AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriages: పెళ్ళిళ్ళూ..శుభాకార్యాలూ..అన్నీ ‘కరోనా’ర్పణం! ముహూర్తాల సీజన్ ను ముంచేసిన కోవిడ్ రెండో వేవ్!

సరిగ్గా సంవత్సరం క్రితం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడూ అదే విధంగా ఉంది. కరోనా మహమ్మారి అప్పటిలానే ఇప్పుడూ విస్తరిస్తూనే ఉంది. అప్పటికీ ఇప్పటికీ మూడు తేడాలు.

Marriages: పెళ్ళిళ్ళూ..శుభాకార్యాలూ..అన్నీ 'కరోనా'ర్పణం! ముహూర్తాల సీజన్ ను ముంచేసిన కోవిడ్ రెండో వేవ్!
Marriage
KVD Varma
|

Updated on: May 04, 2021 | 1:52 PM

Share

Marriages: సరిగ్గా సంవత్సరం క్రితం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడూ అదే విధంగా ఉంది. కరోనా మహమ్మారి అప్పటిలానే ఇప్పుడూ విస్తరిస్తూనే ఉంది. అప్పటికీ ఇప్పటికీ మూడు తేడాలు.. ఒకటి అప్పుడు మనకు కరోనా గురించి ఏమీ తెలీదు. రెండు ఇప్పుడు వ్యాక్సిన్ భరోసా ఉంది.. మూడు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించలేదు. కానీ, వ్యాక్సిన్ అందరికీ అందలేదు. కరోనా రెండో వేవ్ ముంచేస్తోంది. కేంద్రం లాక్ డౌన్ విధించాకపోయినా రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా కరోనా కఠిన నిబంధనలు అమలు అవుతున్నాయి. ఇక మూఢం వెళ్ళిపోయింది. ముహూర్తాల సమయం వచ్చేసింది. దీంతో మళ్ళీ అప్పటిలానే పెళ్ళిళ్ళు ఎలా? అనే ప్రశ్న మొదలైంది. పెళ్లి కళతో తమ ఇల్లు వెలిగిపోతుందని అనుకున్న వారికి ఆశాభంగమే మిగిలింది. మే, జూన్ నెలల్లో వేల సంఖ్యలో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఈసారి కూడా ముహూర్తాలకు పెళ్లి బాజాలు మొగించాలని చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇక వివాహాలే కాకుండా.. అనేక శుభాకార్యాలకూ ఇదే సీజన్. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ మళ్ళీ వాయిదా పడాల్సిందేనా అని అందరూ ఆందోళన చెందుతున్నారు.

ఏప్రిల్‌ 30తో మూఢం పోయింది. ఇక మే 4 నుంచి జూలై 12 వరకూ ముహూర్తాల సీజన్. ఈ నెల 13, 26, 29, జూలై నెలలో 4వ తేదీ బలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఇవి కాకుండా ఈ రెండు నెలల్లోనూ మరిన్ని మంచి రోజులు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకుని పెళ్ళిళ్ళు..ఇతర శుభకార్యాల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసుకున్న వారు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. కొందరు పెళ్ళిళ్ళ కోసం కళ్యాణ మండపాలకు అడ్వాన్సులు కూడా ఇచ్చేసుకున్నారు. మే నెలలో ముహూర్తాలు కుదిరిన వాళ్ళు బట్టల దగ్గరనుంచి బంగారం వరకూ అన్నీ సమకూర్చుకుని.. కొందరు శుభలేఖలు కూడా ఇప్పటికే బంధువులకు పంపించి శుభకార్యాలకు సిద్ధం అయిపోయారు. ఈ నేపధ్యంలో అందరూ ఇప్పుడు తలలు పట్టుకున్నారు. అంతా బావుంది అనుకున్న తరుణంలో మళ్ళీ కరోనా తమతో ఆడుకుంటోందని వాపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉపనయనాలు కేవలం ఉత్తరాయణంలోనే జరుపుతారు. ఇప్పడు ముహూర్తాలు దాటిపోతే మళ్ళీ వచ్చే ఏడాది వరకూ అవకాశం ఉండదు. దీంతో ఉపనయన ముహూర్తాలు పెట్టుకున్న వాళ్ళు పెద్ద ఇబ్బందినే ఎదుర్కుంటున్నారు.

ఇది ఇలా ఉంటే, ఈ సీజన్ మీద ఆధారపడి చాలా మంది జీవిస్తుంటారు. కళ్యాణ మండపాల నుంచి.. కేటరింగ్ దాకా.. లైటింగ్ నుంచి సప్లై కంపెనీల వరకూ అలాగే ఫోటోగ్రాఫర్లు, పురోహితులు అందరూ ఈ మంచి రోజులలోనే నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు. ఇప్పుడు ఈ కరోనా దెబ్బతో వారి ఉపాధికి మళ్ళీ ఉసురు పోయిందని వాపోతున్నారు అందరూ.

Also Read: Indian Corona Updates: దేశంలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 3,57,229 కేసులు నమోదు.. 3,449 మంది మృతి..

కరోనా క‌ల్లోలం.. పాలకుర్తి ఆలయంలోకి భక్తులకు నిరాకరణ.. ఎప్ప‌టివ‌ర‌కు అంటే..