Telangana Congrss: తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త చర్చలు.. వారి భేటీ వెనకున్న ఆంతర్యమేంటి..?
మొత్తంగా.. రేణుకాచౌదరి ఇంట్లో రేవంత్‌రెడ్డి టీమ్ సమావేశం కావడం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరలేపింది. సీఎం పదవి విషయంలో భట్టివిక్రమార్క- రేవంత్‌రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న వేళ.. రేణుకతో..
తెలంగాణలో అప్పుడే ఎలక్షన్ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఇంట్లో పలువురు కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షట్కర్, ఇతర నేతలు హాజరయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కానీ.. ఈ భేటీ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చలు నడుస్తున్నాయి.
వాస్తవానికి.. టీ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి రాజకీయాన్ని ఆ పార్టీలోని సీనియర్లు బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మొన్నామధ్య ఏకంగా భట్టీ ఇంట్లో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి మరీ రేవంత్‌రెడ్డి తీరుపై ఫైరయ్యారు. ఆ తర్వాత.. అధిష్టానం రంగంలో దిగి ఆ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టినా చాపకింద నీరులా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సంగతి అలా ఉంటే.. కొద్దిరోజులు నుంచి మళ్లీ తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం పదవిపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. సీఎం పదవి విషయంలో రేవంత్‌రెడ్డి- భట్టివిక్రమార్క మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్‌రెడ్డి సీఎం కావాలని కొందరు అంటుంటే.. ఆయన వ్యతిరేక వర్గం మాత్రం దళిత సీఎం యాంగిల్‌లో భట్టి విక్రమార్క పేరును తెరపైకి తెస్తోంది. ఇప్పుడీ వ్యవహారం టీకాంగ్రెస్‌లో సెగలు పుట్టిస్తోంది.
ఇదిలావుంటే.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో రేణుకచౌదరి- భట్టి విక్రమార్క మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఎప్పటినుంచో టాక్ ఉంది. వాళ్లిద్దరికీ ఏమాత్రం పొసగదని తెలుసు. సరిగ్గా ఈ సమయంలోనే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఆయా పరిస్థితులను ఆయన అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే.. సడెన్‌గా రేణుకాచౌదరి ఇంటికి రేవంత్‌రెడ్డి తన వర్గంతో వెళ్లారని టాక్ నడుస్తోంది. శతృవుకు శతృవు మిత్రుడన్నట్లుగా రేణుకాచౌదరి ఇంట్లో రేవంత్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేయించారని సొంత పార్టీలోనే చర్చలు సాగుతున్నాయి. పైకి.. ఖమ్మంలో జరిగే నిరుద్యోగ నిరసన బహిరంగ సభపై చర్చ జరిగిందని టీకాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నా.. అసలు కథ వేరే ఉందన్న టాక్ వినిస్తోంది. అంతేకాదు.. మొన్నామధ్య జరిగిన టీకాంగ్రెస్ సభకు భట్టీ వర్గం ఖర్గేను తెప్పిస్తే.. త్వరలో హైదరాబాద్ జరగబోయే నిరుద్యోగ నిరసన సభకు రేవంత్‌రెడ్డి వర్గం ప్రియాంకాగాంధీని రప్పించేందుకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా.. రేణుకాచౌదరి ఇంట్లో రేవంత్‌రెడ్డి టీమ్ సమావేశం కావడం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరలేపింది. సీఎం పదవి విషయంలో భట్టివిక్రమార్క- రేవంత్‌రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న వేళ.. రేణుకతో రేవంత్ భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. అయితే.. భట్టీకి చెక్ పెట్టేందుకే రేవంత్‌రెడ్డి.. రేణుకాచౌదరి ఇంట్లో మీటింగ్ పెట్టించారా?.. లేక.. వ్యతిరేక వర్గంతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్నది చూడాలి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..