కరోనా కల్లోలం.. పాలకుర్తి ఆలయంలోకి భక్తులకు నిరాకరణ.. ఎప్పటివరకు అంటే..
కరోనా ఎఫెక్ట్ మనుషుల మీదే కాదు.. దేవాలయాల మీదా పడింది. కరోనా మహమ్మారితో ఓ వైపు జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా..
కరోనా ఎఫెక్ట్ మనుషుల మీదే కాదు.. దేవాలయాల మీదా పడింది. కరోనా మహమ్మారితో ఓ వైపు జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. మరోవైపు దేవాలయాలు మూతపడుతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరింహస్వామి ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. మే 4 నుంచి భక్తులకు స్వామివారి ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం. వీరస్వామి తెలిపారు. పాలకుర్తి మండల వ్యాప్తంగా కరోనావైరస్ విస్తరిస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ఆలయంలో స్వామివారికి అభిషేకం, అర్చనలు, వాహన పూజలు, కేశఖండనలు, ఆలయంలో గదుల అద్దె తదితర ఆర్జిత సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు. మే 04 నుంచి 16 వరకు 13 రోజుల పాటు ఆలయంలో భక్తులకు అనుమతి నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు.
పాలకుర్తి మండల పరిధిలో కోవిడ్ తీవ్రంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయంలో నిత్య కార్యక్రమాలు, పూజలు అర్చకులు అంతరంగికంగా మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు. భక్తులను ఎవరిని స్వామివారి దర్శనానికి అనుమతించడం జరగదని ఈవో తెలిపారు.