Anandaiah Natu Mandu: ఫ్రీగా ఇస్తే మంచి మందై పోతుందా..? అనుమతి లేని నాటు వైద్యం కరెక్టేనా?
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఫ్రీగా వైద్యం చేస్తున్నారు. లాభాపేక్ష లేదు. అనువంశికంగా సాంప్రదాయ వైద్యాన్ని ప్రజలకు ఇస్తూ వస్తున్నారు. సడన్‌గా కరోనాకు విరుగుడుగా ఆ మందు ప్రచారమైంది.
(వి. రజినీకాంత్, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఫ్రీగా వైద్యం చేస్తున్నారు. లాభాపేక్ష లేదు. అనువంశికంగా సాంప్రదాయ వైద్యాన్ని ప్రజలకు ఇస్తూ వస్తున్నారు. సడన్‌గా కరోనాకు విరుగుడుగా ఆ మందు ప్రచారమైంది. దానికి సంబంధించి వీడియోలు కూడా బాగా సర్కులేట్ అయ్యాయి. డిఎంహెచ్ఓ కథనం ప్రకారం కృష్ణపట్నం, దాని పొరుగు ప్రాంతాల వారికి కరోనా పాజిటివ్ కేసులు అతి తక్కువగా నమోదయ్యాయి. ఒక వైద్యాన్ని నమ్మడానికి, మందును తీసుకోవడానికి, ఆ మందును జబ్బుకు వాడాటానికి ప్రామాణికం ఇదేనా?.. కానే కాదు.
భారతదేశంలో సాంప్రదాయ వైద్యమైనా? ఆధునిక వైద్యమైనా? ప్రజా బాహుళ్యం వాడేందుకు కొన్ని అనుమతులు తప్పనిసరి. సాంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హోమియో వంటి వైద్యాలున్నాయి. సిద్ధ వైద్యం గురించి మన దగ్గర పెద్దగా వినియోగం లేనప్పటికీ మిగతా సాంప్రదాయ వైద్యాలు నడుస్తున్నాయి. భారత ప్రభుత్వ ఆయుష్ విభాగానికి లోబడి ఈ నాలుగు వైద్యాలు, వాటికి సంబంధించిన అనుమతులు తీసుకుని ప్రజలకు వినియోగానికి రావాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా లేనిది ఏదైనా నేరుగా వైద్యం అనడానికి వీలు లేదు. మందు అనటానికి అంతకంటే వీలులేదు. ఒకవేళ అనాలనిపిస్తే ఆయుష్ పరిధిలోని నిబంధనలు తప్పనిసరిగా పాటించి పర్మిషన్స్ తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే దాన్ని మెడిసిన్స్ గా పరిగణిస్తారు. అనందయ్య చేస్తున్న నాటు వైద్యానికి కూడా ఆయుష్ అనుమతి వస్తే ఎలాంటి అభ్యంతరం ఉండదు. భారతదేశ పౌరులకు చట్టాలు, నిబంధలకు లోబడి మాత్రమే ఈ వైద్యాన్ని అందించాలి. తరాలుగా అనువంశికంగా ఇస్తున్నదైనా…సరైన శాస్త్రీయ పరిశీనలత తర్వాత అనుమతులు ఉంటేనే జనబాహుళ్యనికి అందించాలి.
ఆరోగ్య చరిత్ర…..
500 ఏళ్ల కిందట వరకు మానవ శరీర నిర్మాణం ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. మృతదేహాలను కోసి చూశాకనే అనాటమీ మనకు అర్ధమైంది. దాని తర్వాత మానవ శరీరంపై అనేక పరిశోధనలు జరిగాయి. అప్పుడే జీర్ణక్రియ, శ్వాసక్రియ, మెదడు, గుండె ఎలా పనిచేస్తాయో వంటివి ( Physiology) తెలిశాయి. రోగాలొచ్చినప్పుడు మానవ దేహంలో ఏం మార్పులు వస్తాయో మరింత రీసెర్స్ జరిగింది(Pathology). 160 ఏళ్ల కిందటే గాలిలో సూక్ష్మ జీవులు ఉన్నాయని తెలిసింది. వాటి ద్వారా వచ్చే జబ్బులు, రాకుండా ఏం చేయాలో.. వస్తే ఏం చేయాలో తెలిసింది ఆ తర్వాతేనే (Microbiology). అప్పుడు కరోనా పాజిటివ్ కేసులు లాంటివి ఏవి లేవు, దాని గురించి ఎవరికీ తెలియదు.
