AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Parliament Building: పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవం.. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అస్త్రం.. వ్యూహం అదుర్స్

దీనిపై మొదలైన రాజకీయ రచ్చ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. మే 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్షపార్టీలు జాయింట్ స్టేట్‌మెంటు విడుదల చేశాయి.

New Parliament Building: పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవం.. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అస్త్రం.. వ్యూహం అదుర్స్
Rahul Gandhi- PM Modi
Rajesh Sharma
|

Updated on: May 24, 2023 | 8:36 PM

Share

పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ రాజుకుంది. శాసనాలు రూపొందించే సెంటర్‌ని రాజ్యాంగ అధిపతిగా భావించే రాష్ట్రపతి ప్రారంభించాలని బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీలు పట్టుబడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గనక కొత్త భవనం సెంట్రల్ విస్టాను ప్రారంభిస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాలని 19 విపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశాయి. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి తమ వైఖరి ఇదమిత్తంగా వెల్లడించనప్పటికీ.. ఆ పార్టీ కూడా కొత్త పార్లమెంటు భవన ప్రారంభానికి దూరంగా వుండే అవకాశాలే మెండుగా వున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చే వందేళ్ళకు సరిపడా మౌలిక సదుపాయాలతో మూడేళ్ళ వ్యవధిలో సెంట్రల్ విస్టా నిర్మాణం జరిగింది. 2026లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం వున్న నేపథ్యంలో పెరగనున్న ఎంపీల సంఖ్యకు అనుగుణంగా కొత్త లోక్‌సభ, రాజ్యసభలను డిజైన్ చేశారు. దీనిని మే 28న ప్రారంభించనున్నారు. పార్లమెంటు కొత్త భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దాంతో దీనిపై మొదలైన రాజకీయ రచ్చ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. మే 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్షపార్టీలు జాయింట్ స్టేట్‌మెంటు విడుదల చేశాయి.

విపక్షాల అభ్యంతరం ఇదే

పార్లమెంట్ కొత్త భవనం సెంట్రల్ విస్టాను రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, ఈ ధోరణి రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందికే వస్తుందని విపక్షాలంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీతోపాటు డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్‌ (మణి), విడుతలై చిరుతైగల్ కచ్చి, ఆర్‌ఎల్‌డీ, టీఎంసీ, జేడీ(యూ), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఐయూఎంఎల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆర్‌ఎస్‌పీ, ఎండీఎంకే మొదలైన పార్టీలు పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన పార్టీల జాబితాలో వున్నాయి. బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్నపార్టీల్లో బీఆర్ఎస్ వంట పార్టీలు ఇంకా ఓ నిర్ణయాన్ని తీసుకోలేదు. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనాలా.. వద్దా అనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. దీనిపై మే 25న తుది నిర్ణయాన్ని తీసుకుంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మీడియాకు తెలిపారు. ఇక హైదరాబాదీ పార్టీ ఎంఐఎం మాత్రం కొత్త అంశాన్ని తెరమీదికి తెస్తోంది. పార్లమెంటు ప్రాంగణమంతా స్పీకర్ ఆధీనంలో వుంటుంది కాబట్టి, కొత్త భవనాన్ని స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తే తాను పాల్గొంటానంటున్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అయితే పార్లమెంటు అంటే కేవలం లోక్‌సభ కాదు.. రాజ్యసభ కూడా వుంటుంది. దానికి ఛైర్మెన్‌గా ఉప రాష్ట్రపతి జగదీశ్ ధన్‌ఖడ్ వున్నారు. ఈ విషయాన్ని అసదుద్దీన్ విస్మరించడం విశేషం.

ఇందిర, రాజీవ్ చేయలేదా?

విపక్షాల వాదన ఇలా వుంటే.. ప్రభుత్వం మాత్రం తమ చర్యను గట్టిగానే సమర్థించుకుంటోంది. ఇందుకు గతంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు అనుసరించిన విధానాలను బీజేపీ నేతలు ఉటంకిస్తున్నారు. జాతీయ స్ఫూర్తి, దేశ పురోగతిపై గర్వించడమనేది కాంగ్రెస్‌ పార్టీకి కొరవడిందని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి విమర్శించారు. పార్లమెంటు అనుబంధ భవనాన్ని 1975 అక్టోబరు 24న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఆమె తనయుడు రాజీవ్‌గాంధీ కూడా ప్రధానిగా 1987 ఆగస్టు 15న పార్లమెంటు గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారని పూరీ అంటున్నారు. అప్పట్లో ప్రభుత్వాధినేతలు చేయగా లేనిది ఇప్పుడు చేస్తే తప్పేమిటని పూరీ కాంగ్రెస్ పార్టీ సహా ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్న విపక్షాల నేతలను ప్రశ్నించారు. పునరాలోచన చేయాలని ఆయన విపక్షాలను కోరారు. మొత్తమ్మీద కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం బీజేపీని మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీని వ్యతిరేకించే పార్టలను ఒక్కతాటి మీదికి తెస్తోంది. ఓవైపు విపక్షాలను ఒక కూటమి కిందికి తేవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ అంశం కలిసి వచ్చింది.