Uttar Pradesh: కారు కట్నంగా ఇవ్వలేదని భార్యకు తలాక్ చెప్పి వదిలించుకున్న భర్త.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన భార్య
కట్నం డిమాండ్‌ను నెరవేర్చలేదని ట్రిపుల్ తలాక్ చెబుతూ తనను వేధిస్తున్నారని భర్త సహా ఐదుగురిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టం తెచ్చినా..ఎక్కడో చోట ట్రిపుల్ తలాక్ కేసులు ఆగడం లేదు. తాజాగా ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. కట్నంతో పాటు కారు ఇవ్వలేదని భర్త మహిళకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో పాటు వేధింపులకు పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది. వాస్తవానికి ఈ ఘటన ఘజియాబాద్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లోని కైలా బట్టీ ప్రాంతంలో జరిగింది. వరకట్నం డిమాండ్‌ను తీర్చలేదని అత్తమామలు వేధించారని ఓ మహిళ ఆరోపించారు. ఆ మహిళ తన భర్తతో సహా ఐదుగురిపై ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే..
కైలా భట్టా నివాసి అయిన రుబీనాకు నివారీకి చెందిన ఇమ్రాన్ సైఫీతో డిసెంబర్ 2017లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 4 సంవత్సరాల పాప ఉంది. పెళ్లయినప్పటి నుంచి వరకట్నం డిమాండ్‌ను తీర్చలేదని శారీరకంగా, మానసికంగా అత్తమామలు వేధించారని యువతి ఆరోపించింది.
కట్నం వేధింపులను భరించలేని రుబీనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తమామలతో రాజీ కుదుర్చుకున్నారు. కొంతకాలం తర్వాత భర్త రాజస్థాన్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం సాకుతో వారం రోజుల పాటు వెళ్లి ఆమెను తల్లిగారింట్లో విడిచిపెట్టాడు. ఆ సమయంలో అత్తమామలు తన నగలు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించింది. ఇంతలో భర్త రుబీనాకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పి కాల్ డిస్‌కనెక్ట్ చేశాడని ఆరోపించింది.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని నగర్ కొత్వాలి ఇన్‌ఛార్జ్ అమిత్ కుమార్ ఖరీ తెలిపారు. త్వరలో మహిళ అత్తమామలను అరెస్టు చేయనున్నామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..