కొత్త కూటమి దిశగా వేగంగా అడుగులు.. రోడ్ మ్యాప్ రూపకల్పనపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు.. రెండు సమావేశాలు కీలకం
జాతీయస్థాయిలో విపక్షాల ఐక్య కూటమి కూర్పు విషయంలో మెల్లిగా క్లారిటీ వస్తోంది. బీజేపీకి ధీటుగా బలమైన విపక్ష కూటమి రూపకల్పనలో త్వరలో జరగనున్న రెండు సమావేశాలు కీలకం కానున్నాయి...
జాతీయస్థాయిలో విపక్షాల ఐక్య కూటమి కూర్పు విషయంలో మెల్లిగా క్లారిటీ వస్తోంది. బీజేపీకి ధీటుగా బలమైన విపక్ష కూటమి రూపకల్పనలో త్వరలో జరగనున్న రెండు సమావేశాలు కీలకం కానున్నాయి. ఇందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో జరగనుండగా.. ఇంకోటి బీహార్ సీఎం, జేడీయు అధినేత నితీశ్ కుమార్ సారథ్యంలో జరగబోతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ జాతీయస్థాయిలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నింటినీ ఒక గొడుగు కిందికి తీసుకువచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ అధిష్టానం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏ ఏ పార్టీని కలుపుకుని పోవాలని దానిపై ఒక రోడ్ మ్యాప్ తయారైనట్లు తెలుస్తోంది. మే 21, 22 తేదీలలో కాంగ్రెస్ అగ్రనేతలు.. వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో సమాలోచనలు జరిపారు. దీనికి కొనసాగింపుగా మే 27 తేదీన ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా భేటీ కావాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి బిజెపియేతర సీఎంలందరినీ ఆహ్వానిస్తున్నారు. అయితే బిజెపిని గట్టిగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపుతుందా లేదా అన్నది ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం.
కెసిఆర్‌ను ఈ సమావేశానికి పిలవక పోవచ్చునని తెలుస్తోంది. ఎందుకంటే, వచ్చే ఆరు నెలల కాలంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కేసీఆర్ పార్టీని ఢీకొనబోతోంది. అప్పటి దాకా కేసీఆర్‌ని కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగానే భావించాలన్న వ్యూహంతో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ వ్యూహం మారవచ్చు. ఇదంతా ఇప్పుడే విశ్లేషించుకోవడం తొందరపాటు అవుతుంది కాబట్టి ఆ అంశాన్ని పక్కన పెడితే, జాతీయస్థాయిలో విపక్ష కూటమి దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఏ ఏ పార్టీలు దగ్గరవుతాయి అన్నది ఇప్పుడు చర్చించుకోవచ్చు. మే 22న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలోగా ప్రతిపక్షాల ఐక్యత సాధించే దిశగా ఒక రోడ్డు మ్యాప్ రూపొందించాలని ఈ భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ భేటీలో మల్లికార్జున్ ఖర్గేతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. బిజెపిని గద్దె దింపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనే నితీష్, రాహుల్, మల్లికార్జున్ ఖర్గేల భేటీ జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరిని కలిసే ముందే నితీష్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ప్రతిపక్షాల నేతలతో బీహార్ రాజధాని పట్నాలో కీలక భేటీకి నితీష్ కుమార్ రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి తేదీలు ఒకటి, రెండు రోజుల్లో ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పరిపాలన వ్యవహారాలపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాద నడుస్తోంది. ఈ వివాదంలో అరవింద్ కేజ్రీవాల్‌కు నితీష్ కుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