పెన్సిలిన్ వచ్చిందప్పుడే..
వందేళ్ళ కిందట వరకూ యాంటీబయాటిక్స్ అనే మందులు లేవు. మొట్ట మొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్‌ను 1942లో ఉపయోగించారు. ఇప్పుడు మనం వాడే మందులన్నీ ఆ తర్వాత కనిపెట్టినవే (Pharmacology). యూరప్ లో ‘గేలన్’ (130 – 205 AD) అనే వైద్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ఆధారంగా 1500 ఏళ్ల పాటు వైద్యం జరిగింది. ‘వెసాలియస్’ దేహ నిర్మాణాన్ని (Anatomy), ‘విలియం హార్వే’ దేహ ధర్మాల్ని (Physiology) శాస్త్రీయంగా అధ్యయనం చేసే వరకూ గేలన్ సిద్ధాంతం ప్రకారమే వైద్యం అందింది. ఆధునిక వైద్య విధానం ఆ తర్వాతే డెవలప్ అయింది. వివిధ జబ్బుల కారణాలు, శరీరం పై వాటి ప్రభావం, ఉపశమనం ఇవ్వగల మందులు, ఆపరేషన్‌లు అందుబాటులోకి వచ్చాయి.
ఆయుష్ పెరిగింది…
మానవుడి జీవిత కాలం 100 నుంచి 110 ఏళ్లు. ఐతే 100 ఏళ్ల కిందట వరకు సగటు ఆయుర్దాయం 30-40 సంవత్సరాల మధ్యనే ఉండేది. ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాలలో సగటు ఆయుర్దాయం 80 ఏళ్లు పైమాటే. భారతదేశంలో 60 సంవత్సరాలకు పైగానే ఆయుర్ధాయం ఉంది. ఆరోగ్య సూచికలన్నింటిలో ఇంత అభివృద్ధికి కారణం ఎంతో మంది సైంటిస్టుల శాస్త్రీయ పరిశోధనల కృషేనే.
మన వైద్యం..
భారతదేశంలో వైద్యం రెండు రకాలు. ఒకటి సాంప్రదాయ వైద్యం. రెండు అల్లోపతి. నాటు వైద్యానికి ఆయుష్ పర్మిషన్స్ లేదు. దాన్ని విశ్వసించడం లేదు. ఏ వైద్యమైనా ముందుగా డిఆర్డీవో (భారత రక్షణ పరిశోధన సంస్థ) అనుమతి తీసుకోవాలి. అ తర్వాత దానికి సంబంధించి ప్రీ ట్రయల్స్ ఉంటాయి. అవి కొన్ని నెలలు, సంవత్సరాలు పడతాయి. అంతా బాగుందనుకుంటేనే (ఐసీఎంఆర్ ) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ అనుమతులు ఇస్తుంది. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1949 నుంచి ఐసీఎంఆర్ నడుస్తోంది. బయో మెడికల్ రీసెర్చ్‌కు సంబంధించి ఐసీఎంఆర్ చాలా పరిశోధనలు చేస్తోంది. వెస్ట్రన్ స్డడీస్ ఆధునికతతో కూడిన అప్రోచ్ ఒకవైపు నడుస్తుంటే…మరోవైపు భారత్ ఆధునిక వైద్యంతో పాటు సాంప్రదాయ వైద్యాన్ని పాటిస్తోంది.
శాస్త్రీయత వద్దా…?
