Lock down inevitable: దేశవ్యాప్త లాక్‌డౌన్ అనివార్యమా? కేసుల్లో స్వల్ప తగ్గుదలతో వెనక్కి తగ్గిన కేంద్రం?
దేశం మరోసారి లాక్ డౌన్ దిశగా మళ్ళుతోందా? కరోనా సెకెండ్ వేవ్ ఉధృతంగా మారిన నేపథ్యంలో అనివార్యంగా లాక్ డౌన్ దిశగా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు కోర్టులు కూడా...
Lock down inevitable in the country: దేశం మరోసారి లాక్ డౌన్ (LOCK DOWN) దిశగా మళ్ళుతోందా? కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) ఉధృతంగా మారిన నేపథ్యంలో అనివార్యంగా లాక్ డౌన్ దిశగా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు కోర్టులు కూడా ప్రభుత్వాలను మందలిస్తూ, ఘాటైన కామెంట్లు చేయడం వల్ల కూడా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాల దిశగా ఆలోచనలు చేయాల్సి వస్తున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్ర (MAHARASHTRA)లో మార్చి రెండో వారం నుంచి పాక్షిక లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో కఠిన లాక్ డౌన్‌కు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటు ఏపీ ప్రభుత్వం (AP GOVERNMENT) కూడా పగటి పూట కర్ఫ్యూ (DAY TIME CURFEW)కు సిద్దమైంది. మే 5వ తేదీ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఏపీవ్యాప్తంగా కర్ఫ్యూ విధించబోతున్నారు. ఇదే దిశగా మరికొన్ని రాష్ట్రాలు కూడా అడుగులు వేస్తున్న సంకేతాలున్నాయి.
దేశంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసిన నేపథ్యంలో కరోనా కట్టడిపై కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT OF INDIA) పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గత కొన్ని రోజులుగా మళ్లీ లాక్‌డౌన్ విధింపే పరిష్కారమని వివిధ వర్గాలనుంచి వినబడుతుండగా, ఇప్పుడు సుప్రీంకోర్టు (SUPREME COURT) సైతం ఆ సంగతిని పరిశీలించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ (UTTAR PRADESH), గుజరాత్ (GUJARAT), మధ్యప్రదేశ్ (MADHYA PRADESH), మహారాష్ట్ర తదితరచోట్ల కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా వున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఎంబీబీఎస్ (MBBS) ఆఖరి సంవత్సరం విద్యార్థులను, బీఎస్సీ నర్సింగ్ (B.Sc NURSING), జీఎన్‌ఎం కోర్సుల్ని పూర్తిచేసుకుని నర్సులుగా అర్హత పొందిన వారిని కరోనా విధుల్లో నియమించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో వున్న వైద్యులు, నర్సుల సంఖ్య సరిపోకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ నిర్ణయం కాస్త ముందుగానే తీసుకోవాల్సిందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. అయితే గత శుక్రవారం (ఏప్రిల్ 30వ తేదీన) దేశంలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రోజు నుంచి మే 1వ తేదీ నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్యల స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. మే 1న 3.92 లక్షలు, మే 2న 3.64 లక్షలు, మే 3న 3.42 లక్షల కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 18 నుంచి 19 లక్షలమందికి కోవిడ్ పరీక్షలు జరుపుతున్నారని అంచనా. గత నెల 18న తొలిసారి 30,000 కేసులు బయటపడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అప్పటినుంచీ ఆ సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇంత విషాదంలోనూ కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్వల్పంగానైనా తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈ విషయంలో తొలుత మహారాష్ట్ర గురించి చెప్పుకోవాలి. అక్కడ కరోనా మహమ్మారి కట్టడికి తీసుకున్న చర్యలు ఫలించడంతో క్రమేపీ తగ్గుతున్నాయి. ఒక దశలో ఆ రాష్ట్రంలో రోజుకు 50,000 కేసులు నమోదైన సందర్భాలు కూడా వున్నాయి. కర్ణాటక (KARNATAKA), కేరళ (KERALA)ల్లో కూడా గత కొన్నాళ్లుగా రోజూ 30,000 కేసులు బయటపడటం మొదలైంది. గత కొన్ని రోజులుగా ఆ ధోరణి తగ్గింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ (DELHI)లో రెండురోజులుగా కేసులు తగ్గడం మంచి పరిణామమే. కానీ ఆక్సిజన్ కొరత ప్రాణాలు తోడేస్తున్నది. సకాలంలో దాని లభ్యత లేకపోవడం వల్ల కరోనా బారినపడినవారు చనిపోతున్నారు. సామాజిక మాధ్యమాల నిండా ఆక్సిజన్ (OXYGEN) సిలెండర్ కోసం అభ్యర్థిస్తూ పెడుతున్న సందేశాలే ఎక్కువగా కనబడటం విషాదకర పరిణామం.
ఒకపక్క రెండో దశ కరోనా వైరస్ (CORONS VIRUS) వల్ల రోగుల్లో మరణాల సంఖ్య పెరుగుతుండగా, సమయానికి ఆక్సిజన్ అందని పరిస్థితి వుండటం విషాదకరం. ఏడాదిక్రితం కరోనా మొదలై, అది తీవ్రమైన ప్రస్తుత తరుణంలో కూడా రోగుల్ని చేర్చుకోవడంలో, వారి చికిత్సలో నిర్దిష్టమైన విధానాలు లేకపోవడం ఆందోళనకరం. వైద్యులు ఎప్పటికప్పుడు ఈ రంగంలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకుంటూ దానికి తగినట్టుగా చికిత్సా విధానాలను ఎటూ రూపొందించుకుంటున్నారు. అందువల్ల గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు కూడా కనబడుతున్నాయి. కానీ అక్కడక్కడ ఈ విషయంలో సమస్యలున్నాయి. వాటిని సరిచేయాల్సిన అవసరం వుంది. అవగాహన లేకనో, సొమ్ము చేసుకుందామనో అవసరం వున్నా లేకపోయినా రోగులకు సీటీ స్కాన్ చేయించే ధోరణి ఎక్కువైంది. దీనిపై వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తుండటం మంచిదే అయినా, ఈ విషయంలో ఇంత జాప్యం చేసివుండాల్సింది కాదు. అలాగే ఆక్సిజన్ గురించి లేదా ఔషధాల గురించి అర్థిస్తున్నవారిపై ఉత్తరప్రదేశ్‌లో ఎడాపెడా కేసులు పెడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. అలా వేధించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని సుప్రీంకోర్టు హెచ్చరించటం స్వాగతించదగ్గది.
అయితే లాక్‌డౌన్ విధించేముందు ప్రభుత్వాలన్నీ బడుగుజీవుల పరిస్థితేమిటన్న అంశంపై శ్రద్ధ పెట్టాలి. క్రితంసారి విధించిన లాక్‌డౌన్ వల్ల ఆ వర్గాలవారు చెప్పనలవికాని అగచాట్లు పడ్డారు. స్థానికంగా వుండేవారికి ఆకలి మాత్రమే ప్రధాన సమస్య. కొంతమందికైనా గూడు వుంటుంది. కానీ వలస వచ్చినవారికి ఆకలితోపాటు ఎక్కడ తలదాచుకోవాలన్న సమస్య వుంటుంది. వారిని పనిలోకి తీసుకున్నవారే ఆ రెండు అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కానీ దాన్ని పాటించినవారు చాలా తక్కువ. కనుకనే ఆకలికి తట్టుకోలేక, రోడ్డున పడి లక్షలాదిమంది వలసజీవులు కాలినడకన స్వస్థలాలకు ప్రయాణం కట్టారు. లాక్‌డౌన్ వల్ల రవాణా సాధనాలన్నీ నిలిచిపోయి ఎండనకా, వాననకా రాత్రీ పగలూ తేడా లేకుండా జనం నడక సాగించాల్సివచ్చింది. ఇందువల్ల వారిలో కొందరు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ గురించి ఆలోచిస్తున్న వేళ అలాంటివారి విషయంలో ఏం చేయాలన్న ఆలోచన చేయటం తప్పనిసరి. కరోనా కేసులు పెరుగుతున్నాయన్న పేరిట గతం మాదిరి లాక్‌డౌన్ విధించటం కాక ఆ బడుగుజీవుల గురించి స్పష్టమైన విధానం రూపొందించాకే, దాన్ని సక్రమంగా అమలు చేయడానికి తగిన కార్యాచరణను నిర్ణయించాకే ఆ విషయంలో ముందడుగేయాలి. అలాగే కేసుల తీవ్రత బాగా ఎక్కువున్న ప్రాంతాలు, అవి అంతగా లేని ప్రాంతాలమధ్య తేడా చూపేలా లాక్‌డౌన్ నిబంధనలుండాలి. దానివల్ల కరోనా వైరస్ నియంత్రణ సమర్థవంతంగా వుంటుంది. ఆర్థిక కార్యకలాపాలకు జరిగే నష్టం కూడా పరిమితంగా వుంటుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.