Uttarkashi Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు.. 10 రోజులు గడుస్తున్నా ఫలించని ప్రయత్నాలు
ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన సంగతి తెలిసిందే. ఇందులో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్టికల్ డ్రిల్లింగ్ ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శిథిలాలు, సొరంగం ప్రవేశ ద్వారం మధ్య దూరం ఎంత ఉందో అధ్యయనం చేయడానికి రెండుసార్లు డ్రోన్ సర్వే చేశారు. కానీ డ్రోన్ శిథిలాల నుంచి 28 మీటర్లకు మించి వెళ్లలేకపోయింది. ఇంతలో డ్రోన్ శిథిలమైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) మోహరించిన రోబోటిక్ డ్రోన్ శిధిలాల కారణంగా..
లక్నో, నవంబర్ 21: ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన సంగతి తెలిసిందే. ఇందులో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్టికల్ డ్రిల్లింగ్ ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శిథిలాలు, సొరంగం ప్రవేశ ద్వారం మధ్య దూరం ఎంత ఉందో అధ్యయనం చేయడానికి రెండుసార్లు డ్రోన్ సర్వే చేశారు. కానీ డ్రోన్ శిథిలాల నుంచి 28 మీటర్లకు మించి వెళ్లలేకపోయింది. ఇంతలో డ్రోన్ శిథిలమైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) మోహరించిన రోబోటిక్ డ్రోన్ శిధిలాల కారణంగా ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో పైపు డ్రిల్లింగ్ మిషన్ ద్వారా మంగళవారం ఉదయం పైపులు నెట్టడం ప్రారంభించారు. లోపల చిక్కుకుపోయిన కార్మికులకు అధికారులు ప్లాస్టిక్ బాటిళ్లలో ఆహారాన్ని పంపిణీ చేశారు. కూలీలు ఆరోగ్యంగా ఉండేందుకు పైపుల ద్వారా కిచెడీ, నారింజ, అరటిపండ్లు, యాపిల్స్ పంపిణీ చేశారు. కిచెడీని ప్లాస్టిక్ బాటిళ్లలో వేసి పైపు ద్వారా కిందకు దించారు. కమ్యూనికేషన్‌ను నిర్వహించడానికి ఛార్జర్‌తో కూడిన ఫోన్‌ను పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
సోమవారం టన్నెల్ నిర్మాణ నిపుణుల అంతర్జాతీయ బృందం అక్కడికి చేరుకుంది. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్ డిక్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ 10వ రోజుకు చేరుకోవడంతో అధికారులు స్వయంగా సంఘటన స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ఇక మంగళవారం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) చార్ ధామ్ మార్గంలో సిల్క్యారా సొరంగం బార్‌కోట్ చివర నుంచి నిలువు డ్రిల్లింగ్ పని చేపట్టనుంది. అందులో కొంత భాగం నవంబర్ 12న కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చీఫ్ దీనిపై ఈ రోజు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. మొత్తం 1,150 మీటర్లలో టన్నెల్‌కు 970 మీటర్ల మేర యాక్సెస్ రోడ్డును బీఆర్‌ఓ పూర్తి చేసింది. మరోవైపు RVNL విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసింది. దీన్ని జిల్లా యంత్రాంగం తనిఖీ చేస్తోంది. నవంబర్ 26 నాటికి వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అత్యవసర సేవల కోసం శిథిలాల గుండా 150 ఎంఎం స్టీల్ పైపును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మూడో ప్రయత్నం జరుగుతోంది.
నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC), సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (SJVNL) సిల్క్యారా చివరన 1-1.2 మీటర్ల వ్యాసం కలిగిన బోర్‌వెల్‌ను తవ్వే పనిని చేపట్టాయి. రోడ్డు, రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ మాట్లాడుతూ.. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు ప్రభుత్వం మల్టీవిటమిన్‌లు, యాంటిడిప్రెసెంట్స్, డ్రైఫ్రూట్స్‌ను పంపిస్తోందన్నారు. అయితే కేవలం ఒకే ప్లాన్‌పై పనిచేయకుండా, కార్మికులను వీలైనంత త్వరగా రక్షించడానికి ఒకే సమయంలో ఐదు ప్లాన్‌లతో పనిచేస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ మిషన్ కోసం తమ వద్ద అన్ని వ్యవస్థలు ఉన్నాయని, విదేశీ కన్సల్టెంట్ల నుంచి కూడా సహాయం పొందుతున్నట్లు తెలిపారు.
సొరంగం పైన ఒక స్థలాన్ని గుర్తించి నిలువు డ్రిల్లింగ్ చేసేందుకు పనులు ప్రారంభమవుతున్నాయన్నారు. అక్కడ నుంచి సుమారు 300-350 అడుగుల వరకు ఒక రంధ్రం వేస్తామన్నారు. అందుకు ఇప్పటికే పెద్ద డ్రిల్లింగ్ యంత్రాన్ని తెప్పించారు. ప్రస్తుతం దీనిని అసెంబుల్ చేస్తున్నామని, త్వరలో శిథిలాల తవ్వేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కాగా నవంబర్ 12 ఉదయం 5:30 గంటల ప్రాంతంలో సిల్క్యారా సొరంగంలో కొంత భాగం కూలిపోయింది. వారం రోజులు గడిచినా 41 మంది కూలీలను ప్రభుత్వం రక్షించలేకపోయింది. శిధిలాల ద్వారా పైపులను చొప్పించడానికి ప్రయత్నించగా.. మధ్యలోనే ఆగర్ యంత్రం పాడైపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.