ఆనందయ్య మందు ప్రీగా ఇస్తున్నాడంటే నమ్మేద్దామా? ప్రీగా ఇస్తే అది వైద్యం అవుతుందా? అజ్ఞానంతో కూడిన నమ్మకాన్ని విశ్వసిద్దామా? శాస్త్రీయతతో కూడిన అనుమతులతో కూడిన వైద్యాన్ని నమ్ముదామా? అనే చర్చ జరుగుతోంది. సంప్రదాయ వైద్యాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. సంప్రదాయ వైద్యాలైన ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియో, ఎలక్ట్రో హోమియోను ప్రోత్సహిస్తోంది. వాటికి కేంద్ర ఆయుష్ అనుమతి తప్పనిసరి. అసలు నాటు వైద్యాన్ని ఆయుష్ అనుమతించదు. సాంప్రదాయాన్ని నమ్మే ఆయుష్ అనుమతించని దాన్ని మనం గుడ్డిగా నమ్మి ఎలా ముందుకెళతాం. ఇందుకు వాళ్లు చెప్పే కారణం ఏంటి? వాళ్లు ప్రీగా ఇస్తున్నారు. తగ్గిందనే ప్రచారంతో కూడిన నమ్మకం. ఈ క్రైటీరియాతో మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటామా..బాగు చేసుకుంటామా..ఇదే క్రైటీరియా తీసుకుంటే ఇక రీసెర్స్ ఎందుకు? క్లినికల్ ట్రైయిల్స్ ఎందుకు? ఇంత శాస్త్రీయ విజ్ఞానం ఎందుకు? ఇవన్నీ అవసరం లేదు కదా. దేశంలో వంద మందినో లేక వేల మంది నాటు వైద్యులను పెట్టుకుంటే సరిపోతుందనేది విమర్శకుల మాట. అందుకే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన వ్యవహరించ వద్దనే వాదన ఉంది. గుడ్డిగా నాటు మందును నమ్మడమంటే ఇంటి దీపమని ముద్దుపెట్టుకుని మీసాలు కాల్చుకోవడమే అవుతుంది.
ఫ్రీగా వైద్యం అందిస్తే మంచి మందు అనే నమ్మకం సరైంది కాదు. కొందరు నమ్మితే అది వైద్యం కిందకు రాదు. ఆ వైద్యానికి శాస్త్రీయత ఉండాలి. ఎంతో రీసెర్చ్ జరగాలి. ఇందుకు భారత్‌లో ఆయుష్ అనుమతులు ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి శాస్త్రీయత, చట్టబద్దత ఉంటోంది. అలాంటి వాటిని మాత్రమే మనం మందుల కింద కన్సిడర్ చేస్తాం. ప్రపంచ వ్యాప్తంగా అల్లోపతిలో చాలా పెద్ద రీసెర్స్ జరిగింది. మానవ శరీరానికి సంబంధించి అణువు అణువు శోధించి రోగాలకు సంబంధించిన మందులు కనిపెడుతున్నారు. ఇందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు కావాల్సిందే. అనుమతులు లేనివి మందులు కావు.
రీసెర్చ్ లేకుండా వాడదామా…?
దున్నపోతు ఈనింది అంటే గాటిన కట్టేయమన్నట్లు ఉంది కొందరి వ్యవహారం. అగ్నికి ఆజ్యం పోసినట్లు పసరు వైద్యాన్ని భుజాన వేసుకుని సోషల్ మీడియాలో ఆనందయ్య వార్తను వైరల్ చేస్తున్నారు. కరోనా వచ్చిన భయం.. ఆందోళనలో, నిరాశలో ఉన్న రోగులకు ఈ వైద్యం ఒక ఆసరాగా కనిపించింది. ఆ మందు పనితీరు గురించి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, రోగులు ఇచ్చిన ఇంటర్వ్యూలు చాలా వరకు ఆసక్తిగా ఉన్నాయి. కానీ కరోనా వైద్యానికి ఈ మందు పనిచేస్తుంది అని చెప్పడానికి ఇవి సహేతుకమైన ఆధారాలు లేవు. మందు కంటిలో వేయగానే ఆక్సిజన్ పెరిగిందని చెబితే సరిపోదు. ఆ రోగిని మరి కొద్ది రోజులు పరిశీలించాలి. ఆ పెరిగిన ఆక్సిజన్ లెవల్ అలాగే ఉంటుందా? మళ్ళీ పడిపోతుందా? అనేది నిర్ధారించుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవా? కళ్లకు ఇబ్బంది ఏమైనా ఉందా లేదా తదితర అంశాలు అనేకం ఉన్నాయి. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలో ఈ మందులను పరిశీలించిన ఆయుర్వేద వైద్య నిపుణులు వీటిపై అభ్యంతరం వ్యక్తం చేసారని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి వాస్తవాలు తెలుసుకునే వరకు వేచి ఉండాల్సిన అవసరముంది. నిజం నిలకడమీద తేలుతుంది. అప్పటి వరకు పసరు వైద్యం జోలికి వెళ్లక పోవడమే మంచిది.
