RS Praveen Kumar : సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు లైన్ క్లియర్.. విధుల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణను ప్రభుత్వం ఆమోదించి, విధుల నుంచి రిలీవ్ చేసింది. ప్రవీణ్ కుమార్ స్థానంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల..
IPS RS Praveen Kumar : సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణను ప్రభుత్వం ఆమోదించి, విధుల నుంచి రిలీవ్ చేసింది. ప్రవీణ్ కుమార్ స్థానంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శిగా రొనాల్డ్ రోస్ (ఐపీఎస్)ను నియమించింది. తాజా నియామకానికి సంబంధించి ప్రవీణ్ కుమార్.. రొనాల్డ్ రోస్ కు శుభాకాంక్షలు చెప్పారు.
ఇదిలాఉంటే, ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ వచ్చేసింది. దీనికి సంబంధించి జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది. హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ కుండబద్దలు కొట్టారు RS ప్రవీణ్‌కుమార్. రాజకీయాల్లోకి రాకపై త్వరలోనే స్పష్టతనిస్తానన్నారు. బలహీన వర్గాల కోసం కొత్త మార్గంలోకి వెళ్లేందుకే పదవికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. హుజూరాబాద్ ఎన్నికలకు ఇంకా టైముందన్న RS.. సోషల్ మీడియా పోస్టుల్ని నమ్మొద్దని కోరారు. తాను ఎవరికీ అమ్ముడుపోనని.. కుట్రల్ని తిప్పికొడతామన్నారు.
ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. స్థానికంగా ఉన్న కొమురంభీం, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్చంద పదవి విరమణ కోరిన ప్రవీణ్ కుమార్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ పరిదిలోని దంతన్‌పల్లికి వచ్చారు. నాగోబా ఆలయం నుండి ఉట్నూర్ బయలుదేరిన ప్రవీణ్ కుమార్ ఉట్నూర్ రాయ్ సెంటర్ లో కొమురంభీం, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఆకస్మిక జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రవీణ్ కుమార్‌ను కలిసేందుకు రాష్ట్ర నలుమూలల నుండి స్వైరో కార్యకర్తలు ఉట్నూర్ కు భారీగా తరలి వచ్చారు. వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత తొలి పర్యటన కావడం.. తన మనసుకు ఇష్టమైన, నచ్చిన పనులను చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో ప్రవీణ్ కుమార్ ఆదిలాబాద్ పర్యటన మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. పదవీ విరమణ తర్వాత శేష జీవితాన్ని జ్యోతిరావు పూలే దంపతులు, బీఆర్ అంబేద్కర్, కాన్షీరామ్ చూపిన మార్గంలో నడుస్తానని ప్రకటించిన ప్రవీణ్ కుమార్.. ఆదిలాబాద్ నుండే తన కొత్త మార్గంలోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రావడం ఆలస్యం అయినాకాని, రావడం మాత్రం పక్కా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పేదలకు, పీడితులకు అండగా ఉంటానని.. భావి తరాలను ఓ కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని ప్రవీణ్ కుమార్ ఇప్పటికే తేల్చి చెప్పారు.
Read also : YS Sharmila: ఖమ్మం జిల్లా పెనుబల్లిలో నిరుద్యోగ నిరసన దీక్షలో వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్