం చేయించుకున్నాడు. ఇదేం తొలి రోజుల మోజు కాదు.. చివరి వరకు అలాగే వున్నాడు. గులేబకావళికథలో కత్తులతో యుద్ధం చేస్తున్నప్పుడు చేయంతా గీరుకుపోయిందట! శ్రీ కృష్ణావతారం సినిమాలో రాయబారం సన్నివేశంలో తొడమీద ఫ్లూట్‌తో కొట్టుకుంటూ పద్యం పాడాడు. అదేం చెక్క ఫ్లూటు కాదు.. స్టీలుది. కొద్దిపాటి టేకుల తర్వాత సీన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే ఏముంది…తొడ మీద ఎర్రగా రక్తం గడ్డకట్టి వున్న ఫ్లూట్ గీతలు. నటనలో అంత మమేకమవుతాడయాన.
దాదాపు మూడు వందల చిత్రాలు. అంతకు రెండింతల పాత్రలు. ఏ పాత్ర అయినా ఆయనకు నప్పేది! ఆయనకే నప్పేది! ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్ర పోషణలో ఈ భూమండలంలో ఆయనను మించిన వారు లేరు.. కృష్ణుడంటే ముందుగా స్ఫురించేది ఎన్టీయారే! ఆయనకు ముందు ….తర్వాత ఎందరో నటులు ఆ పాత్రను ధరించినా ఎన్టీయార్‌కు సరిసాటి కాలేకపోయారు.. దాదాపు 14 చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడి పాత్రను అభినయించారు.. ఒకే నటుడు ఒకే పాత్రను ఇన్ని చిత్రాల్లో నటించిన ఖ్యాతిని సొంతంచేసుకున్నారు.
రికార్డులకు నాంది వాక్యం పలికింది ఎన్టీయారే! కొన్నిటికి భరత వాక్యం పలికింది ఆయనే! ఆయన నెలకొల్పిన రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు..అడవిరాముడు సినిమా సూపర్‌డూపర్ హిట్ అయ్యింది.. అయితే ఆ సినిమాతోనే ఎన్టీఆర్‌లోని నటుడు కూడా పక్కకు తప్పుకున్నారేమో అనిపిస్తుంది.. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫక్తు కమర్షియల్ సినిమాలే.. యమగోల, డ్రైవర్‌రాముడు, వేటగారు, ఆటగాడు. బొబ్బిలిపులి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి ఇలాంటివన్నీ..విచిత్రమేమిటంటే ఈ సమయంలో ఎన్టీఆర్ తీసిన పౌరాణికాలేమో ఆడకపోవడం.. ఇలాంటి సినిమాలేమో హిట్టవ్వడం. నిజానికి యంగ్ జనరేషన్‌కు ఎన్టీఆర్ దగ్గరయ్యింది ఈ సినిమాలతోనే.. రామారావు గురించి చెప్పుకుంటూ పోతే అదో ఉద్గ్రంథమవుతుంది. నటుడిగా ఆయన వేయని పాత్ర లేదు.. అన్నీ వేశారు. శిఖరాగ్రన ఉన్నప్పుడే సినిమాల్లోంచి తప్పుకున్నాడు. ఎన్టీఆర్ సినిమాల్లోంచి తప్పుకునే సమయంలో దక్షిణాదిన హైయస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆయనే!