AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరె బద్మాష్..! లంచం ఇవ్వలేదని ఇంత పైశాచికత్వమా?.. 14 ఏళ్ల బాలికపై డాక్టర్ అమానుషం!

ఉత్తరప్రదేశ్‌లో మానవత్వాన్ని మంటగలిపేలా తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ వైద్యుడు ప్రవర్తించిన తీరుపై సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. లంచం ఇవ్వలేదన్న ఒకే ఒక్క కోపంతో, తాను సర్జరీ చేసి అతికించిన ఒక 14 ఏళ్ల బాలిక కాలి ఎముకను ఆ వైద్యుడే స్వయంగా మళ్లీ విరగ్గొట్టాడు. ఈ అమానుష ఘటన వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

అరె బద్మాష్..! లంచం ఇవ్వలేదని ఇంత పైశాచికత్వమా?.. 14 ఏళ్ల బాలికపై డాక్టర్ అమానుషం!
Doctor Re Break Girl Leg
Balaraju Goud
|

Updated on: Jun 04, 2026 | 7:22 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో మానవత్వాన్ని మంటగలిపేలా తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ వైద్యుడు ప్రవర్తించిన తీరుపై సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. లంచం ఇవ్వలేదన్న ఒకే ఒక్క కోపంతో, తాను సర్జరీ చేసి అతికించిన ఒక 14 ఏళ్ల బాలిక కాలి ఎముకను ఆ వైద్యుడే స్వయంగా మళ్లీ విరగ్గొట్టాడు. ఈ అమానుష ఘటన వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన రేష్మ అనే మహిళకు భర్త లేరు. ఆమె తన 14 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. నెలన్నర క్రితం ఆ బాలిక ఎడమకాలి ఎముక విరగడంతో చికిత్స నిమిత్తం రేష్మ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే, అక్కడ శస్త్రచికిత్స చేయాలంటే రూ. 25 వేలు లంచం ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. భర్త లేని తాను అంత పెద్దమొత్తం ఇచ్చుకోలేనని రేష్మ ఎంత బతిమాలినా వారు సర్జరీ చేయడానికి ఒప్పుకోలేదు.

దీంతో దిక్కుతోచని స్థితిలో రేష్మ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించి తన బాధను చెప్పుకున్నారు. స్పందించిన మేజిస్ట్రేట్, ఆ బాలికకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అయినప్పటికీ లంచావతారాలైన హాస్పిటల్ సిబ్బంది వెనక్కి తగ్గలేదు. లంచం ఇస్తేనే ఆపరేషన్ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో రేష్మ అప్పుచేసి అతికష్టం మీద రూ. 8 వేలు చెల్లించారు. అనంతరం డాక్టర్ చతుర్వేది అనే వైద్యుడు బాలికకు సర్జరీ పూర్తి చేశాడు. అయితే, తదుపరి పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు మిగిలిన డబ్బు కూడా తీసుకురావాలని ఖచ్చితంగా చెప్పాడు.

కొద్దిరోజుల తర్వాత బాలికను చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకురాగా, రేష్మ మిగిలిన లంచం డబ్బులు తీసుకురాలేకపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన డాక్టర్ చతుర్వేది క్రూరంగా ప్రవర్తించాడు. బాలిక నడవగలుగుతుందో లేదో పరీక్షిస్తానంటూ.. ఆమె ఎడమకాలిని పట్టుకుని గట్టిగా మెలిపెట్టాడు. ఆ చిన్నారి నొప్పితో అల్లాడిపోతూ కేకలు వేస్తున్నా వినకుండా.. “కాలి ఎముకను సరిచేస్తున్నాను” అంటూ నమ్మబలికాడు.

ఇంటికి వెళ్లిన తర్వాత కూడా బాలిక నొప్పితో విలవిల్లాడుతుండటంతో, అనుమానం వచ్చిన తల్లి ఆమెను మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్-రే తీయించింది. ఆ రిపోర్టులు చూసి రేష్మ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వ వైద్యుడు ఉద్దేశపూర్వకంగా కాలిని మెలిపెట్టి, అంతకుముందు అతికిన ఎముకను మళ్లీ విరగ్గొట్టినట్లు ఎక్స్-రేలో స్పష్టంగా తేలింది.

వైద్యుడి పైశాచికత్వంపై బాధిత కుటుంబం, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారం కాస్తా ముజఫర్‌నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ దృష్టికి వెళ్లడంతో, ఆయన సదరు వైద్యుడిపై తక్షణమే విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాపాడాల్సిన వైద్యుడే ఇలా లంచం కోసం చిన్నారి కాలు విరగ్గొట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us