White tigress: గ్వాలియర్ జూలో కొత్త అతిథులు.. మూడు కూనలకు జన్మనిచ్చిన తెల్ల పులి
ఇక్కడి జూలో అరుదైన జంతువులు ఉండటంతో దీనిని రక్షిత ప్రదేశంగా ప్రభుత్వం ప్రకటించింది. గాంధీ జూపార్క్‌లో తెల్ల పులి, గోల్డెన్ నెమలి ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా గాంధీ జూలాజికల్ పార్క్‌లో గల తెల్ల పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. గాంధీ జూపార్క్‌లో ఉన్న మీరా అనే తెల్ల పులి మూడు కూనలకు జన్మనిచ్చింది. దీంతో ఈ జూలో పులుల సంఖ్య పదికి చేరింది. గురువారం ఉదయం 11.30 గంటలకు మీరా మూడు పిల్లలకు జన్మనిచ్చిందని జూ క్యూరేటర్ డాక్టర్ గౌరవ్ పరిహార్ తెలిపారు. వాటిలో ఒక పులి పిల్ల తెల్లగానూ, రెండు పసుపు రంగులో ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుతం తల్లితోపాటు పిల్లలు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో ఉంచి వాటిని సంరక్షిస్తున్నామన్నారు. మీరా 2013లో ఇదే జూలో జన్మించిందని పేర్కొన్నారు. మీరా మూడోసారి పిల్లలకు జన్మనిచ్చింది.
గ్వాలియర్‌లోని గాంధీ జూపార్క్‌ని 8 హెక్టార్ల విస్తీర్ణంలో 1992లో నిర్మించారు. ఇది భారత్‌లో అతిపెద్ద జూలాజికల్ పార్కుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పార్కులో సాధారణంగా కనిపించే అడవి జంతువులతోపాటు అరుదైన జాతుల జంతువులు కూడా అనేకం కనిపిస్తాయి. అరుదైన జంతువులు ఉండటంతో దీనిని రక్షిత ప్రదేశంగా ప్రభుత్వం ప్రకటించింది. గాంధీ జూపార్క్‌లో తెల్ల పులి, గోల్డెన్ నెమలి ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..