నిజానికి జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటికి తీసుకురావడం ద్వారా బిజెపిని గద్దె దింపే ప్రయత్నాలను నితీష్ కుమార్ రెండు, మూడు నెలల క్రితమే ప్రారంభించారు. అయితే ఆయన ప్రయత్నాలు ఇప్పటివరకు ఒక నిర్మాణాత్మకమైన రూపాన్ని పొందలేదు. నితీష్ కుమార్ ఈ ప్రయత్నంలో ఉండగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో నితీష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొత్త ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నితీష్ ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు సిద్ధమయ్యింది. కాంగ్రెస్ నేతలతో నితీష్ జరిపిన భేటీలో కాంగ్రెస్ సారధ్యంలో ఏర్పడబోయే కూటమిలో కలిసేందుకు ఏఏ పార్టీల నేతలు సిద్ధమవుతారనే అంశంపై ప్రాథమికంగా చర్చించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో పనిచేసేందుకు ఆసక్తి చూపని మమతా బెనర్జీ లాంటివారు కూడా ఇప్పుడు కాస్త తగ్గారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తామని ఆమె కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఇతర పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ వదిలేసుకోవాల్సి ఉంటుందని దీదీ ముందుగానే కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు ఇష్టపడని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్‌లను దారిలోకి తీసుకురావడంలో నితీష్ కుమార్ కొంతమేరకు విజయం సాధించినట్లు కనిపిస్తోంది. ఈ ముగ్గురిలో ఒక్క కేజ్రీవాల్ తప్ప మిగిలిన ఇద్దరూ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఎందుకు ఆల్రెడీ ఓకే చెప్పారు. విపక్షాల కూటమి కూర్పులో పట్నా భేటీ కీలకం. ఈ భేటీని పట్నాలో నిర్వహించాలని మమతా బెనర్జీనే సూచించడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీ సీట్లలో కేవలం 200 స్థానాలలో మాత్రమే బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందని మిగిలిన 343 సీట్లలో బిజెపితో తలపడేది ఇతర పార్టీలేనని మమతా బెనర్జీ విశ్లేషిస్తున్నారు. ఈ 343 సీట్లలో కాంగ్రెస్ పార్టీ బిజెపిని గట్టిగా ఢీ కొనగలిగే రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆమె ప్రతిపాదిస్తున్నారు ఇలా జరిగితే కాంగ్రెస్ సారధ్యంలోని కూటమిలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, అదే సమయంలో బిజెపిని కోలుకో లేకుండా దెబ్బ కొట్టడం సాధ్యమవుతుందని మమతా బెనర్జీ భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మాను మమతా బెనర్జీ విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది.
మే 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న పార్టీలకు చెందిన ముఖ్యమంత్రుల భేటీకి ముగ్గురు ముఖ్యమంత్రుల హాజరు అంశం ఆసక్తి రేకెతిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఈ ముగ్గురు బిజెపి, కాంగ్రెస్‌లకు సమాన దూరాన్ని పాటిస్తున్నారు. నవీన్ పట్నాయక్‌ని దారిలోకి తెచ్చుకునేందుకు నితీష్ కుమార్ ఇదివరకే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ను సీఎంల భేటీకి కాంగ్రెస్ నేతలు ఆహ్వానించకపోవచ్చు. వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ పట్టుదలగానే ఉంది. దశాబ్దం క్రితం సోనియా గాంధీతో విభేదించి పార్టీ నుంచి వెళ్లిపోయి, సొంత పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు సంవత్సరాల కాలంలో బిజెపిని పెద్దగా విమర్శించలేదు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూ తటస్థ వైఖరి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆహ్వానించినా ఫలితం ఉండకపోవచ్చు. మొత్తం మీద కర్ణాటక ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ అధిష్టానం ఒకవైపు.. బిజెపిని గట్టిగా వ్యతిరేకిస్తున్న నితీష్ కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి నేతలు ఇంకొక వైపు జాతీయ స్థాయిలో బలమైన విపక్ష కూటమిని రూపొందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ప్రయత్నాలలో మే 27వ తేదీన జరగనున్న బిజెపి ఇతర ముఖ్యమంత్రుల భేటీ, పట్నా వేదికగా జరగనున్న బిజెపి వ్యతిరేక పార్టీ నేతల సమావేశం అత్యంత కీలకం కానున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..