AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మీడియాను నియంత్రించలేం’, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, ఈసీ అభ్యర్థనకు తిరస్కృతి, పిటిషన్ కొట్టివేత

కోర్టుల్లో జడ్జీలు మౌఖికంగా చేసే వ్యాఖ్యలను రిపోర్టు చేయకుండా మీడియాను నియంత్రించాలన్న ఎన్నికల కమిషన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వ్యాఖ్యలు చేయకుండా జడ్జీలను నియంత్రించడం,,,

'మీడియాను నియంత్రించలేం', సుప్రీంకోర్టు స్పష్టీకరణ, ఈసీ అభ్యర్థనకు తిరస్కృతి, పిటిషన్ కొట్టివేత
Supreme Court
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: May 06, 2021 | 3:18 PM

Share

కోర్టుల్లో జడ్జీలు మౌఖికంగా చేసే వ్యాఖ్యలను రిపోర్టు చేయకుండా మీడియాను నియంత్రించాలన్న ఎన్నికల కమిషన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వ్యాఖ్యలు చేయకుండా జడ్జీలను నియంత్రించడం, అలాగే వారి అబ్జర్వేషన్లను (మౌఖిక వ్యాఖ్యలను) మీడియా రిపోర్టు చేయకుండా ఆపడం తిరోగమన చర్యే అవుతుందని జస్టిస్ డీ,వై. చంద్రచూడ్, జస్టిస్ షాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఈసీ పిటిషన్ ని కొట్టివేసింది. కోర్టు ప్రొసీడింగులపై రిపోర్ట్ చేయకుండా మీడియా మీద ఆంక్షలు ఉండవు… భావ ప్రకటనా స్వేచ్చలో ఇది భాగం అని గురువారం కోర్టుస్పష్టం చేసింది. ఇటీవల మద్రాస్ హైకోర్టు మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ సుప్రీంను ఆశ్రయించిన విషయం గమనార్హం. దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోవడానికి ఈసీ కారణమని, ఈ సంస్థ అధికారులమీద హత్యాభియోగాలు ఎందుకు నమోదు చేయరాదని హైకోర్టు జడ్జీలు ఈ మధ్య వ్యాఖ్యానించారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ ఈసీ సుప్రీంకోర్టుకెక్కింది. ఈ విధమైన వ్యాఖ్యలను రిపోర్టుచేయకుండా మీడియాను నియంత్రించాలని తన పిటిషన్ లో కోరింది. కానీ ఇలా మీడియాను తాము ఆపలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇప్పుడు ప్రజలు చాలావరకు డిజిటల్ ఓరియంటెడ్ అని, సమాచారం కోసం ఇంటర్నెట్ ను కూడా చూస్తున్నారని, ఈ నేపథ్యంలో రిపోర్టింగ్ నుంచి కొత్త మీడియాను కూడా నిరోధించజాలమని బెంచ్ పేర్కొంది. దీనిపై ఫిర్యాదు చేసేబదులు రాజ్యాంగ సంస్థలు మరింత మెరుగ్గా పని చేస్తే బాగుంటుందని వెల్లడించింది. ఇదే సమయంలో జడ్జీలు ఆఫ్ ది రికార్డుగా మాట్లాడేటప్పుడు సంయమనంతో వ్యవహరించాలని, వారి భాష రాజ్యాంగ విలువలను ప్రతిబింబించేదిగా ఉండాలని బెంచ్ వివరించింది.

జుడిషియల్ రికార్డుల్లో మౌఖికంగా చేసే వ్యాఖ్యలు భాగం కాదని, అందువల్ల వాటిని రికార్డుల నుంచి తొలగించాలన్న ప్రసక్తే ఉండదని కోర్టు పేర్కొంది. అసలు ఈసీ అభ్యర్థనలో మెరిట్ లేదని బెంచ్ అభిప్రాయపడింది. కోవిడ్ పరిస్థితిపై హైకోర్టులు సరిగా స్పందించి ప్రశంసనీయంగా పని చేస్తున్నాయని కోర్టు అభినందించింది. పాండమిక్ మేనేజ్ మెంట్ ని సమర్థంగా పర్యవేక్షిస్తున్నాయని వ్యాఖ్యానించింది. దేశంలో 70 ఏళ్లుగా ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తున్న ఈసీ కూడా ప్రజాస్వామ్య మనుగడకు అవసరమే అని కోర్టు క్లారిటీ ఇచ్చింది.

మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ :  ఐడియా అదుర్స్‌ రైతన్న వినూత్న ప్రయోగం వైరల్ అవుతున్న వీడియో ..: Farmer Creative Viral Video.