Azadi Ka Amrit Mahotsav: ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ అంటే ఏమిటి..? ఇందులో ఎలా భాగస్వామ్యం కావాలి..?

Azadi Ka Amrit Mahotsav:బ్రిటీష్‌ తెల్లదొరల కబంధహస్తాల నుంచి భారతమాతకు విముక్తి లభించి75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర..

Azadi Ka Amrit Mahotsav: ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ అంటే ఏమిటి..? ఇందులో ఎలా భాగస్వామ్యం కావాలి..?
Azadikaamritmahotsav
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 11, 2021 | 2:26 PM

Azadi Ka Amrit Mahotsav: బ్రిటీష్‌ తెల్లదొరల కబంధహస్తాల నుంచి భారతమాతకు విముక్తి లభించి75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ వేడుకల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘ఆజాది కి అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలు 75 వారాల పాటు కొనసాగుతాయని..ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శన నవంబర్ వరకు కొనసాగుతుందని..‘ఆజాది కీ అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మహోత్సవ్‌ ఏడాదిన్నర పాటు 75 వారాలు కొనసాగనున్నాయని వివరించారు.

గ్రామస్థాయిలో సర్పంచులు కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ జాతీయగీతం పాడి రాష్ట్ర గీత్ వెబ్ సైట్ లో ఉంచాలని ఆయన సూచించారు. 2047 నాటికి దేశం ఏ స్థాయికి చేరాలో తమ అభిప్రాయాలను పంచుకోవాలని సూచించారు. ఆజాదీ కీ అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా ప్రతి పౌరుడు జనగణమణ పాడాలని కేంద్రం పిలుపునిస్తోంది. 50 లక్షల మంది భారతీయులు ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నారని.. మీరు కూడా జాతీయ గీతాన్ని పాడి www.rashtragaan.in లో అప్‌లోడ్‌ చేయాలని సూచిస్తోంది. ఆగస్ట్‌ 15న ఈ వీడియోలను లైవ్‌లో ప్రసారం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మీరు జాతీయ గీతాన్ని పాడడమే కాకుండా ఇతరులను కూడా జనగణమణ పాడే విధంగా ప్రోత్సాహించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే ఏమిటి..?

ఆజాదీ అంటే స్వేచ్ఛ.. అమృత్ అంటే అజ‌రామ‌రం.. మ‌హోత్సవ్ అంటే అతిపెద్ద సంరంభం.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే అజ‌రామ‌ర‌మైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సంరంభం అని అర్థం. దాదాపు రెండు వంద‌ల ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వ‌ల‌స పాల‌కుల‌కు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం సాగిన ఉద్యమమే జాతీయోధ్యమం.. స్వాతంత్ర్యోద్యమం.. భారత జాతి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే 1947లో దేశానికి స్వరాజ్యం సిద్ధించింది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో ప్రజలందరూ భాగం కావాలి:

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో ప్రజలందరూ భాగం కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో సర్పంచులు కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ జాతీయగీతం పాడి రాష్ట్ర గీత్ వెబ్ సైట్ లో ఉంచాలని సూచించారు.

మహోత్సవ్‌ ఉద్దేశం ఏమిటి..?

భారత స్వాతంత్ర్య చరిత్రతో ముడిపడివున్న  క్షణాలను గుర్తించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు జాతీయ గీతాన్ని డిజిటల్‌ పద్దతిలో గరిష్ట సంఖ్యలో ఏకకాలంలో పాడాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఈ సారి రికార్డు చేసిన వీడియోలు ఎర్రకోట, విమానాశ్రయంలో ప్రదర్శించబడతాయి. అందుకే ప్రభుత్వం జాతీయ గీతాల కార్యక్రమాన్ని దేశ ప్రజల ముందుంచింది. జాతీయ గీతం యొక్క వీడియోలను రూపొందించే వారికి రెండు అవకాశాలు లభిస్తాయి. ముందుగా భారతదేశ ప్రఖ్యాత గీత రచయిత, కొత్తపాటను పాడే అవకాశం పొందుతాడు. రెండోది యూట్యూబ్‌ వంటి టీవీ, రేడియో, సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌లలో ఉత్తమ 100 వీడియోలు విడుదల చేయబడాతాయి.

ఈ వేడుకల కోసం 16 చరిత్రాత్మక ప్రాంతాల గుర్తింపు:

అయితే ఈ మహోత్సవంలో భాగంగా వేడుకలను ప్రారంభించే 16 చరిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఢిల్లీలోని ఖిలా రాయ్ పిథోరా వద్ద ప్రారంభమవుతాయి. మిగతా 15 ప్రాంతాలైన గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, ఐజ్వాల్‌లోని భువనేశ్వరి ఆలయం, ముంబయిలోని అగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కొణార్క్ ఆలయం, లక్నోలోని హిమాచల్‌ ప్రదేశ్‌ రెసిడెన్సీ బిల్డింగ్ కాంగ్రా కోట, ఝాన్సీ కోట, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్వీకుల నివాసం, కర్ణాటకలోని చిత్రదుర్గ కోట, వారణాసిలోని మహల్ ఘాట్, అమరావతి, జైపూర్ ప్యాలెస్ వద్ద ఈ వేడుకలు నిర్వహిస్తారు.

వీడియో ఎలా అప్‌లోడ్‌ చేయాలి:

ముందుగా rastrugaan.in కి మొదట లాగిన్‌ కావాలి. ఈ వెబ్‌సైట్‌లో మీరు మూడు దశలను అనుసరించాల్సి ఉంటుంది.

1. మీ పేరు, ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి 2. జాతీయ గీతాన్ని నిలబడి రికార్డు చేయాలి 3. రికార్డు చేసిన వీడియోను అప్‌లోడ్‌ చేయాలి. 4. ఆ తర్వాత మీ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఇవీ కూడా చదవండి

National Flag: జాతీయ జెండా వినియోగంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఉత్తర్వులు జారీ చేసిన హోంమంత్రిత్వ శాఖ

PM Modi: దేశ యువతకు స్ఫూర్తినిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం.. ప్రధాని మోదీ