బత్తిన సోదరుల ‘చేప ప్రసాదం’ విషయంలోనూ ఇదే రకమైన చర్చ జరిగింది. ఇది శాస్త్రీయంగా నిర్థారణ కాకపోవడంతో సరైన అనుమతులు దక్కలేదు. ప్రజల్లో నమ్మకం కారణంగా ‘ప్రసాదం’గా ప్రజలకు పంపిణీ చేసేందుకు మాత్రమే ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. అజ్ఞానంతో కూడిన నమ్మకాన్ని మనం విశ్వసించ లేము. శాస్త్రీయ పరిశోధనలు లేని మందులను పంపిణీ చేయడమంటే ముమ్మాటికీ ప్రజారోగ్యంతో చలగాటం ఆడటమే. శాస్త్రీయ ఆధారాలు, అనుమతులు తప్పనిసరి. విజ్ఞులు, చదువుకున్న వారు గుడ్డిగా వైద్యాన్ని నమ్మేకన్నా..కాస్త ఆలస్యమైనా రీసెర్స్ తర్వాత వచ్చే అనుమతుల కోసం సహనంతో వేచి ఉండక తప్పదు.
అల్లోపతి మాఫియా…
అల్లోపతి కరోనాకు సరైనా పరిష్కారం చూపలేదు. నిజమే. అందుకే ప్రజలు దిక్కులు చూస్తున్నారు. ప్లాస్మా ధెరపీ మంచిదని చెప్పారు వైద్యులు. కారణం ఏదైనా ఆ తర్వాత కాదన్నారు. హైడ్రో క్లోరోఫిల్, యాంఫీస్పైర్ మందులు వాడమన్నారు. ఆ తర్వాత పక్కన పెట్టమన్నారు. రెండెసివిర్ విషయంలోనూ ఊగిసలాట నడుస్తోంది. కరోనా చికిత్సలో వాడిన మెడిసిన్స్ ఆపేసినప్పటికీ అనుమతి ఉన్న మందులే కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు అల్లోపతి పేరుతో మాఫియా నడుస్తోంది. ఫార్మా, కార్పోరేట్ సంస్థలు, మరికొన్ని శక్తులు కలిసి పని చేస్తున్నాయి. దాన్ని మనం సమర్థించ లేము. దాన్ని అడ్డుకునేందుకు మన వంతు ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ రోగం వస్తే వెంటనే మనం అల్లోపతి వైద్యం జోలికే పోతాం. అది మనం గుర్తించాలి. రీసెర్స్ చేసి నిర్థారించిన మందులే మనం వేసుకుంటాం. అలాంటి వాటిని కాదని మిగతా దాన్ని నమ్మడం గుడ్డెద్దు చేలో పడ్డట్టే. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లే అనేది నిజం.
ఆనందయ్య నాటు మందు విషయంలో కొందరు అధికార, విపక్ష నేతల వైఖరి భిన్నంగా ఉండటం ఊహించగలిగినదే. కందకు లేని దురద కత్తి పీటకెందుకని ఎవరైనా ప్రశ్నిస్తే నా జవాబు..శాస్త్రీయత, సహేతుకత, జవాబుదారీతనంపై ప్రశ్నించడం టీవీ9 నైజం. మెరుగైన సమాజమే టీవీ9 లక్ష్యం.