Covid-19: కరోనా ముప్పు అప్పుడే పోలేదు.. దేశంలో మూడింట రెండొంతుల మందికి యాంటీబాడీస్.. ఐసీఎంఆర్‌ సెరో సర్వేలో ఆసక్తికర విషయాలు

దేశంలోని 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో జూన్‌-జులై నెలల్లో నిర్వహించిన ఐసీఎంఆర్ నాలుగో సీరో సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 80 కోట్ల మందిలో కరోనా యాంటిబాడీలు ఉత్పత్తి..

Covid-19: కరోనా ముప్పు అప్పుడే పోలేదు.. దేశంలో మూడింట రెండొంతుల మందికి యాంటీబాడీస్.. ఐసీఎంఆర్‌ సెరో సర్వేలో ఆసక్తికర విషయాలు
Indians Have Covid Antibodies
Follow us

|

Updated on: Jul 21, 2021 | 8:34 AM

Indians have Covid antibodies: దేశంలో ఇప్పటివరకు ఆరేళ్ల కంటే ఎక్కువ వయసు మూడింట రెండొంతుల మంది కోవిడ్‌కు గురైనట్లు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. దేశంలోని 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో జూన్‌-జులై నెలల్లో నిర్వహించిన నాలుగో సీరో సర్వేను అనుసరించి ఈ విషయం వెల్లడిస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 80 కోట్ల మందిలో కరోనా యాంటిబాడీలు ఉత్పత్తి అయినట్టు ఐసీఎంఆర్‌ ఆయన వెల్లడించారు. ఇంకా 40 కోట్ల మందికి వైరస్‌ ముప్పు పొంచి ఉన్నట్టు పేర్కొన్నారు. యాంటీబాడీలు ఉన్న అందరికి వైరస్‌ సోకి ఉండవచ్చని లేదా టీకా వల్ల యాంటిబాడీలు ఉత్పత్తి అయి ఉండవచ్చన్నారు.

ఇక, ముఖ్యంగా 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లల్లో సగం కంటే ఎక్కువ మందిలో కరోనా యాంటిబాడీలను గుర్తించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. జూన్‌-జూలై మధ్యలో 21 రాష్ర్టాల్లోని 70 జిల్లాల్లో 28,975 మంది సాధారణ పౌరులు, పిల్లలు, 7,252 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లపై ఈ సర్వే నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. ఇందులో పాల్గొన్న పెద్దల్లో 12,607 మంది (62.2%) ఎలాంటి టీకా తీసుకోలేదని, 5,038 మంది (24.8%) ఒక డోసు, 2,631 మంది (13%) రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా 67.6% మందిలో యాంటీబాడీలు కనిపించినట్లు పేర్కొన్నారు. 6-9 ఏళ్ల వయస్సులో 57.2%మందిలో, 10-17 ఏళ్ల వయస్సులో 61.6%, 18-44 వయస్సులో 66.7%, 45-6 ఏళ్ల వయస్సులో 77.6%, 60 ఏళ్ల పైబడిన వారిలో76.7% మందిలో యాంటీబాడీలు ఉన్నాయన్నారు. పురుషుల్లో 65.8% మందిలో సీరో పాజిటివిటీ రేటు కనిపించగా మహిళల్లో 69.2% మందిలో కనిపించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 66.7%, పట్టణ ప్రాంతాల్లో 69.6% మందిలో యాంటీబాడీలను గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటివరకు టీకా తీసుకోని వారిలో 62.3% మందిలో, ఒక డోసు తీసుకున్నవారిలో 81% మందిలో, రెండు డోసులు తీసుకున్నవారిలో 89.%మందిలో యాంటీబాడీలు ఉన్నాయని బలరాం భార్గవ వివరించారు. వైద్య ఆరోగ్య సిబ్బందిలో 85.2%మందిలో సీరో పాజిటివిటీ కనిపించిందని చెప్పారు.

అయితే, పిల్లల్లో కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్‌ నిర్వహించిన మొట్టమొదటి సర్వే ఇదే కావడం గమనార్హం. గతంలో నిర్వహించిన మూడు సెరో సర్వేలనూ ఈ ప్రాంతాల్లోనే చేశారు. ‘ఆరేండ్ల వయసు దాటిన 67.6% మందిలో కరోనా యాంటిబాడీలు ఉన్నాయి. హెల్త్‌కేర్‌ వర్కర్లలో 85శాతం మందిలో యాంటిబాడీలు ఉత్పత్తి అయ్యాయి’ అని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. హెల్త్‌కేర్‌ వర్కర్లలో పదోవంతు మంది ఇంకా టీకా వేసుకోలేదని చెప్పారు. గ్రామాలు/పట్టణాలు, పురుషులు/స్త్రీలు, పిల్లలు/పెద్దలు అన్న తేడా లేకుండా వైరస్‌ వ్యాప్తి అందరిలో దాదాపు ఒకే విధంగా ఉందని చెప్పారు. ఇంకా 40 కోట్ల మందికి వైరస్‌ ముప్పు పొంచి ఉన్నదని చెప్పారు. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఇప్పటి వరకు మూడింట రెండొంతుల మంది కోవిడ్‌కు గురైనట్లు తెలుస్తోందని, ఇంకా 40 కోట్ల మందిలో యాంటీబాడీలు కనిపించనందున వారందరూ వైరస్‌ బారిన పడేందుకు అవకాశం ఉందన్నారు. యాంటీబాడీలు తక్కువ ఉన్న ప్రాంతాల్లో కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం కనిపించిన సీరో పాజిటివిటీ రేటు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని స్పష్టంచేశారు.

మరోవైపు, కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో ఎవరూ చనిపోలేదని, ఆక్సిజన్‌ కొరతతో రోగులు చనిపోయినట్టు ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు నివేదిక ఇవ్వలేదని కేంద్రప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ ఈ మేరకు సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అయితే ఆక్సిజన్‌కు ఇంతముందు ఎన్నడూ లేనంత డిమాండ్‌ ఏర్పడిందని చెప్పారు. మొదటి వేవ్‌లో రోజుకు 3,905 టన్నుల డిమాండ్‌ ఉండగా సెకండ్‌ వేవ్‌లో 9వేల టన్నులకు పెరిగిందని తెలిపారు. మంత్రి సభను తప్పుదోవ పట్టించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడతానన్నారు.

ఇదిలావుంటే, చిన్నపిల్లలకు వైరస్‌ను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుందని, అందువల్ల దేశంలో ప్రాథమిక పాఠశాలలను తొలుత ప్రారంభించుకోవచ్చని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ చెప్పారు. ఊపిరితిత్తుల్లో ఎక్కడైతే వైరస్‌ అతుక్కుంటుందో అక్కడ పిల్లల్లో ఏస్‌రిసెప్టర్స్‌ తక్కువ ఉంటాయని, దానివల్ల వారిలో ఇన్‌ఫెక్షన్‌ తక్కువగా ఉంటుందన్నారు. 6-9 ఏళ్ల మధ్య పిల్లల్లో 57% యాంటీబాడీలు ఉన్నట్లు సీరో సర్వేలో వెల్లడైన విషయాన్ని ప్రస్తావించారు. స్కాండినేవియన్‌ దేశాల్లో కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలు అసలు మూతపడలేదని చెప్పారు. అందువల్ల తొలుత ప్రాథమిక పాఠశాలలను తెరచుకోవచ్చని సూచించారు. ఆ తర్వాత మాధ్యమిక పాఠశాలలు తెరవాలన్నారు. పాఠశాలలు తెరవడానికి ముందే డ్రైవర్లు, టీచర్లు, ఇతర సిబ్బంది అందరికీ టీకాలు ఇవ్వాలని స్పష్టంచేశారు. జిల్లా, రాష్ట్రస్థాయిలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు తెరచే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బలరాం భార్గవ చెప్పారు. Read Also…  Covid Vaccine: కరోనాపై పోరులో కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి చిన్నారులకు రక్షణ కవచాలుః మంత్రి జితేంద్ర సింగ్